న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు
95వ ఆస్కార్ వివిధ భాగాలలో పోటీకి ఆర్ఆర్ఆర్
ఆర్ ఆర్ ఆర్ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఉత్తమ దర్శకుడి అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డును స్వీకరిస్తూ రాజమౌళి తనకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు.
‘‘ఈ అవార్డును స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మీరు నాతో పాటు నాతో కలసి పని చేసిన సాంకేతిక నిపుణులనూ,మొత్తం బృందాన్నీ గుర్తించారు. దక్షిణభారతంలో తయారైన ఒక చిన్న చలనచిత్రాన్ని గుర్తించి గౌరవించారు. చాలా మందికి దక్షిణభారతంలో ఇటువటి చిత్రం వచ్చిందనే విషయం తెలియదు.ఇప్పుడు ఈ అవార్డుతో తెలుస్తుంది’’అని అవార్డు స్వీకరించిన సందర్బంలో దర్శకుడు రాజమౌళి అన్నారు.
‘‘ఆర్ఆర్ఆర్ సినిమాకి పాశ్చాత్య దేశాలలో మంచి స్పందన వచ్చింది. భారతీయుల లాగానే వీరు కూడా స్పందించారు. సినిమాలో ఇంటర్వెల్ కు ముందు సీక్వెన్సుల గురించి మాట్లాడుతూ రాజమౌళి, అది కేవలం పరమానందం. వారి మొహాలు చూసి వారు ఏమి ఆలోచిస్తున్నారో ఊహించుకోవచ్చు. ఇంతకీ మనం ఏమి చూశాం అని ప్రేక్షకులు విస్తుపోయారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
జనవరి 11న లాస్ ఎంజెలిస్ లో గోల్డెన్ గ్లోబ్ ప్రదానోత్సవంలో రాజమౌళితో పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్ టి ఆర్ కూడా పాల్గొంటారు. ఉత్తమ చిత్రం అవార్డుకూ, నాటు నాటు అనే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఫిలిం ట్రాక్ అవార్డుకూ ఆర్ఆర్ఆర్ ను నామినేట్ చేశారు.
95వ అకాడెమీ అవార్డులకు వచ్చిన నామినేషన్ల వివరాలను ఈనెల 24న ప్రకటిస్తారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలైన ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ లో వివిధ కేటగరీల కింద నమోదు చేశారు.
1920ల ప్రాంతం చరిత్ర గురించి చెప్పే ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం అనే ఇద్దరు స్వాతంత్ర్య సమర యోధుల చరిత్ర ఈ చిత్రంలో చెప్పారు. రాంచరణ్, జూనియర్ ఎన్ టిఆర్ తో పాటు అలియాభట్, అజయ్ దేవగన్, ఒలివియామోరిస్, సముతిరకని, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ లు కూడా నటించారు. ఇండియాలోనూ, విదేశాలలోనూ ఈ చిత్రంపైన మంచి సమీక్షలు ప్రచురించారు. టెలివిజన్ చానళ్ళలో కూడా మంచి ప్రోత్సాహకరమైన సమీక్షలు వెలువడ్డాయి.