మాడభూషి శ్రీధర్ తిరుప్పావై – 25
ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిరైప్పిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి
వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు భావార్థ గీతిక
అర్ధరాత్రి ఓతల్లి కడుపు పంటయైపుట్టి వెంటనే
యమున దాటి వ్రేపల్లెలో యశోద పట్టియైనట్టి
నిన్నోర్వలేక పరిమార్చు కుట్రల దునుమి నావు
కంసుని గుండెలో ద్వేషమనెడు నిప్పు పెట్టి నావు
మాధవుని వేడి పరము కోరెడు మా ప్రేమల కన్న
కన్నయ్య వ్యామోహమే మిన్నయని తెలిసినాము
పిరాట్టియైన కోరని సిరిని కోరి, నీ శౌర్యసౌశీల్యముల
కీర్తించి నీ విరహదుఃఖము మాన్పగా వచ్చినాము.
శ్రీరాముడు యువకుడిగా ఎదిగిన తరువాత రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చింది. కాని శ్రీ కృష్ణుడి పుట్టుకే శత్రుస్థావరంలో జైల్లో జరిగింది. ..ఎంతో కాలం గడిచిపోయినా శ్రీ కృష్ణ ఆవిర్భావ సమయంలో ఉన్న పరిస్థితులు అప్పుడే ఉన్నట్టు భావించి గోపికలు ఆందోళన పడుతున్నారు.
నేపథ్యం.
గోపికలు ఆదేశిస్తే సింహాసందాకా నడిచి వచ్చి అధిరోహించిన భక్త పరాధీనుడు శ్రీకృష్ణుడు. తనకు మంగళం పాడారు గోపికలు నిన్నటి పాశురంలో. తాను సర్వశక్తిమంతుడినని తెలిసినా, నాకు ఏ దృష్టి దోషమూ రావద్దని కోరుకుంటున్నారు. నాశక్తికి బలానికి, ఆయుధాలకు లోపం రాకూడదని మంగళం పాడుతున్నారు. ఎంత ప్రేమ? ఎంత ఆదరణ? అనుకుంటూ వీరిని ఆదుకోవలసిందే అడిగింది ఇవ్వవలసిందే అని భావిస్తున్నాడట.
Also read: పరము వరమునిచ్చిమానోము నిల్పిన వరదునికి జయము
ఒక తల్లికి (ఒరుత్తి) మగనాయ్ (పుత్రుడిగా) జనించి (పిఱందు) పుట్టిన రాత్రే మరొక తల్లికి (ఒరుత్తి) కొడుకుగా (మగనాయ్) రహస్యంగా పెరుగుతున్న కాలంలో (ఒళిత్తువళర) ఒక రాక్షసుడు (త్తాన్) సహించని వాడై (తరిక్కిలానాగి) కీడు తలపెట్టి (తీంగు నినైంద) కంసుని యొక్క (కంజన్) దురాలోచనను (కరుత్తై) భగ్నం చేసి (పిరైప్పిత్తు) ఆతని కడుపులో (వయిట్రిల్) నిప్పై నిలిచిన (నెరుప్పు నిన్ఱ) సర్వాధికుడా (నెడుమాలే) నిన్ను (ఉన్నై) కావలసిన వాటిని అడగడానికి వచ్చినాము (అరుత్తిత్తువందోమ్) మాకోరికను తీర్చేట్లయితే (పఱై తరుదియాగిల్) శ్రీమహాలక్ష్మి కూడా కోరదగిన నీ ఐశ్వర్యాన్ని (తిరుత్తక్క శెల్వముమ్) నీ శౌర్యసౌశీల్య లక్షణాలను (సేవగముమ్) మేము పాడి, స్తుతించి (యామ్ పాడి) నిన్ను ఎడబాసిన దుఃఖము తొలగిపోగా (వరుత్తముమ్ తీర్ న్దు) సంతోషిస్తాము (మగిఝిన్దు).
గజేంద్రమోక్షంలో ఒక భక్తుడిని కాపాడడానికి వచ్చినట్టు రావడం కాదు కృష్ణావతారం అంటే, ఒక తల్లి కడుపులో పుట్టి తన అవతారాన్ని ప్రారంభించి మరో తల్లి ఇంట పెరిగినాడు శ్రీ కృష్ణుడు. శ్రీరాముడు యువకుడిగా ఎదిగిన తరువాత రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చింది. కాని శ్రీ కృష్ణుడి పుట్టుకే శత్రుస్థావరంలో జైల్లో జరిగింది. పుట్టిన వెంటనే మౌనంగా జైలునుంచి తరలిపోయి రహస్యంగా మరొక తల్లి దగ్గర పెరగాల్సివచ్చింది. ఏడో రోజునుంచే రాక్షసులతో పోరాటం తప్పలేదు. అందుకే తల్లి పేరు చెప్పకుండా, ఎక్కడ పుట్టాడో ఎవరో ఎవరి దగ్గర పెరుగుతున్నాడో, అతనికి ఎవరివల్ల భయం ఉందో ఆతని పేరు దాచి మాట్లాడుకుంటున్నారు భయం భయంగా గోపికలు. కాలం గడిచిపోయినా శ్రీ కృష్ణ ఆవిర్భావ సమయంలో ఉన్న పరిస్థితులు అప్పుడే ఉన్నట్టు భావించి ఆందోళన పడుతున్నారు. ఇదీ గోపికలు భక్తి ప్రేమాతిశయం. భగవంతుడికి జన్మనిచ్చిన సంతోషం కన్న ఆయన్ను కంసుడేంచేస్తాడోనన్నభయంతో పసికందును అర్ధరాత్రి తల్లి తీసుకుపొమ్మని ఇచ్చేసింది. కన్నతండ్రి తరలించవలసి వచ్చింది. దేవకీ, యశోద ఎంత పుణ్యం చేసుకున్నారో? పోనీ నంద గ్రామంలోనైనా ప్రశాంతంగా పెరిగాడా అంటే అదీ లేదు. ఎప్పుడు ఏ రాక్షసుడు దాడిచేస్తాడో తెలియని భయానక పరిస్థితులే ఎప్పుడూ. ఆ సమయంలో పుట్టిన ప్రతి శిశువును సంహరించాలని కంసుడి ఆదేశం. దాన్ని పాటించాలని ఇంకా ఎక్కడైనా పసికందు కనిపిస్తాడా అని చూస్తూ పాలిస్తాననే నెపంతో బయలుదేరిన పూతన, అమాయకంగా బండిలో దూరిన శకటాసురుడి వంటి రాక్షసులు ఎందరు ఊళ్లో తిరుగుతున్నారు, మరెందరు వ్రేపల్లెకు వస్తున్నారో తెలియదు. ఆ కంసుని గుండెల్లో నిప్పై కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. అంతటి ఉద్రిక్త పరిస్థితులలో సైతం శత్రువులకు భీతి గొల్పుతూనే భక్తులకు ఆశ్రితులకు ఆనందం కలిగించే లీలలు చేసిన శ్రీకృష్ణుడి కి భక్తుల పట్ల తీవ్రమైన వ్యామోహం ఉందట. ఈ కష్టాలన్నీ స్వీకరించిందే భక్తుల కోసం. మాకోసం నీవు జన్మలెత్తాల్సిన పని లేదు. ఎక్కడికో రావలసిన అవసరం లేదు. మేమే నీకోసం వచ్చాము. మాకు ఇతర ప్రయోజనాలేవీ లేవు. మీ దర్శనం చాలు. మాకు నీవే కావాలి. అన్నారు గోపికలు.
Also read: నిప్పురవ్వలు కురిపించు కంటి కొసచూపులు విసిరి
ఇదీ భక్తి ప్రేమాతిశయం
నా కోసం వచ్చానంటున్నారు, పఱై (డక్కి అనే వాయిద్య పరికరం) అడుగుతున్నారు ఏమిటిది? అని పరమాత్ముడు ప్రశ్నించాడు. అన్నీ నీసంకల్పమే కదా. మేము అడిగినదివ్వాలి కాని మేము ఏమని అడగగలం. నీవు పఱై ఇస్తానంటున్నావు, తీసుకుంటాం. వద్దంటే మేమే స్వతంత్రించి నిర్ణయిస్తున్నామనుకుంటారు. కాని శ్రీ మహాలక్ష్మి కూడా అడిగేంతటి నీ ఐశ్యర్యాన్నినీ సౌశీల్య లక్షణాలను గానం చేస్తాం. నిన్ను ఎడబాసిన కష్టాలు తొలగినాయి. కంసుని భయానికి నీ పేరు చెప్పడానికీ వెనుకాడాం. ఇప్పుడా బాధ లేదు. నోరారా నీ నామాలను కీర్తిస్తాం. ఎంత భాగ్యం.
మన హృదయాలలో అంతర్యామి యై భగవంతుడు కనిపించకుండా కాపాడుతూ ఉంటాడు. బయటకు వస్తే భగవంతుడు కాడని మనవాళ్లే వాదిస్తారు కదా అని గోదాదేవి అంటూ అద్భుతమైన భక్తి సూత్రాలను వివరిస్తున్నారీ గోవింద గీతికలో.
శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు ఈ పాశురార్థాన్ని చాలా హృద్యంగా వివరించారు.
Also read: చీమకు, బ్రహ్మకు కూడా అహంకారం ఉండదా?
ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కంసుని కాలం గడిచి పోయినా సరే, స్వామిపై అంత ప్రేమ. పుట్టిన చోటు అద్వితీయం. కన్న తల్లి అద్వితీయం, పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. తల్లి ఒడిలో తల్లికడుపులో దాక్కునే అదృష్టం పరమాత్మకే లేదా? ఎవ్వరికి తెలియకుండా నందగోకులం చేరి, “ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర” మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలు. “తరిక్కిలానాకి” సహించలేక పోయాడు ఆ “త్తాన్” ఆ నీచుడు, కంసుడు అని వాడి పేరుకూడా చెప్పడం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడై పోతుంది అని. ఏం చేయ్యాలని అనుకున్నాడంటే “తీంగు నినైంద” కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడో, “కరుత్తై పిరపిత్తు” అది వారికే జరిగేట్టు చేసాడు. “కంజన్ వైత్తిల్ నెరుప్పెన్న నిన్న” కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు. వెన్నతిన్న చల్లని కృష్ణుడు నిప్పు కావడమేమిటి. కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషమే నిప్పుగా కడుపు మంట. అదే ప్రేమ అయితే తరించి కంసుడు పోయేవాడు. ద్వేషం కనుక దహించుకుపోయాడు.
Also read: ‘‘సర్వే వేదాః కృష్ణా’’ వేదాలు చెప్పేది కృష్ణుడే
స్వామి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్లల్లో ప్రేమను గుర్తించింది ఆండాళ్ తల్లి. “నెడుమాలే” ఆయన దీర్ఘమైన వ్యామోహం, ప్రేమ కల్గినవాడు తనను ఆశ్రయించుకున్నవాళ్ళ యందు, అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగుణాలుగా భావిస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా ‘తమకే ప్రేమ ఉంది, కృష్ణుడికి తమపై ప్రేమలేదు’ అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా, ‘మనం ఆత్మలం కదా మనకుండే ప్రేమ అణుమాత్రం, ఆయన విభువు, ఆయన కుండే మనపై ప్రేమ విభువంతా’. సీత హనుమతో ‘‘రావణుడు నాకు కేవలం రెండు మాసాల గడువిచ్చాడు, రాముడితో చెప్పు ‘మార్తా దూర్దం న జీవిష్యే’ నేను ఒక నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను’’ అని చెప్పమంది. హనుమ ఈ విషయం చెప్పగానే, రాముడు ఆశ్చర్యంతో “యది మాసం దరిష్యతి చిరంజీవతి వైదేహి” అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైన ఉండ వచ్చును. మరి తనో, “నజీయేయం క్షణమపి వినాతాం అశితేక్షణాం” నేను క్షణ కాలం కూడా ఆమెను విడిచి జీవించగలనా’ అన్నాడు, విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత. వీళ్లు ఈరోజు ఆయన కళ్లల్లో అంత వ్యామోహం చూసారు.‘సరే ఇంక ఏంకావాలి’ అని స్వామి అడిగాడు. “ఉన్నై అరుత్తిత్తు వందోం” మేం నిన్ను కోరి వచ్చాం. “పఱై” వ్రత పరికరాలు “తరుతియాగిల్” నీ విస్తానన్నావు కాబట్టి తీసుకుంటాం. స్వామి వీళ్ళను పాపం శ్రమ పడి వచ్చారర్రా అని అనగానే, “తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్” లేదు మేం సంతోషంతో వచ్చాం. నీ నామం పాడుతూ వచ్చాం కదా, మాకు ఏ శ్రమా లేదు హాయిగా వచ్చాం అంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాళ్ గోష్టి వారని వివరించారు జీయర్ స్వామి మనసులను హత్తుకునేట్టు వివరించారు. ఇంతకన్న ఏం వాఖ్యానం ఉంటుంది. ఏ వాక్యాలుంటాయి. అంతటి ప్రేమను గోదమ్మ ఈనాటికీ తట్టి లేపుతున్నది.
నిద్రిస్తున్న మానవాళిని తట్టి, భక్తిప్రేమాభిమానాలను మేల్కొల్పడమే తిరుప్పావై. పొంగే భక్తే అసలైన పొంగలి కాని తినే పదార్థమా. కాదు, అది బ్రహ్మపదార్థం,శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లులున్నట్టు నారాయణ తత్వాన్ని తెలిపే మంత్రాలు రెండు ఉన్నాయి. నారాయణాష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి. అష్టాక్షరిలో నారాయణతత్త్వం ప్రకాశిస్తే వాసుదేవ మంత్రంలో సర్వవ్యాపకత్వం గూఢముగా ఉందని, దేవకి నారాయణాష్టాక్షరి అయితే యశోద వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రమని కందాడై రామానుజాచార్యులు వివరించారు. ఒకటి గాయత్రీ మంత్రమైతే మరొకటి నారాయణాష్టాక్షరి అని వివరించే వారూ ఉన్నారు. వారు గాయత్రీ మంత్రము దేవకీ దేవి అనీ నారాయణాష్టాక్షరి యశోదాదేవి అని అన్వయిస్తారు. కంసుడంటేనే అహంకారం. అంటే ఆత్మ శరీరం వేరనుకోవడం, తనకన్న పరమాత్ముడు వేరే లేడనుకోవడం, అతని గుండెలో నిప్పుగా మారి శ్రీకృష్ణుడు అతని అహంకారాన్ని లోనుంచి కాల్చేస్తాడు.
Also read: ముక్కోటి దేవుళ్లు ముప్పు వచ్చెనంచు విన్నవించకమున్నె