Sunday, November 24, 2024

భారత్ జోడో యాత్ర ప్రభావం గణనీయం

ఎట్టకేలకు భారత జోడో యాత్ర ఒక మజిలీకి చేరుకున్నది. దేశ రాజధానిలోకి యాత్ర ప్రవేశించిన సమయానికి జాతీయ ఆత్మ మేలుకున్నది. ఇందుకు ఆలస్యంగానైనా, అయిష్టంగానైనా ప్రధాన స్రవంతికి చెందిన మీడియా సంస్థలు యాత్ర వాస్తవికతను గుర్తించిన కారణంగానే ఇది సంభవమైంది.  ఈ యాత్ర ప్రభావం రాజకీయ వేదికమీదికి కూడా చేరుకున్నది. యాత్రను నిలుపు చేయడానికి కోవిద్ ముప్పును నరేంద్రమోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేయడం ఇందుకు దోహదమైంది.

Also read: ఎన్ డీటీవీని కులీనులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం అనొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, రవీష్ కుమార్ ని ఆవిష్కరించింది

ఎప్పుడైతే రంగంలో ప్రవేశిస్తామో అప్పుడే పరీక్ష జరుగుతుంది. దేశంలోని అగ్రశ్రేణి మేధావుల నుంచి విమర్శనాత్మకమైన వ్యాఖ్యానాలు వెలువడినాయి కనుక యాత్ర  జయప్రదమైందని అనుకోవాలి. ఇంతవరకూ టీవీలు లైవ్ లో యాత్రను చూపించాయి. అధికార ప్రకటనలు వెలువడినాయి. తోటి యాత్రికుల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. క్షేత్ర నివేదికలు వెలువడినాయి. విశ్లేషణలు వచ్చాయి. ఇటీవల ప్రచురితమైన వ్యాసాలు చర్చను సరికొత్త స్థాయికి తీసుకొని వెళ్ళాయి. రాహుల్ గాంధీ టీ-షర్టు, యాత్రలో వినియోగించే కంటైనర్, యాత్ర సాగే మార్గం గురించి కాకుండా అసలు విషయాలపైన చర్చ జరిగింది. జాతీయ రాజకీయ జీవితంపైన దీని ప్రభావం ఏమిటి? మన గణతంత్రాన్ని విఫలం చేయడానికి సమాయత్తమైన అపరిమిత అధికారానికి ప్రత్యామ్నాయంగా సైద్ధాంతిక, రాజకీయ వేదిక తయారైనదా? అనే ముఖ్యమైన అంశాలపైన చర్చ జరిగింది.

Also read: భారత్ జోడో యాత్రలోనూ, రాజకీయ సభలలోనూ సెల్ఫీ వేటగాళ్ళ ప్రవర్తన నాకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది

విమర్శలను కాంతిపుంజాలుగా చూడండి

ఇటీవల ఇండియన్ ఎక్సె ప్రెస్ లో ప్రచురించిన సుహాస్ పాల్సేకర్, ప్రతాప్ భాను మెహతాలు రచించిన రెండు వ్యాసాల గురించి ప్రస్తావిస్తాను. వారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులని మాత్రమే కాదు. వారు భారత్ జోడో యాత్రకు సుముఖంగా ఉంటూ మొట్టమొదటిసారి యాత్రపైన సునిశితమైన విమర్శ చేశారు. పాల్సీకర్ సందర్భాన్ని సవ్యంగా నిర్వచించారు: రాజ్యాంగ విధివిధానాలను మళ్ళీ నొక్కి చెప్పడమే కాదు, భారతీయతను పునర్ ఊహించడం, ప్రజాస్వామ్య పథాన్ని పునర్ నిర్వచించడం అవసరం. ఈ సవాలు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని యాత్ర జయప్రదం అయినదో, కాలేదో నిర్ణయించాలి.

