Thursday, November 21, 2024

చదవడం కాదు, సి.వి. రచనలు జీర్ణించుకోవాలి!

రక్తమాంసాలు గల మానవుణ్ణి ప్రేమిస్తాను

అవిటి చెవిటి మూగ దేవుణ్ణి మాత్రం నమ్మను

మానవుణ్ణి ద్వేషించే మీరు దేవుణ్ణి పూజిస్తారు

దేవుణ్ణి కాదనే నేను, మానవుణ్ణి ప్రేమిస్తాను!

‘నరబలి’ కావ్యంలో వేనుని కథని సి.వి. తనదైన ఆధునిక  దృక్కోణంతో రాశారు. తన సిద్ధాంతాన్ని వేనుని  పాత్ర ద్వారా అలా వెల్లడించారు.

‘‘పట్టెడన్నం పెట్ట నిరాకరిస్తున్న వర్గం/ అప్పనంగా మంది సొమ్ము తినమరిగిన పూజారి పురోహిత వర్గం/కొండల్లో ఎన్నడో పారిపోయి బండరాయిలా దాక్కున్న నిన్ను/ వెతికి వెతికి పట్టుకొచ్చి వీధికెక్కించారు గదరా!’’ అని దేవుణ్ణి ఎద్దేవా చేశారు సి.వి. – తన ‘ఊళ్ళోకి స్వాములోరు వచ్చారు’ కావ్యంలో – ఇంతకీ ఎవరీ సి.వి? ఈ తరం యువతీయువకులకు అంతగా పరిచయం ఉండకపోవచ్చు. సి.వి. పూర్తి పేరు చిత్తజల్లు వరహాలరావు (14 జనవరి 1930- 08 అక్టోబర్ 2017) కానీ, పొడి అక్షరాలతో సి.వి. గానే ప్రసిద్ధులు. కవి, రచయిత, హేతువాది, సాంస్కృతిక రథసారథి, నిత్య పరిశోధకుడు, దిగంబర కవుల మార్గదర్శి, శాస్త్రీయ విజ్ఞాన కార్యకర్త, మార్క్సు-ఏంగిల్స్ లను అమితంగా ప్రేమించినవాడు, సి.పి.ఐ(యంఎల్) వైపు నిలబడ్డానని ప్రకటించుకున్నవాడు. కొన్ని విభేదాలు ఉన్నా శ్రీశ్రీకి ఏకలవ్య  విష్యుడు – ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. ‘‘సాయుధ విప్లవం ద్వారా ప్రభుత్వాధికారాన్ని హస్తగతం చేసుకోవడం – కష్ట జీవులు తమ భవితవ్యానికి తామే అధినాధులు కావడం’’- అని పారిస్ కమ్యూన్ సారాంశాన్ని విప్పి చెప్పారు సి.వి! గుంటూరులో జన్మించిన ఈ  ముందుతరం రచయిత, మరణించేంత వరకు విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నారు. సి.వి. తండ్రి వెంకటాచలపతి స్వాతంత్ర్య సమరయోధుడు. తల్లి లక్ష్మీదేవమ్మ. గుంటూరు ఏసీ కాలేజిలో బి.ఎ. చదువుతూ ఉండగా, విప్లవ దళిత కవి శివసాగర్ సి.వి.కి క్లాసు మేట్. తర్వాత, ఎకనామిక్స్ తో పి.జి. డిగ్రీ, మద్రాసు క్రిస్టియన్ కాలేజి నుండి తీసుకున్నారు (1953). మద్రాసులో విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఎక్కువ కాలం అక్కడ కన్నెమెర గ్రంథాలయంలో గడిపేవారు. కావాల్సిన విషయాలన్నీ నోట్స్ రాసుకునేవారు. అవే ఆయనకు తర్వాత కాలంలో 30 పుస్తకాలు రాయడానికి ఉపయోగపడ్డాయి. (ఈయన ‘నరబలి’ గ్రంథాన్ని వి. నారాయణస్వామి కన్నడంలోకి అనువదిస్తే, కారు చీకట్లో-రచనను మోహన ప్రసాదు ఇంగ్లీషులోకి అనువదించారు.)

Also read: బుద్ధుడు, విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు కాదు!

1850లలోని మార్క్సిస్టు ఉద్యమాలతో మమేకమైన సి.వి. మొదట కవిగా సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తర్వాత కాలంలో విషయాలు వివరంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే – పద్యం కన్నా గద్యమే సరైనదని గ్రహించారు. ఆ రకంగా ఎన్నో రచనలు వెలువరించారు. నరబలి, సత్యకామ జాబాలి, ఏడు కొండలవాడా గోవిందా, ఆంధ్రలో సాంఘిక తిరుగుబాటుఉద్యమాలు,  కారు చీకటిలో కాంతిరేఖ, స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ, భారత జాతీయ పునరుజ్జీవనం, విషాద భారతం, పారిస్ కమ్యూన్, కొటిల్యుని అర్థశాస్త్రం : పుట్టుపూర్వోత్తరాలు వంటి పుస్తకాలన్నీ ఆయనను సామాజిక విప్లవకారుడిగా నిలబెడతాయి. వర్ణవ్యవస్థ, మనుధర్మశాస్త్రం, ప్రాచీన భారతంలో చార్వాకం, ఆధునిక యుగంలో కులవ్యవస్థ వంటి గ్రంథాలు ఆయన ఎంతటి హేతువాదో నిరూపిస్తాయి. డార్విన్ పరిణామవాదం, సింధూనాగరికత వంటి రచనలు ఆయనలోని వైజ్ఞానిక స్పృహను వెల్లడిస్తాయి. ఆయన స్వయంగా సైన్సు విద్యార్థి కాకపోయినా, వైజ్ఞానిక దృక్పథమన్నది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన అంశమని ఆయన గ్రహించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, దళిత ఉద్యమ వైతాళికుడైన కుసుమ ధర్మన్నను వెలికి తీసి పరిచయం చేయడం మరొక ఎత్తు. అంతేకాదు దళిత సాహిత్యోద్యమానికి ఒక పునాది రాయి కావడం సి.వి. గొప్పదనం! ఆయనలో తెలియకుండానే ఒక గొప్ప పరిశోధకుడు, ఒక చరిత్రకారుడు, ఒక వైజ్ఞానికుడు ఉండడం విశేషం. ఈ లక్షణాలు లేని ఉట్టి కవులూ, రచయితలు తెలుగు వారిలో చాలామంది ఉన్నారు. వారితో సమాజానికి ఎక్కువగా ఉపయోగం ఉండదు. ప్రశ్నించనివాడు, ప్రశ్నను నిలబెట్టనివాడు హేతువాది కానివాడి వల్ల, సమాజానికి ఉపయోగమేమిటీ?  ఆ రకంగా పైరవీలు చేసి అవార్డులు తెచ్చుకున్నవారికన్నా, ప్రభుత్వంలో ఉన్నవారికి  భజనలు చేసి పదవులు అనుభవించిన వారికన్నా సి.వి. జీవితం చాలాచాలా విలువైంది. అందుకే చెప్పేది, ఆయన రచనలు ఊరికే చవడం కాదు- అధ్యయనం చేయాలి! అంతకన్నా ముఖ్యం జీర్ణించుకోవాలి!! ఆచరించాలి-

Also read: దిల్ కి బాత్

‘‘నెరసిన గుబురు మీసాలు / పెరిగిన బైరు గడ్డమా / మానవతను విరజిమ్మే నేత్రాలూ / రక్తమూ కన్నీరు కలిసి సృష్టించిన కొత్త సిద్ధాంతాన్ని / ప్రపంచ ప్రజాకోటి సమర్పించే / మానవోన్నతునిలా ఉన్న ఈయన ఎవరూ? ఆహా ఈయనే కార్ల్ మార్క్స్ / మూర్తీభవించిన తత్త్వశాస్త్రంలా ఉన్న ఏంగిల్స్’’- అని మార్క్సిజం సృష్టకర్తల్ని తన్మయత్వంతో పాఠకుల కళ్ళముందు చిత్రీకరించారు సి.వి. అంతే కాదు, ‘మానవోన్నతమూర్తి స్టాలిన్’- అనే ఒక స్మృతి గీతం కూడా రాశారు. కమ్యూనిస్టు ఉద్యమంతో ఇంతగా పెనవేసుకుపోయిన సి.వి, సమకాలీనంలో ఉన్న కొందరు కమ్యూనిస్టులను తీవ్రంగా దుయ్యబట్టారు. అయితే అది కమ్యూనిజం తప్పుకాదనీ, దాని విలువల్ని నిలుపుకోలేని కొందరు వ్యక్తుల తప్పిదమని వివరణ ఇచ్చారు. వామపక్షవాదులలో సైతం ఇంకా వదలని కులతత్వాన్నీ, ప్రాంతీయ విభేదాల్ని ఎత్తి చూపడానికి ఆయన ఏ మాత్రం జంకలేదు, గొంకలేదు – వ్యక్తులకైనా, పార్టీలకైనా, అధికారంలో ఉన్నవారికైనా, లేనివారికైనా అంతర్మథనం అవసరం. ఆత్మవిమర్శ అన్నింటికంటే ముఖ్యం-

సమాజంలోని కులం, మతం, వర్ణవ్యవస్థ వంటి విషయాల పట్ల కమ్యూనిస్టులు చేయాల్సినంత చేయలేదని సి.వి. భావన. అందుకే ఆయనే స్వయంగా ఆయా విషయాలపై విస్తృతంగా రచనలు చేస్తూవచ్చారు. ‘‘వర్ణవ్యవస్థలాంటి భ్రష్టమైన వ్యవస్థ ఈ భూమండలంలో ఎక్కడైనా ఉందా? వైదిక పురోహిత పరాన్నభుక్కు వర్గమా / పాలకవర్గ శునకాల్ని మీరు ఇస్కో ఇస్కో అంటూ / పాలితులనే కవ్విస్తున్నారు / వాళ్ళే ఇస్కో ఇస్కో అనే దశ ఆద్యంతన భవిష్యత్తులో రాబోతోంది జాగ్రత్త!’’- అని పేదల, శ్రామికుల తిరుగుబాటు అనివార్యం అని- ‘జాబాలి’ ద్వారా హెచ్చరించారు.’’(సత్యకామ జాబాలి 1972) శతాబ్దాలుగా కొనసాగుతున్న తతంగాన్నంతా సి.వి. నాలుగు వాక్యాల్లో తేల్చేశారు. భారతదేశంలో ఫ్యూడల్ వర్గాలు బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రజలపై రుద్ది, సాంస్కృతికంగా కులాల్ని స్థిరపరిచాయి. అవి అలా కొనసాగడానికి కల్పిత పురాణాలు, నిచ్చెనమెట్ల వ్యవస్థ, ఆత్మలు, పరమాత్మలు, పునర్జన్మలు, దేవుని పేరిట ఛాందస ఆచారాలూ సృష్టించి సమాజాన్ని కుళ్ళబొడిచారు. సి.వి. ఇలాంటి విషయాలపై లోతుగా అధ్యయనం చేశారు. ఇతర ఏ కమ్యూనిస్టు రచయితా రాయనంత స్పష్టంగా, బలంగా గ్రంథ రచన చేసి కొత్త తరాల్ని కూడా ప్రభావితం చేశారు. ఈ విషయాలన్నింటినీ గుదిగుచ్చి ఉద్యమ స్వరాన్ని సి.వి. స్పష్టంగా వెల్లడించారు.

Also read: సంత్ కబీర్ మానవవాద కవితలు

‘‘కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకసారి, మతతత్త్వంపై మరోసారి, దున్నేవానికే భూమి –అని ఒక సారి- రాజ్యాధికారానికి వేరొకసారి- ఇలా ఉద్యమాలు, పోరాటాలు వేటికవి విడివిడిగా ఉండవేమోనని నేనకుంటున్నాను. దోపిడీ శక్తుల కులమూ-వర్గమూ-రాజ్యమూ కలగలిసి ఉన్న వ్యవస్థలో పీడిత కులాల వర్గాల ఉద్యమాలు-పోరాటాలే కాదు, ఉద్యమ శక్తులు కూడా కలగలిసే ఉండాలి. వారి నడుమ కనీస సమన్వయం, సహకారం ఉండాలి. పందులదొడ్డి కంటే హీనంగా దేశాన్ని దిగజార్చిన పాలకులు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశించకుండా, లొంగకుండా, ఉద్యమశక్తులు పోరాట చేవతో సమరశీలంగా సాగాలి. సాహిత్య, సాస్కృతిక రంగాలలో కృషి, సాంఘిక-రాజకీయ రంగాల కృషితో సమన్వయం కావాలి. వర్గపోరాటం ఆగ్రకుల వ్యతిరేక పోరాటంతో, భూస్వామ్యశక్తుల వ్యతిరేక పోరాటంతో భుజంభుజం కలిపి సాగాలి. దళితులు, మహిళలు, మైనారిటీలు, ఆదివాసీ పోరాటాలు, శ్రామిక వర్గ పోరాటాలతో మమేకం కావాలి’’- ఇంత స్పష్టంగా, ఇంత సరళంగా ఉద్యమ స్వరూపం గురించి చెప్పిన రచయిత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. కానీ, కాలగమనంలో ఏమైంది? దళితులు, మహిళలు, మైనార్టీలు విడివిడిగా తమతమ అస్థిత్వ పోరాటాలు చేస్తూవస్తున్నారు. అందరూ సంఘటితంగా, సమైక్యంగా ఉద్యమించాల్సింది పోయి, విడిపోవడం వల్ల బలహీనపడ్డాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అరెస్సెస్ శక్తులకు అధికారం అప్పగించడమంటే – మిగితావన్నీ బలహీన పడ్డాయనే కదా అర్థం? ఇది తాత్కాలికం అనుకుని – సి.వి. సూచించిన మార్గంలో ఉద్యమించక తప్పదు! ఐక్యపోరాటానికి సంసిద్ధులు కాక తప్పదు-

Also read: ఇల్లు కూడా మనిషి లాంటిదే!

సమాజంలో విశృంఖలంగా స్వైరవిహారం చేస్తున్న మూఢనమ్మకాలు, దోపిడి దౌర్జన్యాలు, ఆకలి హాహాకారాలకు వ్యతిరేకంగా నిరంతరం రాయడమే పోరాటమని నమ్మినవారు సి.వి. రాయడమే కాదు, దాదాపు 30 పుస్తకాలు స్వంతఖర్చుతో ప్రచురించి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు  ఎదుర్కొన్నారు. ఇటు ప్రభుత్వం అటు బ్రాహ్మణ పెత్తందారీ వ్యవస్థ పెట్టే  ఇబ్బందులు పడలేక కొన్ని రచనలు గుప్తనామాలతో రాసేవారు. శృంగేరి పీఠాధిపతి విజయవాడ వచ్చినప్పుడు సి.వి. జందెం వేసుకుని, మారు వేషంలో అతని అనుచరులతో కలిసి అక్కడ జరిగే తంతు అంతా పరిశీలించారు. దాని ఫలితంగానే ‘ఊళ్ళోకి స్వాములోరొచ్చారు’’ అనే రచన చేయగలిగారు. తరిమెల నాగిరెడ్డి చేపట్టిన ఆందోళనోద్యమాన్ని నేపథ్యంగా తీసుకొని, ఒక వాస్తవ సంఘటనని కవితగా మలిచారు. అదే ‘మంచినీళ్ళడిగితే మూత్రం పోశారు’ శీర్షికతో జనశక్తి పత్రికలో అచ్చయింది. సి.వి. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో అక్కడ సింహళ జాతీయుడైన ప్రొఫెసర్ చంద్రన్ దేవనేశన్ ప్రభావంలో పడిపోయారు. మార్క్సిజంలోని శాస్త్రీయతను, విశిష్టతను ఆయన నుండి పుణికి పుచ్చుకున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ విడిపోయినప్పుడు కొడవటిగంటి, శ్రీశ్రీ లాంటి వారు స్పష్టమైన వైఖరి తీసుకోవడానికి తటపటాయిస్తున్నప్పుడు సి.వి. జనశక్తి పక్షాన నిలిచారు.  1963 మధ్యలో విశాలాంధ్ర నుండి విడిపోయి జనశక్తి (సి.పి.ఐ.యంఎల్) పత్రికగా ప్రారంభమైనప్పుడు సి.వి. సైద్ధాంతిక ఊగిసలాటలు లేకుండా విశాలాంధ్ర పత్రికను విడిచి, ‘జనశక్తి’ పత్రికవైపు నిలిచారు.  తన గుండెల్లోఅరుణ పతాక రెపరెపల్ని చివరి శ్వాస వరకు నిలుపుకున్నారు. ‘‘ నాయావద్రచనా  వ్యాసంగానికి / ప్రేరణగా వెలుగొందిన జననీ / నా ఆశలకాశయాలకు ఊపిరిపోసిన తల్లీ / ప్రియబాంధవీ! అరుణా! అరుణా! అరుణ పతాకమా!!’’- అంటూ ఆయన హృదయంలో ఎర్రజెండా స్ఫూర్తిని నిలుపుకున్నారు. అందుకే విప్లవ కమ్యూనిస్ట్ ల పక్షపత్రిక జనశక్తి 2017 డిసెంబర్ 20న కామ్రెడ్ సి.వి. అశ్రునివాళి  సమర్పించింది. ‘‘మూఢవిశ్వాసాలపై 45 ఏళ్ళపాటు తన మేధస్సుతో, సాహిత్య రూపాలతో, భావ విప్లవరంగంలో సాంస్కృతిక పోరాటం సాగించిన విప్లవ కలం యోధుడు కామ్రెడ్ సి.వి.కి నివాళులు’’- అని ప్రకటించింది.

Also read: నాస్తికత్వం ఒక విచారధార – జీవన విధానం

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles