Thursday, November 21, 2024

పరమాత్మను ఇచ్చేది యశోద మంత్రము

మాడభూషి శ్రీధర్ తిరుప్పావై 17

అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

అన్నజల వస్త్రంబులందరికిచ్చు నందగోపాల ఆచార్య

వ్రేపల్లె వేలుపా వేచి ఉన్నారు జనమెల్ల మేలుకొనవయ్య

ప్రబ్బలి ప్రమదల చిగురు  యశోద మంత్ర మహిమ

గగనమ్ముచీల్చి లోకాల నిండిన నిత్యసూర నేత నిగమసార

యదు కుల కీర్తి పతాక యశోదానందన యమునావిహార

మెరుగుపసిడికడియాల భాగవతోత్తమ బలరామ దేవ

ద్వయమంత్రముల రూపు కదా మీ సోదర ద్వయము

నీవు నీతమ్ముడును లేచి మమ్మాదరించరయ్య.

అన్నదమ్ములను విడదీసే రాక్షసులు, మనుషుల్లో విభేదాలు సృష్టించి, విభజించి పాలించే దుష్ట పాలకులు, పిల్లలను ఎత్తుకుని పోయే కంసుల వంటి రాక్షసులు.

నేపథ్యం

పదిమంది గోపికలను మేల్కొల్పి, నందగోపుని భవనాన్ని చేరుకున్నారు, గోపికలు భవనపాలకుని, ద్వారపాలకులను బతిమాలుకుంటే నందగోపుని భవనంలోపలకి అనుమతించారు.  అక్కడ నందుడు, యశోద, శ్రీకృష్ణుడు, బలరాముడు శయనించి ఉన్నారు. యశోదకు నందుడికి భయం. మన్మథుడికే మన్మథుడైన బాలకృష్ణుని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని, మహాబలుడు బలరాముడిని వేరు చేస్తారేమోనని భయం. అందుకే నిద్రపోయేసమయంలో కూడా శ్రీకృష్ణుని ఇటు, బలరాముని అటు పరుండబెట్టుకుని మధ్య మధ్య చూసుకుంటూ ఉన్నదా తల్లి. 

Also read: నాయకులకెల్ల నాయకుడు నందగోపుని భవ్యభవన

నందగోపుడు ముందు, ఆ తరువాత యశోద, ఆమెకు మరో పక్క శ్రీకృష్ణుడు, ఆయన పక్కన బలభద్రుడు. ఎవరొస్తారో ఏం చేస్తారో పరిశీలించి కాపాడడానికి ముందు బల్లెం చేతిలో పట్టుకుని పడుకున్నాడట నందగోపుడు. భర్త అనురాగమూ పుత్రుడిపట్ల ప్రేమా సమానంగా ఉండడం వల్ల, యశోద అటు నందుడికీ, ఇటు నందనుడు కృష్ణుడికీ మధ్యన ఉందట. ఆ పక్కనుంచి తమ్ముడిని కాపాడుతూ బలరాముడు చివరన ఉన్నాడట.

అన్నదమ్ములను విడదీసే రాక్షసులు, మనుషుల్లో విభేదాలు సృష్టించి, విభజించి పాలించే దుష్ట పాలకులు, పిల్లలను ఎత్తుకుని పోయే కంసుల వంటి రాక్షసులు ఎక్కువై పోతున్న సమాజంలో భయం యశోదానందులకూ ఉందని వివరిస్తున్నదీ పాశురం. నందగోపుడు గురువు, యశోదే మంత్రం, శ్రీకృష్ణుడే భగవంతుడు, విష్ణువుకు పానుపై, శ్రీరామునికి లక్ష్మణుడై, శ్రీకృష్ణుడికి అన్నయై ప్రక్కతోడుగా ఉన్న బలరాముడే భాగవతుడని ఈ పాశురం సారాంశం.  అడుగడుగునా మానవత్వపు సుగంధాలు విరజిమ్మే కావ్యం తిరుప్పావై.

ప్రతిపదార్థం

అమ్బరమే = వస్త్రములు, తణ్ణీరే = చల్లని నీరు,శోఱే = అన్నము, అఱం = ధర్మం, శెయ్యుం= చేయునట్టి ఎమ్బెరుమాన్ = మాస్వామీ, నందగోపాలా! =నందగోపాలనాయకుడా, ఎరుందిరాయ్ =లేవయ్యా,కొన్బనార్కు ఎల్లాం= ప్రబ్బలి మొక్కవలె యున్న స్త్రీలందరికీ, కొళుందే! =చిగురువలె నుండే దానా, కుల విళక్కే= కులదీపమువంటి దానా, ఎమ్బెరుమాట్టి = మాస్వామినీ, యశోదా! =యశోదమ్మతల్లీ, అఱివుఱాయ్ = నిదురలేవమ్మా, అమ్బరం =ఆకాశమును, ఊడఱుత్తు =మధ్యగా భేదించి, ఓంగి = పెరిగి, ఉలగ = లోకములను, అళంద= కొలిచిన, ఉమ్బర్ కోమానే! = నిత్యసూరులకు రాజయినవాడా, ఉఱంగాదు-= నిదురించరాదు, ఎరుందిరాయ్= మేల్కొనుము. శెమ్ పోల్ కళల్ = ఎర్రని బంగారముతో చేసిన కడియము ధరించిన, అడి= పాదముగల, చ్చెల్వా బలదేవా!= బలరాముడా, ఉమ్బియుం = నీ తమ్ముడును, నీయుం =నీవును, ఉఱంగ్-ఏల్ = మేల్కొనండి.