Also read: ఇంగ్లీషు మాధ్యామాన్ని క్రమంగా, తెలివిగా తప్పించండి

యాత్ర ఇంతవరకూ సాధించిన ఫలితాలతో ఇద్దరూ సంతృప్తి వెలిబుచ్చలేదు. కొత్త రాజకీయ విస్తృతిని సృష్టించేందుకు వినూత్నమైన ప్రయత్నం యాత్ర ద్వారా జరిగినట్టూ, రాజకీయ ద్వేషం పట్ల ప్రభావవంతమైన వైఖరిని ప్రదర్శించినట్టూ అంగీకరిస్తూనే, ఇది రాజకీయమైన ఆశాభావాన్ని కలిగించిందని ఇప్పటి వరకూ చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రధాన లక్ష్యాలైన పార్టీ పునరుజ్జీవనం, మన ప్రజాస్వామ్య అస్థిత్త్వాన్ని తిరిగి ఆవిష్కరించడం అనే రెండు ప్రధాన లక్ష్యాలనూ సాధించే క్రమంలో యాత్రది తక్కువ స్థాయి ప్రదర్శనగానే పాల్సీకర్ అభివర్ణించారు.

ఈ అంచనాలతో విభేదించాలని ఒకానొక యాత్రికుడికి అనిపించవచ్చు. యాత్ర ప్రారంభించిన నాటి  పరిస్థితులను విమర్శకులు పూర్తిగా అర్థం చేసుకోలేదని అనుకోవచ్చు.  యాత్ర పరిధిలో ఉన్న వాటికంటే ఎక్కువ అవకాశాలను ఊహించుకున్నారని కూడా భావించవచ్చు. యాత్ర ముగిసిన తర్వాత దాని ఫలితాలు కనిపిస్తాయని కూడా కొందరు వాదించవచ్చు. ఇది కొంతవరకూ మెహతా వాదన. యాత్ర ఇంకా గమ్యం చేరలేదు. నిజానికి శ్రీనగర్ దాటి వెళ్ళి ప్రతి భారతీయుడి మనస్సునూ, హృదయాన్నీ చేరాలన్నది యాత్ర లక్ష్యం. ఈ మధ్యంతర అంచనాలను కాగల కార్యానికి మార్గదర్శకాలుగానే పరిగణించాలి. యాత్ర భౌగోళిక, రాజకీయ, మేథో పరమైన పరిధులను విస్తరించేందుకు ప్రయత్నించాలన్న పాల్సీకర్ సూచనను యాత్రికులు పట్టించుకుంటే  మేలు. లేదా మెహతా ప్రతిపాదించిన మూడు పరీక్షలు – కొత్త భావజాల దృక్పథాన్ని సృష్టించడం, రాజకీయంగా వేగం పుంజుకోవడం, ప్రతిపక్ష సమైక్యతకు కుదురు కావడం- తట్టుకునే ప్రయత్నం చేయాలి.

ఇటువంటి విమర్శనాత్మకమైన సమీక్షలు చేసుకోవడం వల్ల భావజాలం, రాజకీయం అనే రెండు ప్రధాన లక్ష్యాలలో భారత్ జోడో యాత్ర ఏమి ఎంతవరకు వాస్తవంగా సాధించిందో తెలుసుకోవడానికి వీలవుతుంది. కొత్త సంవత్సరంలో యాత్రను తిరిగి ప్రారంభించినప్పుడు ఏమి చేయాలో కూడా తెలుస్తుంది.

