రామాయణమ్ – 156
‘‘రావణా, జనస్థానంలో జరిగిన రాక్షస సంహారం గుర్తు తెచ్చుకో. వాలి వధను కూడ స్మరించుకో. బుద్ధిగా సన్మార్గంలో ప్రయాణించు. రామచంద్రుని ధనుష్ఠంకారము వినాలని అనుకోవద్దు.
నీ లంకను వాజి రధ కుంజరాలతో సహా నాశనం చేయడానికి నేనొక్కడనే సరిపోదును….కానీ అది రాముని ప్రతిజ్ఞ!
సర్వ ఋక్ష వానర సమక్షములో రాముడు ప్రతిజ్ఞ చేసినాడు కావున నిన్ను నేను వదిలిపెడుతున్నాను.
సీత, సీత అని కలవరిస్తున్నావే ఆమె నీ లంకకు కాళరాత్రి.
నీ పాలిటి కాలపాశం అని తెలుసుకో.
Also read: రావణుడికి హనుమ ధర్మబోధ
సీతాదేవి తేజస్సు చాలును నీ లంక భస్మమయిపోవడానికి.
రాముని క్రోధం సృష్టించే విలయం నీ ఊహకు అందనిది.
అందాల నెలవంక లాంటి నీ లంక సమస్తం దహించివేయబడుతుంది.
భస్మరాసులు మాత్రమే మిగులుతాయి
మిత్రులు మంత్రులు
హితులు, సుతులు
జ్ఞాతులు, భ్రాతలు
భార్యలు,భోగాలు …అంతా నాశనం. సర్వలంకా వినాశనం జరుగుతుంది జాగ్రత్త!
Also read: రావణుడి ఎదుట నిలిచిన వాయునందనుడు
ఇకనైనా తెలివితెచ్చుకొని నీ లంకను కాపాడుకో!’’
హనుమంతుడి ఈ ఉపదేశానికి రావణుడికి తీవ్రమైన క్రోధం పెల్లుబికింది. కన్నులు క్రోధారుణిమతాల్చాయి.
“వీడిని వధించండి” రావణుడి నోటివెంట వచ్చిన కఠినమైన ఆజ్ఞ అది.
‘‘ఇక్కడ దూతవధ జరగనున్నది. దానిని ఎటులైనా సరే ఆపవలెను అది అకార్యము, అధర్మముకూడా’’ అని అనుకొని విభీషణుడు అన్నతో ఇలా పలికాడు.
మహారాజా, నన్ను క్షమించండి. కొంచెము రోషము విడిచి పెట్టండి. రాజశ్రేష్ఠులు దూతను వధించరు.
Also read: బ్రహ్మాస్త్రానికి బద్ధుడైన వాయుసుతుడు
ఓ వీరుడా, ఈ వానరుని చంపుట రాజధర్మానికి విరుద్ధము. అది లోకమర్యాద కాదు. పైగా నీవంటి వాడు చేయదగిన పని కానే కాదు. నీకు సకల ధర్మాలు తెలుసు. రాజధర్మములు పాటించుటలో నేర్పుగలవాడవు.
రాజా, నీ వంటి పండితులు కూడా రోషమునకు లొంగి పోయినచో శాస్త్రాలలో పాండిత్యము సంపాదించుట ఉత్త శ్రమగానే మిగిలి పోవును కదా!
(శాస్త్రాలు చదివినవాడు ఆ శాస్త్రాలుచెప్పిన విధంగా ప్రవర్తించాలి. లేకపోతే చదివినవాడికి చదవని వాడికి తేడా ఏముంటుంది ?)
శత్రు సంహారకుడవు, శత్రువులలో నిన్ను తేరిపారచూడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? …..అందువలన ప్రసన్నుడవు కమ్ము. ఈ దూతకు శాస్త్ర ప్రకారము తగిన దండన విధింపుము….’’అని విభీషణుడు రాజైన రావణుని చూసి హితవు పలికాడు.
అది విన్న రావణుడు, ‘‘విభీషణా, వీడు పాపాత్ముడు. పాపాత్ములను వధించినా పాపము అంటదు. కావున వీనికి మరణదండనయే సరి అయిన శిక్ష …’’అనుచూ పలికెను.
Also read: రావణ సుతుడు అక్షకుమారుడి వధ
అందుకు విభీషణుడు రాజైన రావణునితో ‘‘నిజమే ఈతడు చేసిన కార్యము దండనార్హమైనదే. ఇతడు మితిమీరి ప్రవర్తించినాడు అను మాట అక్షర సత్యము….కానీ ఏ దేశములోనైనా, ఏ కాలములోనైనా సత్పురుషులు దూతను వధించినట్లుగా మనమెరుగుదుమా? దూతకు విధించదగిన అనేక దండనలు శాస్త్రములు చెప్పినవి కదా! ధర్మార్ధములను బాగుగా తెలిసికొని మంచిచెడ్డల విషయములో సునిశితప్రజ్ఞ కలిగినవాడు చేయవలసిన పనికాదు. నీ వంటి బుద్ధిమంతుడు ఇంత శీఘ్రముగా కోపమునకు వశుడెట్లు అయినాడు? ఆశ్చర్యము!
ధర్మమును తెలిసికొన్న వారిలో సురాసురులలో నీ వంటి ఉత్తముడు ఇంకొకడులేడు కదా!
ఈ వానరుని చంపుట వలన ఏమి ప్రయోజనము లభించును? ఈతనిని చంపిన ఇతనిని పంపిన వారిని మనపై యుద్ధానికి తీసుకొని రాగలవాడు ఎవ్వడు?
అప్పుడు రావణుడు తమ్ముని మాటలు బాగుగా ఆలకించి ఇట్లు పలికినాడు.
(విభీషణుడు అన్నతో మాటలాడిన విధము గమనించగలరు … Transaction analysis లో దీనిని salesmen techniques అని అంటారు…tickling the EGO.
కొనటానికి వచ్చిన customers ను చూసి ఇది మీకు బాగుంటుంది కానీ cost చాలా ఎక్కువ అని పక్కన పెట్టాడు అనుకోండి …మన మనస్సు దానిమీదనే లగ్నమయి అది కొనేదాకా నిద్రపోము…
అలాగే ఇక్కడ రాజశ్రేష్ఠులు దూతను వధించరు అని అనగానే …ఒక వేళ వధిస్తే తను అందరు సభికుల దృష్టిలో శ్రేష్ఠుడుకాని వాడుగా మిగిలి పోతాడు….కాబట్టి విడిచి పెట్టి తీరాల్సిందే!!!
ఇది Today’s Salesman technique!!!….Tickling the EGO…)
Also read: అనేకమంది రాక్షస యోధులను యమసదనానికి పంపిన హనుమ
వూటుకూరు జానకిరామారావు