సూర్యుడే అహారానికి ఆరోగ్యానికి ఆధారం
అంతర బహిర మానసిక స్వస్థతకు మూలం
వెలుతురే జీవితాలను వెలిగించే ఇంధనం
వెలుగే ఙాన స్వరూపం భక్తి ముక్తి దాయకం
పసిడి పంటలు ఇంట చేరే కాలం
ఐశ్వర్య కారక గోగణాన్ని పూజించే కాలం
రైతు గుండెలు ఆనందంతో నిండే కాలం
సమాజమంతా మురిసే కాలం
మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్య కాలం.
చీకట్లను భోగి మంటలతో దహించే కాలం
పాతను వదలి నవతకు స్వాగతం పలికే కాలం
ఇంటిల్లిపాది విందు వినోదాలతో గడిపే కాలం
నవ కాంతితో జగతి శోభిల్లాలని కోరే కాలం.
గంగిరెద్దులు హరిదాసులు కనుమరుగైనా
రంగవల్లులు వెల్లివిరుస్తున్నాయి
ఉమ్మడి కుటుంబాలు పోయి
ఒంటరి పోరాటాలు మిగిలాయి
ఊరంతా ఒకటై సంబరాలు జరిపే రోజులు పోయి
కోడి పందాలు, గాలి పటాలు మిగిలాయి
ఈ రుతువుకు అవసరమైన అరిసెలు మోటువయ్యాయి
డోనట్లు, పిట్జాలు ప్రియమయ్యాయి
స్వఛ్ఛమైన చిరు నవ్వులు మాయమయ్యాయి
కృత్రిమ నవ్వులు, కపట పలకరింపులే మిగిలాయి.
ఈ చీకటి బ్రతుకులకు వెలుగు వస్తుందా
సంక్రాంతి మనసుల్లో క్రాంతి తెస్తుందా
మంచికి, మానవత్వానికి విలువ పెరుగుతుందా
అర్థవంతంగా బ్రతుకులు నడవాలని కోరుకుందాం
ఈ సంక్రాంతి లక్ష్మిని ఇదే వరమడుగుదాం.
Also read: కనుమ(రుగు)
Also read: భోగిమంటలు
Also read: “వివేకానందులు”
Also read: “యుగ యుగాల చరిత్ర”