Also read: భారత్ జోడో యాత్ర మామూలు రాజకీయ తమాషా కాదనడానికి 6 కారణాలు

సందేశానికి పదును పెట్టాలి, విస్తృతిని పెంచాలి

భారత జోడో యాత్ర సవాలు చేస్తున్న భావజాలపరమైన అంశమే చాలా కఠినమైన పరీక్ష. మా సంస్థలాంటి సంస్థలూ, చాలా ప్రజాఉద్యమాలు ఈ యాత్రతో కదం కలపడానికి ప్రధాన కారణం అదే. ఈ యాత్ర జయప్రదమైతే కేవలం కాంగ్రెస్ కే కాదు, యావత్ ప్రతిపక్షానికి ప్రయోజనం చేకూరుతుంది.  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-భారతీయ జనతా పార్టీ జమిలి భావజాలాన్ని సూటిగా, ధాటిగా సవాలు చేయడం ఈ యాత్ర సాదించిన ఘనవిజయం. బీజేపీ ప్రత్యర్థులు సైతం హిందూత్వని అనుసరిస్తున్న భావజాలం తయారైన పరిస్థితులలో భారత జోడో యాత్ర రాజ్యాంగ విలువలను ఎలుగెత్తి చాటుతూ లౌకికవిధానం పట్ల దృఢమైన విశ్వాసాన్ని ప్రకటించింది. విధేయ పెట్టుబడిదారీ విధానాన్ని(క్రోనీ కెపిటలిజం) ఖండించేందుకు ఒక రాజకీయనాయకుడు వేదిక ఎక్కి మాట్లాడి చాలా సంవత్సరాలు అయింది. వేదికమీద నుంచీ లేదా విలేఖరుల గోష్ఠులలో మాట్లాడిన విషయాలకే యాత్ర పరిధి పరిమితం కాలేదు. దీని తీర్థయాత్ర లాంటి స్వభావం, తపస్సు గురించి మాట్లాడటం, ఫలితంగా ఏర్పడే సంఘీభావం బీజేపీ భావజాల ఆధిక్యాన్ని దెబ్బకొట్టగలిగాయి. ప్రేమ, ఐకమత్యం అనే పదాలను మళ్ళీ చెలామణిలోకి తెచ్చింది. కర్షకుల, కార్మికుల, పేదల భారత్ ను ఎత్తి చూపింది. ద్వేషాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటం సాధ్యమని నిరూపించింది. ఇది స్వల్ప విజయమేమీ కాదు.

జాతీయ స్థాయిలో వాతావరణం మారాలంటే ఇంకా చాలా చేయవలసి ఉన్నది. చాలా సందర్భాలలో సందేశం ఇచ్చే వ్యక్తి కంటే సందేశం తక్కువ ప్రాధాన్యం పొందింది. ఇది అవసరం కూడా. ఎందుకంటే సందేశాన్ని గంగలో కలపడానికి సందేశం ఇచ్చేవాడిని అవహేళన చేయడం బీజేపీ అనుసరిస్తూ  వచ్చిన విధానం కనుక. ఇకపైన సందేశానికి పదును పెట్టడానికీ, విస్తృతి పెంచడానికీ  భారత జోడో యాత్ర ప్రయత్నించాలి. ప్రతాప్ మెహతా చెప్పినట్టు యాత్ర విషయంలో సందిగ్థం సమస్య కాదు. సందేశాలు అనేకం కావడంతో అసలు సందేశం స్పష్టత కోల్పోయి డీలా పడిపోయే ప్రమాదం ఉన్నది. మీడియా బొత్తిగా సహకరించక పోయినప్పటికీ ఈ సందేశాన్ని దేశంలోని అత్యధిక ప్రాంతాలకు చేర్చడం అవసరం.

రాజకీయరంగాన్ని నేరుగా ప్రభావితం చేసే విషయంలో సైతం యాత్ర కొంత అసాధారణ విజయం సాధించింది. కాళ్ళను నేల మీదికి తెచ్చింది. ప్రజలు వీధులలోకి వచ్చి పోరాడితేనే రిపబ్లిక్ (గణతంత్రం)మనుగడ సాగిస్తుంది. భారత జోడో యాత్ర ఈ విషయం రేఖామాత్రంగా చూపించింది.

Also read: చట్టసభల నుంచి రహదారి వరకూ- కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలు ఎందుకు చేరుతున్నాయి?

మొక్కపోయిన మోడీ ప్రధాన ఆయుధం

ఎన్నికలపైన, కాంగ్రెస్ భవిష్యత్తుమీద ప్రభావం ఏమిటి? పౌరసమాజానికి చెందిన యాత్రికులకు ఆ విషయం ప్రధానం కాకపోవచ్చు. కానీ కాంగ్రెస్ భవిష్యత్తు గురించి దేశ పౌరులు తమకేమీ పట్టనట్టు ఉండజాలరు. ఈ చారిత్ర సందర్భంలో దేశ భవితవ్యం కాంగ్రెస్ భవితవ్యంతో నిస్సందేహంగా ముడివడి ఉన్నది. ఈ విషయంలో యాత్ర ఇప్పటికే గణనీయమైన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కలిగి ఉండటానికి తగిన కారణాన్ని కాంగ్రెస్ సానుభూతిపరులూ, కాంగ్రెస్ కార్యకర్తలూ కనుగొన్నారు. నాయకత్వం పట్ల పార్టీకి విశ్వాసం పెరిగింది. రాహుల్ గాంధీ ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ పరివారం అంతర్గత వ్యవహారం. ఇది చాలు కాంగ్రెస్ పార్టీ భవితవ్యాన్ని మార్చడానికి. అయితే, ఇది చాలాకాలంగా ఎదురు చూస్తున్న మొదటి అడుగు మాత్రమే.

కాంగ్రెస్ వెలుపల కూడా భారత్ జోడో యాత్ర ప్రభావం ఉన్నది. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెసేతర శిబిరంలో కూడా కాంగ్రెస్ కు కొత్తగా చాలామంది మిత్రులు ఏర్పడ్డారు. వందలాది ప్రజాఉద్యమాల ప్రతినిధులూ, సంస్థలూ ఈ యాత్రలో పాల్గొన్నాయి. వారి హృదయాలను గెలుచుకోవడంలో రాహుల్ గాంధీ చాలా ప్రభావవంతంగా వ్యవహరించారు. సాధారణ ప్రజలకు సంబంధించినంతవరకూ ఈ యాత్ర వల్ల జరిగిన పరిణామం ఏమిటంటే రాహుల్ గాంధీ పట్ల ప్రజాభిప్రాయంలో మార్పు. ఇంతకు ముందు ఆయనకు తగిలించిన అవహేళనపూర్వకమైన ‘పప్పు’ అనే మాట ఇప్పుడు లేదు. అదే మోదీ చేతిలోని బలమైన ఆయుధం. అది మొక్కపోయింది. అది ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే కాకుండా మొత్తం ప్రతిపక్షానికి సహాయం చేస్తుంది.

ఇదంతా ఆరంభం మాత్రమే. యాత్ర జయప్రదమైనంత మాత్రాన ఎన్నికలలో విజయం సిద్ధించాలన్న హామీ ఎక్కడా లేదు. మొదట చూడవలసింది నేషనల్ డెమాక్రాటిక్ ఫ్రంట్ లో లేని పార్టీల సంగతి. ప్రతిపక్షాలన్నిటినీ గుదిగుచ్చి ఎన్నికల మహాఘటబంధన్ ను తయారు చేయనక్కరలేదు. ఐకమత్యం గురించి లక్ష్యశుద్ధి ఉండాలి. గోడమీద పిల్లివాటంగా కూర్చున్న ఓటర్లను ప్రభావితం చేసి వారి ఓట్లు సంపాదించుకునే పని ఇంకా జరగవలసి ఉంది.

మన గణతంత్రం ఎదుర్కొంటున్న అబద్ధాల, విద్వేషపు గోడకు భారత్ జోడో యాత్ర రంధ్రం చేయగలిగింది. అది కొంత ఆశారేఖనూ, స్వచ్ఛమైన గాలినీ అందించగలిగింది. యాత్ర తర్వాతనే అసలు పని ప్రారంభం అవుతుంది. సుహాస్ పాల్సీకర్ మనల్ని హెచ్చరించినట్టు యాత్ర ఒక ఘటన (ఈవెంట్) లేదా ఒక వేడుక మాత్రమే కాకూడదు. అది ఒక ఉద్యమం కావాలి.

Also read: బీహార్ మోదీ కొంప ముంచుతుందా?

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles