Saturday, November 23, 2024

భీతిల్లే లేడికూన సీత

రామాయణమ్ – 133

‘‘నా” అనేవారులేక, పలకరించే దిక్కులేక, వేటకుక్కలగుంపు మధ్యలో చిక్కుకొని పోయి భీతిల్లే లేడికూన లాగ భయంకరము, వికృతము అయిన ఆకారములు గల రాక్షస స్త్రీల మధ్య మాసిన వస్త్రముతో, మట్టికొట్టుకుపోయి  బక్కచిక్కిన శరీరముతో ఒక తాపసివలే నేలమీద కూర్చున్న పడతి ఎవరీమె?

అణగిపోయిన ఆశ వలె

దెబ్బతిన్న శ్రద్ధ వలె

విఘ్నముకలిగిన కార్య సిద్ధివలె

దోషారోపణ చేత దెబ్బతిన్న కీర్తివలె

మళ్ళిమళ్ళి చదవక మరుగున పడిన విద్యవలె!

Also read: ఆమె ఎవరు?

భాషరాని వాని భిన్నార్ధము ధ్వనించు మాటవలె (వాడు చెప్పదలుచుకొన్నది ఒకటి మనకు అర్ధమయ్యేది మరొకటి)

ఉన్న ఈ వనిత ఎవరు?

నాకు రాముడు చెప్పిన అలంకారముల గురుతులు ఈవిడ ధరించి ఉన్న ఆభరణములు ఒకటే అయివున్నవి.

ఈమె కట్టుకొన్న చీర కొద్దిగా చిరిగి ఉన్నది, మాకు ఋష్యమూకముమీద పడ్డ నగలమూట ఈ చీరనే చింపి ఈవిడ కట్టినట్లుగా ఉన్నది!

అవును నిస్సందేహముగా అదే చీర.

Also read: అశోక వనమున వెదకలేదని గుర్తించిన హనుమ

సందేహములేదు.

ఆవిడ జనకరాజసుత.

దశరధుని కోడలు.

రాముని పట్టపురాణి.

సీతామాతయే!

అని మారుతి ఆవిడను పోల్చుకొన్నాడు.

ఆహా, ఏమి రూపము ఒకరికొరకు మరియొకరు పుట్టినారా అన్నట్లుగా యున్నది.

ఈ దేవి రూపము, అంగ ప్రత్యంగసౌష్టవము ఎటులున్నదో రాముని రూపము చక్కదనము కూడా అటులనే యున్నది.

Also read: చింతాక్రాంతుడైన ఆంజనేయస్వామి

రామునికి సీత

సీతకు రాముడు

వీరువురినీ తగులకట్టిన ఆ బ్రహ్మ ఎంత నేర్పరివాడో.

ఈ సీతా దేవి మనస్సు రాముని పై స్థిరముగా యున్నది.

ఆ రాముని మనస్సు ఎల్లప్పుడూ ఈవిడ మీదనే కదా.

అందుచేతనే ఒకరిమీద మరియొకరు ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారుకాబోలు.

ఈమె నుండి దూరమైన పిమ్మట శ్రీరామ ప్రభువు ఇంకా ప్రాణములతో జీవించుచున్నాడు అనగా ఆ ప్రభువు నిజముగా  చేయ శక్యము కాని పని చేయుచున్నాడు.

ఓ ప్రభూ, రామా, నీవు చాలా కష్టము మీద జీవించుచున్నావని తెలిసినదయ్యా.

రాముని, సీతను ఈ విధముగా తన అంతరంగములో తలచి హనుమ మరల ఆలోచనలో మునిగిపోయెను.

Also read: హనుమ ఎంత వెదికినా కానరాని సీతమ్మ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles