అమరవాది రవీంద్రశేషు
భారత రాష్ట్ర సమితి ప్రథమమహాపభ ఖమ్మం పట్టణంలో జయప్రదంగా జరిగింది. దీంతో కేసీఆర్ ప్రతిష్ఠ, బీఆర్ఎస్ స్థాయి పెరిగాయి. ఎనిమిదేళ్ళకుపైగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత జరిగిన తొలి మహాసభ ఇది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవాన్ సింగ్ మన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, యూపీ ప్రతిపక్ష నాయకుడు, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. అందరూ బీజేపీని విమర్శిస్తూ ప్రసంగించారు. మొదటి నుంచీ కేసీఆర్ వెంట ఉండిన కుమారస్వామి కర్ణాటకలో పంచతంత్ర రథ యాత్రలో ఉన్న కారణంగా సభకు హాజరు కాలేకపోయారు.
బీఆర్ఎస్ కు తొలి బహిరంగ సభ కీలకమైనది. దీనికి అయిదులక్షలకు మించి ప్రజలు హాజరవుతారని బీఆర్ఎస్ నాయకులు చెబుతూ వచ్చారు. మూడు లక్షలకు మించి ఉంటారు. అంటే గత ఎనిమిదేళ్ళలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్నిసభలలోకీ ఇది అతి పెద్దది.
సభలో చివరిగా మాట్లాడుతూ కేసీఆర్, దేశంలో సంపద సృష్టించడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. దేశంలో 1.40 లక్షల టీఎంసీల నీరు లభ్యం అవుతున్నదనీ, దానిలో బెబ్బయ్ శాతం ఆవిరి కావడమో, సముద్రంలో కలిసిపోవడమో జరుగుతున్నదనీ అన్నారు. దేశంలో సాగు చేయడానికి 83 కోట్ల ఎకరాల భూమి అందుబాటులో ఉంటే 41 కోట్ల ఎకరాలు మాత్రమే సాగు అవుతోందని చెప్పారు.
కేరళ, తమిళనాడు, దిల్లీలలో గవర్నర్లు ముఖ్యమంత్రులను వేధిస్తున్నారనీ, సమాఖ్య వ్యవస్థను గవర్నర్లు కుళ్ళబొడుస్తున్నారనీ, ఈ ధోరణికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉన్నదనీ రాజా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల పరిధిలోకి గవర్నర్ వ్యవస్థ ద్వారా చొరబడుతున్నదని విజయన్ విమర్శించారు. వచ్చే ఎన్నికలలోబీజేపీని ఓడించడం సాధ్యమేనన్న విశ్శాసం ఖమ్మం సభను చూసిన తర్వాత తనకు కలుగుతున్నదని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. లెఫ్టినెండ్ గవర్నర్ ద్వారా తన ప్రభుత్వానికి ప్రధాని నరేంద్రమోదీ ఎటువంటి సమస్యలు సృష్టిస్తున్నారో కేజ్రీవాల్ వివరించారు.
తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేయగలమో కేసీఆర్ పేర్కొన్నారు. మహిళలకు చట్టసభలలో 35 శాతం స్థానాలు ప్రత్యేకిస్తామనీ, విద్యుచ్ఛక్తి రంగాన్ని పూర్తిగా ప్రభుత్వరంగంగా మార్చుతామనీ, రైతులకు ఉచితంగా విద్యుచ్ఛక్తి ఇస్తామనీ, అగ్నపథ్ పథకాన్ని రద్దు చేస్తామనీ, సహజవనరులకు సద్వినియోగం చేసుకుంటామనీ చెప్పారు.
ఉదయం ముగ్గురు ముఖ్యమంత్రులు యాదాద్రి వెళ్ళి దేవుణ్ణి సందర్శించుకున్నారు. కమ్యూనిస్టు నేతలు విజయన్, రాజా దేవుడి గుడికి దూరంగా గెస్ట్ హౌస్ లో ఉన్నారు. తక్కినవారు వచ్చిన తర్వాత అందరూ కలిసి హెలికాప్టర్ లో ఖమ్మం వెళ్ళారు.
అయిదు రాజకీయ పక్షాలు ఒకే మీదికి చేరాయి. బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఆప్, సమాజవాదీ పార్టీల అధినేతలు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అందరూ వివరించారు. కానీ ఒక సమైక్యరాజకీయ అజెండాను ప్రజల ముందు పెట్టలేకపోయారు. కంతారా సినిమాలో హీరో పెట్టిన గావుకేక వంటిది ఖమ్మంలో వినిపించలేదు. బహిరంగసభ బాగా జరిగింది. కానీ సమైక్య నినాదం వినిపించలేదు. భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటిస్తారేమోనని ప్రజలు ఆశించి ఉంటారు. బహుశా బుధవారం ఉదయం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ లో చర్చలు అసంపూర్తిగా మిగిలాయేమో తెలియదు. ఎవరికి వారు ఊహించుకోవలసిందే.