రామాయణమ్ – 158
మొదలయ్యింది లంకాదహనం.
ముందుగా తనను ప్రశ్నించిన ప్రహస్తుని ఇంటికి నిప్పు పెట్టాడు.
ఆతరువాత మహా పార్శ్వుడి కొంపతగలబడ్డది.
వంజ్రదంష్ట్ర, శుకసారణుల గృహాలవంతు వెంటనే వచ్చింది.
Also read: హనుమ తోకకు నిప్పంటించి వీధులలో తిప్పుట
ఆ తరువాత ఇంద్రజిత్తు ఇంటికి నిప్పంటించాడు. జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యశత్రువు ఇలా వరుసగా రాక్షస యోధుల ఇళ్ళన్నీ అగ్నిదేవుడికి ఆహుతి ఇచ్చాడు.
ఒక్క విభీషణుడి ఇల్లు మాత్రమే వదిలి పెట్డి వరసపెట్టి అందరి ఇళ్ళు తగులబెట్టాడు మారుతి.
అందరి ఇళ్ళూ కాల్చి చివరగా రావణుడి ఇంటికి కూడా తన తోక చివరన ఉన్న అగ్నిని అంటించి సింహగర్జన చేశాడు వాయునందనుడు.
మిత్రులిరువురూ వారి పని వారు చేసుకొని పోసాగారు.
Also read: రావణుడికి విభీషణుడి హితవు
అగ్నిదేవుడు వాయుదేవుడు ఒకరికొకరు సహాయపడుతూ లంకనంతా అగ్నిగుండంగా మార్చి వేశారు.
ఫెళఫేళార్భాటాలతో ఇళ్ళన్ని కాలి బ్రద్దలై కూలిపోసాగాయి.
అటుఇటు పరుగెడుతూ తమ వారిని ఎలా రక్షించుకోవాలో తమనెట్లా కాపాడుకోవాలో దిక్కుతోచక పరుగులుపెట్టే జనం.
జనంజనం
మహాదుఃఖసాగరం!!
హా తాత,
హా మిత్ర,
హా పుత్ర
అంటూ కేకలు వేస్తూ వీధులలో పరుగెడతున్న జనం ..
Also read: రావణుడికి హనుమ ధర్మబోధ
చంటిపాపడిని చంకన పెట్టుకొని ఒకతి
జుట్టు విరబోసుకొని జారినబట్టలు సవరించుకొనే సమయములేక మరొకతి.
మెట్లమీదనుండి వచ్చే సమయములేక మేడమీద నుండి దూకి ప్రాణాలు కాపాడుకొనేది ఇంకొకతి.
ముసలి, ముతక, పిల్లజెల్లా అంతా విపరీతమయిన భయముతో ప్రాణాలు కాపాడుకోవాలనే తపనతో వీధులవెంట పరుగులు పెడుతున్నారు.
కాలిన భవనాలనుండి రాలిన మణి మాణిక్యాలు.
ఎంత కాల్చినా అగ్నిదేవుడికి తృప్తి కలగటంలేదు.
ఎంతమంది రాక్షసులను చంపినా మారుతికి తృప్తి కలగటంలేదు…
ఇరువురికీ తృప్తిలేదు.
Also read: రావణుడి ఎదుట నిలిచిన వాయునందనుడు
వలయాలు వలయాలుగా తిరుగుతున్న అగ్ని శిఖలు లంకలో విలయాలను సృష్టిస్తూ ప్రళయవేళను మైమరపిస్తున్నవి.
ఎవడీ కోతి
ఎందుకు చేశాడు ఈ రీతి?
ఏమివీడి నిర్భీతి?
వీడు ఇంద్రుడా?
వీడు రుద్రుడా??
వీడు కుబేరుడా ?
కాదుకాదు మనపాలిటి కాల యముడు
అని చర్చించుకుంటూ పరుగులుపెడుతున్నారు లంకా నగరవాసులు.
బ్రహ్మండభాండం ఒక్కసారిగా బద్దలవుతున్నదా అన్నట్లుగా, పిడుగులు ఒక శ్రేణిలో వరుసగా రాలి పడ్డట్లుగా భవనాలు బద్దలవుతున్నాయి.
అవి బద్దలయ్యేటప్పుడు వాటికి తాపడం చేసిన మణి మాణిక్యాలు ఛటచ్ఛట,సటస్సట ధ్వనులు చేసుకుంటూ చిట్లిపోయి పెట్లి రాలిపోతూ కోటానుకోట్ల మిణుగురుల గుంపులు లంకా నగర ఆకాశాన్ని కప్పి వేసినాయా అన్నట్లుగా ఆకాశం మెరుస్తూ కనపడుతూ ఉన్నది.
ఎగసెగసి పడుతున్న అగ్నిశిఖలు
కొన్నిచోట్ల మోదుగ పువ్వుల లాగ,
మరికొన్ని చోట్ల బూరుగు పువ్వులాగ,
ఇంకొన్ని చోట్ల కుంకుమ పువ్వులాగా
వేరువేరుగా వెలుగుతూ లంకా నగరాన్ని కోటి సూర్యులు ఒక్కసారే ప్రకాశంతో ఆక్రమించారా అన్నట్లుగా ఉంది.
లంకా నగర వాసుల గుండెలను మాత్రము వైష్ణవమాయ ఆక్రమించి పెనుజీకట్లుకప్పి వేశాయి.
ఆయన తోక గిర్రున వలయంలాగా తిరుగుతూ విలయాలను సృష్టిస్తూ ఉంటే వలవల ఏడుస్తూ లంకా నగరమంతా కాపాడే దిక్కులేనిదయిపోయింది.
ఆయన తోక తిరిగే వేగానికి జ్వాలా తోరణాలు పుడుతున్నాయి
ఆ తోరణాల మధ్యలో వీరహనుమంతుడు
ప్రళయకాల రుద్రుని వలే
శత్రుభయంకరుడైన వీరభద్రుని వలే
ఒక రౌద్రం, ఒక భీభత్సం కలగలిసి రాక్షసుల హృదయాలలో గుబులు పుట్టిస్తున్నాడు..
సమస్త లంకా నగరం కనులు మూసి తెరిచే లోపల బూడిదకుప్ప అయిపోయింది
కాలాగ్నియా ఈతడు?
అని సకల భూతగణములు బెంబేలెత్తిపోయినవి.
అంతలోనే ఆ మహాబలి
మనస్సును భయము ఆక్రమించింది!
సీతమ్మకు ఏమైనా అయ్యిందేమో?
Also read: బ్రహ్మాస్త్రానికి బద్ధుడైన వాయుసుతుడు
వూటుకూరు జానకిరామారావు