Sunday, November 24, 2024

తెలుగువారికి భారతరత్న దక్కదా?

  • శిఖరాలను సన్మానించరా?
  • ఎన్టీఆర్, పీవీ, ఘంటసాల, అక్కినేని వంటి యోగ్యులు ఎందరో

మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు. మహానటుడు,మహానేత ఉదయించిన గొప్ప రోజు. ఇది శత జయంతి పూర్తయ్యే ఏడు.  మరో మహానటుడు అక్కినేని నాగేశ్వరావు శతజయంతి ఈ సంవత్సరం ఈ సెప్టెంబర్ 20వ తేదీ మొదలవుతుంది. ‘అపరగంధర్వుడు’ ఘంటసాల శతవసంతాలు పోయిన ఏడే పూర్తయ్యాయి.’అపరచాణుక్యుడు’ పీవీ నరసింహారావు శతవత్సరం 2021లోనే ముగిసింది. ఒక సంవత్సరం అటుఇటుగా పీవీ నరసింహారావు,ఘంటసాల, ఎన్టీఆర్,అక్కినేని శతజయంతులు వచ్చాయి. వీరందరూ వారి రంగాల్లో శిఖర సమానులు, మేరు నగధీరులు. నాల్గు పయోధులో అన్నట్లు ప్రతిభా సముద్రులు. భారత ప్రతిభా భారతిని చాటిచెప్పిన పుంభావ భారతులు. వీరందరూ నూటికి నూరు శాతం ‘భారతరత్న’ పురస్కారానికి అర్హులు. వీరందరికీ భారతరత్న రావాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది. అక్కినేని పేరు ఇంకా ఆ స్థాయిలో వినపడకపోయినా శత వసంత వేళల్లో వినపడి తీరుతుంది. వీరందరూ తెలుగువారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారం ఇందరికి అందించడం ఆచరణ పరంగా అసాధ్యం. ఎవరి ప్రతిభ,ప్రభ వారివి. రాజకీయ కోణాల్లో చూసుకుంటే ఎన్టీఆర్ వైపే మొగ్గు ఎక్కువ ఉంది. ఎన్టీఆర్ పై ఈ మధ్య మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల జల్లులు కురిపించారని విన్నాం.

Also read: ‘ఆస్కార్’లో చోటు దక్కిన నాటు నాటు…

తెలుగువారి హృదయాలను దోచుకోరా?

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలహీనంగానే ఉంది. తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలని ఊగుతోంది. సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే తెలుగువారి హృదయాలను గెలవాలని చూస్తోంది. ఇటీవలే కళా, సాంస్కృతిక రంగాల కోటాలో సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరచారు. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఈ సంవత్సరం ఎన్టీఆర్ శతజయంతి వసంతం కాబట్టి ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ తప్పక ప్రకటిస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. 2021లో పీవీ నరసింహారావు విషయంలోనూ ఇలాగే అనుకున్నారు. కానీ అది జరుగలేదు. పార్లమెంట్ సాక్షిగా పీవీని మోదీ అనేకసార్లు శ్లాఘిoచారు. పొగడ్తలకే పరిమితమై పోయింది. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రదానం చేసి బిజెపి ప్రభుత్వం సంచలనం సృష్టించింది. అదే ఉదారతను పీవీ విషయంలో చాటుకొనే ఉంటే బాగుండేది. ప్రణబ్ తో పోల్చుకుంటే పీవీ స్థాయి అన్ని రకాలుగా చాలా పెద్దది. సరే! ఘంటసాల విషయం ప్రస్తుతానికి స్తబ్దుగానే ఉంది. ఎన్టీఆర్ పుట్టినరోజు, వర్ధంతి నాడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలు మార్మోగడం చాలా ఏళ్ళ నుంచి వినపడుతున్న విషయం. అది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు చందంగా మారిపోయిందనే స్పృహలోకి అందరూ వచ్చేశారు.  చంద్రబాబు గట్టిగా పూనుకొని ఉంటే ఎప్పుడో వచ్చిఉండేదనే మాటలు కూడా వింటూనే ఉన్నాం.

Also read: ఐటీ ఉద్యోగుల ఇక్కట్లు

రామారావు విషయంలో వివాదం

కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ ప్రకటిస్తే, ఆయన సతీమణి హోదాలో లక్ష్మీపార్వతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తతంగం ఇష్టంలేకనే చంద్రబాబు మిన్నకున్నాడనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కేంద్రంలో బిజెపి (ఎన్ డి ఏ) అధికారంలో ఉండి, తెలుగుదేశం పార్టీ ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న సమయాల్లో కూడా ఈ సంకల్పం నెరవేరకపోవడానికి  అదే కారణమని చంద్రబాబుపై మొదటి నుంచీ ఉన్న ప్రధానమైన ఆరోపణ. ఈ విషయంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు సరళిలోనే ఉన్నారని మరోమాటగా చెప్పుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ /యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి మంత్రిగానూ పనిచేశారు. ఆమెది కూడా ఇదే అభిప్రాయం కాబట్టి, భారతరత్న కోసం ఆమె కృషి చేయలేదనే విమర్శ పురందేశ్వరిపై కూడా ఉంది. నిజానిజాలు ఎలా ఉన్నా,ఎన్టీఆర్ కు భారతరత్న దక్కకపోవడానికి ఆయన కుటుంబసభ్యులే ప్రధాన కారణమనే కోణం ప్రజల్లోకి బలంగానే వెళ్లిపోయింది. ఇప్పుడు ‘భారతరత్న’ ఇవ్వాల్సిన తెలుగువారి జాబితా పెరిగిపోయింది. ఆ మాటకొస్తే మంగళంపల్లి బాలమురళీకృష్ణకు కూడా దక్కలేదు. ఈ సందర్భంలో, బాలమురళి తరచూ చెప్పే మాటలను ఒకసారి సరదాగా గుర్తు తెచ్చుకుందాం. భారతరత్న ఇంతవరకూ మీకు ఎందుకు రాలేదు? అనే ప్రశ్న మీడియాతో పాటు చాలామంది ఆయనకు సంధిస్తూ ఉండేవారు. “భారతరత్న నాకు రాకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు. నేను తెలుగువాడిని కాబట్టి, బ్రాహ్మణుడను కావడం చేత, మగవాడిని కాబట్టి…”. అదీ మంగళంపల్లి వారి సమాధానం. మిగిలిన రెండు విషయాలు ఎలా ఉన్నప్పటికీ, తెలుగువాడు కాబట్టి రాలేదని అనుకుందాం. ప్రణబ్ ముఖర్జీ జీవించి ఉన్నప్పుడే అందుకున్నారు. అక్కడ పీవీకి అన్యాయం జరిగిందని భావించక తప్పదు. సంగీత రంగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్ కు దక్కాయి కానీ, మంగళంపల్లిని వరించలేదు.

Also read: తగ్గుతున్న సంతానోత్పత్తి

తెలుగు వెలుగు ఒక్కటీ లేదు

మొత్తంగా చూస్తే, ‘భారతరత్న’ అందుకున్న తెలుగువారు ఇంతవరకూ ఒక్కరు కూడా లేకపోవడం విషాదం. తెలుగువారిలో ఐక్యత కరువవ్వడం, రాజకీయంగా ఎదిరించే సత్తా లేకపోవడం, ప్రజల్లో పోరాటపటిమ అటకెక్కడం మొదలైన కారణాల వల్ల అనుకున్నవి, రావాల్సినవి, కావాల్సినవి ఏవీ సాధించలేక పోతున్నామన్నది వాస్తవం. భారతరత్నకు అర్హులైన తెలుగుమహనీయులు ఎందరో ఉన్నారు. అందులో చాలామంది నేడు జీవించి కూడా లేరు. ఏ పురస్కారమైనా, గౌరవమైనా బతికివున్నప్పుడు అందించడమే  వివేకం. కేవలం జీవించి ఉన్నప్పుడే కాదు, ఆరోగ్యంగా చురుకుగా ఉన్నప్పుడు ఇవ్వడమే సరియైనది. సరే, మరణానంతరం ప్రకటించినా అర్హులైనవారందరికీ అందాలి. టెండూల్కర్ వంటివారికి భారతరత్న ఇవ్వడంపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్, ఘంటసాల, మంగళంపల్లి, పీవీనరసింహారావు, అక్కినేని నూటికి నూరు శాతం అర్హులు. ఇంకా పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బాపువంటి మహనీయులు ఎందరో మన తెలుగునాట ఉన్నారు. ఎవరికి ముందు వచ్చినా, ఎవరికి తర్వాత ఇచ్చినా, వీరందరూ అర్హులే. జాతిరత్నాల విషయంలో రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు మాని, కృషి చేయడం అందరి కర్తవ్యం.

Also read: నిరుద్యోగిత భయపెడుతోంది

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles