వోలేటి దివాకర్
ఒక్కప్పుడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఎపిసోడ్ లో కీలక పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు మొన్నటి వరకు రామలక్ష్మణుల్లా మెలిగారు. వచ్చే ఎన్నికల్లో తుని సీటు విషయంలో అన్నదమ్ములు ఇద్దరి మధ్యా విభేదాలు నెలకొని అన్నపై తమ్ముడు తిరుగుబాటు చేసే పరిస్థితులు నెలకొన్నాయి.
Also read: ఏడుపు ఎంతో గొప్ప….
గత రెండు ఎన్నికల్లో యనమల కృష్ణుడు , వైసీపీ అభ్యర్థి, నేడు మంత్రి అయిన దాడిశెట్టి రాజా చేతుల్లో ఓడిపోవడంతో ఈసారి సీటు లభించే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడికి సంకేతాలు ఇచ్చారు . యనమల రామకృష్ణుడిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన రాజా అశోక్ బాబును ఇటీవల హైదరాబాద్ రప్పించుకొని చంద్రబాబు ఆయనతో చర్చలు జరిపారు. తన సోదరుడుకు సీటు దక్కకపోతే తన పెద్ద కుమార్తె దివ్యకు తుని సీటు ఇప్పించుకునేందుకు యనమల రామకృష్ణుడు పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల భోగట్టా. అయితే యనమల రామకృష్ణుడు తలుచుకుంటే అది పెద్ద విషయం కాదు.
Also read: అలా ఉండే వెంకయ్య నాయుడ్ని ఇలా మార్చిన తెన్నేటి!
కృష్ణుడు కాకపోతే ఓడిస్తాం!
ఈ నేపథ్యంలో తునిలో జరిగిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమావేశంలో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పనిచేయాలని, సీటు ఎవరికి ఇచ్చినా పార్టీ విజయానికి కృషి చేయాలని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లను యువతకు కేటాయిస్తారని స్పష్టం చేశారు . యనమల రామకృష్ణుడు ప్రకటనపై కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దీనిపై స్పందించిన యనమల రామకృష్ణుడు ‘నీవు … నేను కూర్చుని మాట్లాడుకుందాం. నీకు నాకు రెండేళ్ల గ్యాప్ ఉంది . మన ఇద్దరం ఒక తల్లికి పుట్టకపోయినా అన్నదమ్ముల పిల్లలం. ఇది మన కుటుంబం కాదు .. తెలుగుదేశం కుటుంబం’ అంటూ యనమల మందలించే స్థాయిలో మాట్లాడారు.
Also read: యువతకు మార్గదర్శనం…ఉత్తరాంధ్ర రామకృష్ణ – వివేకానంద భక్త సమ్మేళనం
అయితే, ఇంతకాలం పాటు ఆహర్నిశలు శ్రమించిన యనమల కృష్ణుడికి కాకుండా వేరొకరికి సీటు ఇవ్వడం భావ్యం కాదని నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు. యనమల కృష్ణుడే పోటీచేయాలనీ, వేరొకరు పోటీ చేస్తే తుని లో టిడిపికి విజయం దక్కదనీ కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వ్యూహాత్మకంగా అధిష్టానానికి చేరే విధంగా కృష్ణుడు సోషల్ మీడియాలో పెట్టించినట్టూ ప్రచారం జరుగుతోంది.
తప్పేంటి?
యనమల కృష్ణుడు తన సోదరుడిని బెదిరించే స్థాయిలో మాట్లాడాలంటూ కార్యకర్తలకు ఫోన్ చేశారు. అవును ఫోన్లో మాట్లాడిన మాట వాస్తవం. అందులో తప్పేముందంటూ యనమల కృష్ణుడు స్పష్టం చేశారు.
‘‘ఎస్ ఆ వీడియో నాదే, నేనే చెప్పమన్నాను. ఎందుకంటే 2014 లో అనుభవం లేదు. 2019 కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కాపు ఉద్యమంపై తుపాకులు పేల్చడం, దివిస్ పరిశ్రమ ఏర్పాటు చేయడం వంటి కారణాలు వల్ల ఓడిపోయాను. ఇప్పుడు బలంగా ఉన్నాను. కరోనా సమయంలో మంచి సేవలు అందించాను. ఒక్కసారైనా కృష్ణుడిని అసెంబ్లీకి పంపించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అదే విషయాన్ని చెప్పమని చెప్పాను. ఆ ఆడియోలో ఆశ్చర్యపోయేదేమీ లేదు’’ అంటూ ఆయన కుండ బద్దలుకొట్టారు. ఈపరిస్థితుల్లో తునిలో టీడీపీ సీటు ఎవరికి దక్కినా ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. యనమల రామకృష్ణుడు కుమార్తెకు ఇస్తే కృష్ణుడి వర్గీయులు… కృష్ణుడి కి ఇస్తే యనమల రామకృష్ణుడు వర్గీయులు ఓడించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దాడిశెట్టి రాజా ఎలాగూ ఉన్నారు.
Also read: కిలోకు పావు కిలో తక్కువ!