Also read: తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగానూ చెప్పగల నేర్పరి

భావార్థం

ఈ పాశురంలో వారిని ఒక్కొక్కరినీ మేలుకొలుపుతున్నారు. ద్వయ మంత్రాన్ని పొందడానికి ముందు గురుపరంపరను ధ్యానించాలి. పదిమంది గోపికలను ఆహ్వానంపలకడమంటే గోపికలు గురుపరంపరను స్మరించారు. తరువాత అమ్మవారి ద్వారా నారాయణుని ఉపాయంగా ఆశ్రయించాలి. గురుపరంపరాధ్యానంతో ఆచార్యకులం చేరే అర్హత లభించింది, అదే నందగోపుని భవనం. ఆచార్యుని ఆశ్రయించాలంటేఅంతకుముందు అహంకారాన్ని వదులుకోవాలి, దానికి శమదమాలు ఉండాలి. ద్వారపాలకులను బతిమాలడంలో తమ బుధ్దిని అహంకారరహిత స్థితిని సూచించారు.నందుని మేల్కొలుపడం ఆచార్యసమాశ్రయణము, యశోదను మేల్కొలుపడం తిరుమంత్రాన్ని సాధించడం, శ్రీకృష్ణుని మేల్కొలుపడం భగవంతుడు సాక్షాత్కరించడమే, బలరాముడిని నిద్రలేపడమంటే భాగవతులను ఆశ్రయించడం.

నందగోపాలుడు వ్రేపల్లెలో జనప్రియమైన నాయకుడు. వస్త్రాలు కావలిసిన వాడికి వస్త్రాలు, త్రాగునీరు కావలసిన వారికి త్రాగునీరు, అన్నం అడిగే వారికి అన్నం, ధర్మబుద్ధితో, ప్రతిఫలాక్షలేకుండా ఇచ్చే ఉత్తముడు నందగోపుడు. అటువంటి మాస్వామీ మేలుకోవయ్యా అని శుభోదయం పలుకుతున్నారు.

Also read: కెందామరనేత్రుడు శంఖచక్రధరుడు ఆజానుబాహుడు

యశోద సుకుమారమైనది. ప్రబ్బలి చెట్టువలె సున్నితమైన మహిళలలోకెల్లా చిగురువంటిది. యదువంశానికి కులదీపము. మాయజమాని, స్వామిని, యశోదా లేవమ్మా.

ఆకాశాన్ని రెండుగా చీల్చుకుంటూ మధ్యలో ఎదిగిన వాడా, నిత్యసూరులకు రారాజా, త్రివిక్రముడైన శ్రీకృష్ణమూర్తీ లేవయ్యా.

స్వచ్ఛమైన ఎఱ్రని బంగారంతో చేసిన కడియాన్ని ధరించిన బలదేవా, నీవూ నీ తమ్ముడూ ఇద్దరూ లేవండి, అని గోపికలు మేలుకొలుపులుపాడుతున్నారు.
ప్రబ్బలి చెట్టు నీటి ఒడ్డున ఉంటుంది. నీటి వేగం ఎక్కువైతే వంగి పోతుంది. నీరు వెడలిపోయిన తరువాత లేచి నిలుస్తుంది. సహజంగా మార్దవమైనదీ, ప్రియుని అనుసరించడం లో నేర్పు గల స్త్రీని ప్రబ్బలి చెట్టుతో పోలుస్తున్నారు గోదమ్మ. అటువంటి స్త్రీ జాతికి చిగురు అంటే శ్రేష్టమైనది యశోద. శ్రీ=లక్ష్మీదేవి స్వామిని, శ్రియఃపతి స్వామి. నంద యశోదలు తమకు సర్వేశ్వరుని అందించే వారు గనుక వీరినే స్వామినీ, స్వామి అని సంబోధిస్తున్నారు. యశోద మంత్రము. మంత్రము వలె భగవానుని గర్భములో నిమిడ్చికొని కాపాడునది. ఆశ్రితులకు దప్ప ఇతరులకు కనబడకుండా కుమారుడిని కాపాడుతున్నది యశోద.

Also read: రాముడు ‘‘నేడు పోయి రేపురా’’ అని, రావణుడుతో బతికించి పోయాడు

విశేషార్థం

యశః =కీర్తిని ద=యిచ్చునది. పరమాత్మే యశస్సు. ఆ పరమాత్మనుఇచ్చేది యశోద మంత్రము అని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు వివరించారు. విష్ణు షడక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి, నారాయణాష్టాక్షరి వంటి మంత్రాలున్నాయి వాటిలో శ్రేష్టమైనది నారాయణ అష్టాక్షరి. అన్నిమంత్రాలలో తిరుమంత్రము వంటిదే యశోద. మంత్రో మాతా, గురుఃపితా = మంత్రమే తల్లివంటిది, గురువే తండ్రి వంటి వాడు. భగవంతుడినే కుమారుడిగా పొందిన కౌసల్య, దేవకి యశోద అనే ముగ్గురిలో శ్రేష్ఠమైనది యశోద. కౌసల్యకు దేవకికీ కుమారినితో కలిసి ఉండే భాగ్యం కలగలేదు. కుమారుని కట్టి, కొట్టే అధికారం కలిగింది యశోద. భగవంతుడిని పూర్తిగా వశపరుచుకునే శక్తి యశోదకు ఉన్నట్టు తిరుమంత్రానికి మాత్రమే ఉంది. ఈ మంత్రము మేలుకొనడం అంటే తిరుమంత్రార్థమును మనకు విశదం చేయడమే. ఆచార్యుని మంత్రమును మంత్రార్థమును గోపికలు మేలుకొలుపుతున్నారు.
ఇక శ్రీ కృష్ణుడికి మేలుకొలుపుపాడుతున్నారు. ఆయన వామనావతారాన్ని పొగుడుతున్నారు. రాజ్యం కోల్పోయిన దేవతలకోసం యాచకుడై వచ్చినవాడు, బలి దానమివ్వగానే ఆకాశాన్ని మధ్యకుచీలుస్తూ పెరిగిన వాడు లోకాలు కొలిచిన వాడు, రాజ్యమిప్పించిన వాడు. వాత్సల్యానికి పరాకాష్ట వామనుడు. ద్రౌపది గోవిందా అని పిలిస్తే కావలసినన్ని వస్త్రాలు ఇచ్చిన వాడు, భూమి అంతా కొలిచి అలసి నిద్రిస్తున్నావా? పాదములు కందినవా? ఏమినిద్ర? లేవయ్యా గోపయ్యా అంటున్నారు గోపికలు. నారములు అంటే నిత్య పదార్థములు, ఆయన అంటే చోటు. సర్వపదార్థముల యందు తానుండి, సర్వపదార్థములను తనయందు నిలుపువాడు నారాయణుడు. వామనుడు త్రివిక్రముడైనప్పుడు సర్వవ్యాపకత్వము నిరూపణ అయింది. అంబరం అంటే ఆకాశం. ఆకాశానికి పర్యాయం శూన్యం. వేదాలను నిరసించే వేద బాహ్యులు, సర్వశూన్యవాదులను నిరసించి సర్వజగద్వ్యాపకమైన భగవత్తత్వము కలదని అస్తిత్వము చూపినదీ వామనావతారము. ముందు అన్నగారిని లేపండి. ఆయనతోపాటు నేనూ లేస్తాను అని శ్రీకృష్ణుడు అన్నాడు. అప్పుడు బలరాముడిని లేపుతున్నారు.
అతను రామావతారంలో లక్ష్మణుడు, రామానుజుడు. లక్ష్మణుడు సీతాసమేతుడైన రాముని సేవించడానికి ఆశపడినట్టు, శ్రీకృష్ణుడిని మాతో చేర్చి మమ్మల్ని ఆనందింపజేయగలవు. నిద్రించడం తగదు. దేవకీ వసుదేవుల ఏడవ సంతానం బలరాముడు. గర్భంమార్చి రోహిణి యందు ప్రవేశ పెట్టడం వల్ల బతికి సుఖంగా ఉన్నాడు కనుక, అతని వల్ల శ్రీకృష్ణుడు కూడా క్షేమంగా ఉన్నాడుకనుక అతని కాలికి బంగారు కడియం వేశారట. ఆయన పాదానికి తొడిగిన కడియమే భగవచ్ఛేషత్వము. కడియమున్న బలరాముని పాదమే భాగవత శేషత్వము.
గుహుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు, విభీషణుడు రాముడిని చేరింది లక్ష్మణుడి ద్వారానే. ఆయనే ఇప్పుడు శ్రీకృష్ణుడి దరిచేర్చేబలరాముడు. నీవూ తమ్ముడూ లేవండి అని అందుకే బలరాముడిని లేపుతున్నారు గోపికలు.

Also read: ఆమె మరో సీత – గోదాదేవి

గోదమ్మ పాదాలకు శరణు శరణు

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles