Friday, November 22, 2024

రాహుల్ జైత్రయాత్ర

  • రాహుల్ వ్యక్తిత్వాన్నీ, పార్టీ బలాన్నీ ఎంతోకొంత పెంచిన నడక
  • వచ్చే ఎన్నికలపైన పాదయాత్ర ప్రభావం ఉంటుందోలేదో చూడాలి

‘భారత్ జోడో యాత్ర’ పేరుతో రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగిన ఈ యాత్ర ముఖ్యంగా రాహుల్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.”జోడుగా కలిసి సాగుదాం”… అనే నినాదంతో మొదలైన ఈ యాత్ర వల్ల పార్టీలో జోరు పెంచిందన్నది వాస్తవం. రేపటి ఎన్నికల ఫలితాల్లో తప్పకుండా ప్రభావం చూపించవచ్చు.అవి ఏ స్థాయిలో ఉంటాయన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వారి వారి రాజకీయ ఆలోచనా ధోరణులు ఎట్లాగూ ఉంటాయి. ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే ప్రకారం కొన్ని ఆసక్తికరమైన అంశాలు వ్యక్తమయ్యాయి. ఈ యాత్ర సందడి సృష్టించిందన్నది ప్రధానమైన అభిప్రాయం. ప్రజలు మంచి సంఖ్యలో పాల్గొనడం మంచి సంకేతమన్నది రెండో ప్రశంస. జనసమూహనికి దగ్గరవ్వడంలో ఇది చాలా బాగా పనిచేసిందన్నది మరో ముఖ్యమైన వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీ పునఃప్రాభవానికి రాహుల్ పాత్ర ఎన్నతగినదన్నది ఇంకో మంచి మాట. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో 190కి పైగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు దక్కుతాయని వ్యక్తం చేయడం కీలకమైన విషయం. 4వేల కిలోమీటర్లు, 12 రాష్ట్రాలు, మధ్య మధ్యలో కాస్త అంతరాయాల సంగమంగా సాగిన ఈ నడక పార్టీని ఇక నుంచైనా పరుగులెత్తిస్తే  ప్రయోజనం నెరవేరుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అక్కడ కూడా మెరుగైన ఫలితాలను రాబట్టాలనే వ్యూహం అందులో లేకపోలేదు.

Also read: అస్తమించిన ‘అపర సత్యభామ’

Indian National Congress (Congress) - Bharat Jodo Yatra: Rahul Gandhi  speaks of Shunyata, Fanaa in Srinagar - Telegraph India
మంచులోో అన్నాచెల్లెళ్ళ ఆట

వరుస ఓటముల అనంతరం పాదయాత్ర

దాదాపు 8 ఏళ్ళు పైనుంచి వరుస ఓటములు, దుష్ఫలితాలు,సొంత క్యాడర్ ను పోగొట్టుకున్న నష్టాలు, ముఖ్యనేతలను దూరం చేసుకున్న దురదృష్టాల నడుమ పార్టీ వెన్నెముకను పటిష్ఠం చేసే దిశగానే ఈ యాత్ర రచన చేశారన్నది నిజం. ముఖ్యంగా రాహుల్ గాంధీని పార్టీ ప్రధాననాయకుడిగా, ప్రధానమంత్రి అభ్యర్థిగా మరోమారు చాటిచెప్పే పథకరచనలో భాగమే ఇదంతా అన్నది వాస్తవం. లౌకిక విలువల పరిరక్షణకు, దేశ ప్రజల ఐక్యత కోసమే ఈ యాత్ర చేపట్టానని రాహుల్ అనేకసార్లు చెప్పారు. పార్టీ కోసమో, నా కోసమో కాదని గట్టిగా చెబుతున్నారు. అవి వినడానికి పైకి గొప్పగా కనిపిస్తున్నాయి.పరిణితి, వివేకం, ఔన్నత్యం చాటేలా వినిపిస్తున్నాయి. మొత్తంగా జోడో యాత్రలో రాహుల్ నడిచిన తీరుకు పలు వర్గాల నుంచి మంచి మార్కులే వచ్చాయి. మొన్న కశ్మీర్ లో నిర్వహించిన ముగింపు సభ వేదికపై నుంచి కూడా ఆయన బలమైన ప్రసంగం చేశారు. ఆప్తులను కోల్పోడంలో ఉండే క్షోభ మోదీ, అమిత్ షాలకు ఏం తెలుస్తుందని రాహుల్ అన్న మాటలు ప్రభావశీలమైనవే. నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీని పోగొట్టుకున్న తీరును లోకానికి మరోమారు గట్టిగా గుర్తుచేసి భావోద్వేగాలను రేకెత్తించే యత్నం రాహుల్ చేశారు. మంచువర్షంలోనూ ఆగకుండా సభ నిర్వహించడం, కశ్మీర్ కు చెందిన ప్రధాన ప్రతిపక్షాలు జోడుగా నిలవడం ఎంతోకొంత ప్రయోజనాన్ని, ప్రభావాన్ని అందించకపోవు. అధికార పార్టీపై విరుచుకు పడిపోవడమే కాక, ఆరెస్సెస్ పైనా నిప్పులు కురిపించి మైనారిటీల మార్కులు కొట్టే ప్రయత్నం చేశారు.

Also read: తెలుగువారికి భారతరత్న దక్కదా?

As yatra ends, Rahul tears into govt over security in Kashmir
ప్రజల మధ్య రాహుల్, ప్రియాంక నడక

ఆచితూచి అడుగేయాలి

తాము కశ్మీర్ వాసులమేనని గుర్తు చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో ప్రియాంకా గాంధీ కూడా పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో జవజీవాలు నింపడానికి పాదయాత్రలు ఏదోక స్థాయిలో ఉపయోగపడతాయి. అంతటితోనే అన్నీ జరిగిపోవు, అన్నీ దరిచేరవు. దేశవ్యాప్తంగా పార్టీని పునర్నిర్మాణం చెయ్యాలి. పార్టీలో ఐక్యత పెంచాలి. దూరమైన నాయకులను దగ్గరకు తెచ్చుకోవాలి. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో వెయ్యికిపైగా ఓట్లు తెచ్చుకున్న శశిథరూర్ ను సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఇప్పటికే వృద్ధుడు. శశిథరూర్ వంటివారిని జోడుగా ఉంచుకోవాలి. వాడే భాష, చేసే వ్యాఖ్యలు, ఎంచుకొనే అంశాలు, రచించే వ్యూహాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో గౌరవమైన, బలమైన సీట్లు వస్తేనే మిగిలిన విపక్షాలు కాంగ్రెస్ చెంతకు చేరుతాయి. పాదయాత్రలు చాలామంది నాయకులకు సత్ఫలితాలనే అందించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మార్పులు రావాలి. పార్టీ పట్ల, అగ్రనాయకుల పట్ల ప్రజల్లో, పార్టీ నేతల్లో విశ్వాసాన్ని పెంచాలి. ప్రస్తుతానికి నరేంద్రమోదీ అధినాయకత్వంలోని అధికార పార్టీ బలంగానే, ఎదురులేని శక్తిగానే ఉంది. యాత్రలకు, సభలకు వచ్చే జనం ఓటర్లుగా మారితేనే ఎవరికైనా అసలు ప్రయోజనం నెరవేరుతుంది.

Also read: ‘ఆస్కార్’లో చోటు దక్కిన నాటు నాటు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles