- ఏటా ఒక అవధానికి పద్మపురస్కారం అందజేయాలి
- తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలి
తెలుగువారి సంతకంగా భావించే ఉత్కృష్ణ సాహిత్య ప్రక్రియ ‘అవధానం’. తెలుగువారి ఆస్తిగా పేరుతెచ్చుకున్న పద్యం మూలంగా, సర్వంగా సాగే ఈ సారస్వత క్రతువు సర్వ సౌందర్య శోభితం. వందల ఏళ్ళ ఘన చరిత కలిగిన ఈ ప్రక్రియకు సాహిత్య సమాజంలో గొప్ప గౌరవం ఉన్నదన్నది వాస్తవం. కానీ, ప్రభుత్వాలలో విస్మరించబడిన కళాప్రక్రియగానే భావించాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇద్దరు అవధానకవులకు పద్మశ్రీ పురస్కారం సమర్పించి గౌరవించింది. అది తెలుగువారికి ఆనందాన్ని ఇచ్చే అంశమే. అయితే ఆ పురస్కారం పొందిన ఆశావాది ప్రకాశరావు, గరికిపాటి నరసింహారావు అందుకున్నది కేవలం అవధాన ప్రక్రియకు చేసిన సేవ, చూపిన ప్రతిభకు కాదు. సాహిత్య సేవా విభాగంలో మాత్రమే వారికి ఆ గుర్తింపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరాదివారికి తెలుగువారి అవధాన విద్యా విశిష్టత గురించి పెద్దగా తెలిసిఉండదు. అది నిజం కూడా. ప్రధానమంత్రిగా పనిచేసిన మన పీవీ నరసింహారావును వారిలో మినహాయించి చూడాలి. వారి పాలనా కాలంలోనైనా అవధానానికి కేంద్ర ప్రభుత్వంలో గుర్తింపు రాలేదా అంటే అప్పుడున్న దేశ పరిస్థితులు వేరు. మాడుగుల నాగఫణిశర్మ హైదరాబాద్ లో చేసిన అవధాన ప్రదర్శనకు ప్రధానమంత్రి హోదాలో ముఖ్య అతిధిగా వచ్చి తన భాషాభిమానాన్ని, పద్యానురక్తిని, అవధాన ప్రక్రియ పట్ల తన అభినివేశాన్ని, అభివ్యక్తిని పీవీ నరసింహారావు హృదయపూర్వకంగా చాటుకున్నారు. ఇన్నేళ్ల పాలనా వ్యవస్థల్లో, ఏ పార్టీ, ఏ నాయకుడు అధికారంలో ఉన్నాఅవధానానికి పద్మపురస్కారం ప్రకటించిన సందర్భం ఇంతవరకూ లేదు.
Also read: గుండెను పిండే విషాదం
ప్రభుత్వాలు పట్టించుకోవాలి
కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా అవధానానికి ప్రత్యేక పురస్కారం స్థాపించి ఉండాల్సింది. అదీ జరుగలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అవధాన విద్యా వికాసం కోసం మాడుగుల నాగఫణిశర్మకు హైదరాబాద్ లో పెద్ద స్థలాన్ని కేటాయించింది. అది మంచి విషయమే. అంతకు మించి అవధాన విద్యా వికాసం దిశగా ప్రభుత్వాల నుంచి అడుగులు పడిన దాఖలాలు లేవు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా జీ ఎస్ ఎన్ రాజు ఉన్న సమయంలో అవధాన విద్య కోసం ఆ విశ్వవిద్యాలయంలో ప్రత్యేకమైన విభాగాన్ని ప్రారంభించారు. అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. వారి పదవీ కాలం ముగిశాక ఆ విభాగం అటకెక్కింది. తర్వాత వచ్చిన వైస్ ఛాన్సలర్స్ ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు. బహుశా వారికి ఎవరైనా గుర్తు చేశారో లేదో కూడా తెలియదు. అలా అవధాన ప్రాశస్త్యానికి ప్రభుత్వాలలో గుర్తింపు కనుమరుగైంది. తాజాగా మంచి పరిణామం జరిగింది. శ్రీకాకుళంలో లలితాదిత్య అవధాన సభకు ముఖ్య అతిధిగా మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. తన ప్రసంగంలో భాగంగా గొప్ప ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రతి ఫిబ్రవరి 22 వ తేదీని ‘ప్రపంచ అవధాన దినోత్సవం’ గా చూస్తాం అన్నారు. వేదికపై వున్న కవిపండితుల ప్రతిపాదనకు ప్రతిస్పందనగా మంత్రి ధర్మాన ఈ ప్రకటన చేశారు. వారు కేబినెట్ మంత్రి కాబట్టి అది ప్రభుత్వ ప్రకటనగానే చూడాలి. నిజానికి వారి మంత్రిత్వ శాఖ అది కాకపోయినా, అవధానంపై ఉండే అభిమానంతో ఈ ప్రకటన చేసినందుకు ధర్మాన ప్రసాదరావును అభినందించి తీరాలి.
Also read: భారాస భవిష్యత్తు ఏమిటి?
మాడభూషి వేంకటాచార్యుల తొలి అవధానం
భాషా సాంస్కృతిక శాఖకు ఆర్ కె రోజా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అంశాన్ని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వం దృష్టికి, సంబంధిత మంత్రి రోజా దృష్టికి తప్పకుండా తీసుకెళ్తారని భావిద్దాం. ఆ దిశగా ప్రభుత్వం జీవోను తీసుకువచ్చి మంత్రిగారు చేసిన ప్రకటనకు సత్వరమే ఆమోద ముద్ర లభిస్తుందని ఆకాంక్క్షిద్దాం, విశ్వసిద్దాం. ‘అవధాన దినోత్సవం’గా ఫిబ్రవరి 22 ను ఎంచుకోడానికి ఒక చారిత్రక కారణం ఉంది. 22 ఫిబ్రవరి 1872న కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో శ్రీమాన్ మాడభూషి వేంకటాచార్యులవారు తొలి అవధానం చేసినరోజు. అందుకని ఈరోజును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చాలా మంచి వార్త, చాలా మంచి ఆలోచన. నిజానికి తెలుగునాట అవధాన విద్య ప్రారంభమై వందల ఏళ్ళు అయ్యింది. చరిగొండ ధర్మన, కోలాచాల మల్లినాథసూరి, రామరాజభూషణుడు మొదలైనవారి కాలంలోనే అవధాన కళ అద్భుతంగా వికసించింది. ఆధునిక కాలంలో కచ్చితంగా 150 ఏళ్ళ క్రితం గుంటూరుకు చెందిన మాడభూషి వెంకటాచార్యులు అవధాన విద్యకు కొత్త సిలబస్ ను తయారుచేసి, వారే ప్రదర్శించి సాహిత్యలోకానికి అందించారు. దాన్ని అందిపుచ్చుకొని తిరుపతి వెంకటకవులు, కొప్పరపు కవులు అవధాన సాహిత్య సామ్రాజ్యంలో విజృంభించారు. ఈ రెండు జంటలకు తోడు మరికొందరు కవులు కలిసి అవధాన విద్యకు సుస్థిరమైన పునాదులు వేశారు.
Also read: సువర్ణాక్షరాలతో లేపాక్షి
తెలుగు రాష్ట్రాలు విశేషంగా సత్కరించాలి
ఈ ప్రక్రియకు బంగారుబాటలు వేసి, పద్యరత్నాలు పండించిన వారిలో తిరుపతి వెంకటకవులు, కొప్పరపు కవుల స్థానం అమేయం, అపూర్వం. ఇంతటి అవధానకళను రేపటి తరాలకు అద్భుతంగా అందించడం జాతి కర్తవ్యం. ఇప్పటికీ మాడుగుల నాగఫణిశర్మ, మేడసాని మోహన్, గరికిపాటి నరసింహారావు, వద్దిపర్తి పద్మాకర్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వంటివారు అద్భుత రీతిన అవధాన ప్రక్రియకు విశేష ఖ్యాతిని కలిగిస్తున్నారు. బులుసు అపర్ణ, లలితాదిత్య వంటి యువతరం అవధాన యాత్ర చేస్తున్నారు. అది సరిపోదు. అవధాన విద్యకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక విభాగాలను స్థాపించాలి. నెల్లూరులోని తెలుగు ప్రాచీన హోదా కేంద్రంలోనూ ప్రత్యేక శాఖను ఏర్పాటుచేయాలి. దూళిపాళ మహాదేవమణి, కడిమళ్ళ వరప్రసాద్ వంటివారు వ్యక్తిగత స్థాయిలో అవధానులను తయారు చేస్తున్నారు. నేటి ప్రసిద్ధ, ప్రతిభావంతులైన అవధానులందరినీ అవధాన విద్యా వికాసం కోసం కొత్త తరాలకు తర్ఫీదు ఇచ్చేలా సద్వినియోగం చేసుకోవాలి. అవధానకళకు ప్రతి ఏటా ఒక పద్మపురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ దిశగా మన తెలుగు నాయకులు, ప్రభుత్వాలు కృషి చేయాలి. రెండు తెలుగు ప్రభుత్వాలు అవధాన విద్యకు ప్రతి సంవత్సరం ప్రత్యేక పురస్కారం అందించాలి. అంతటి అవధానానికి వెలుగులు ప్రసరించిన తిరుపతి వెంకటకవులు, కొప్పరపు కవుల వంటి మహనీయుల జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. అవధాన మహాకవుల విశేషాలు, అవధాన విద్యా విశిష్టతను పాఠాల్లో పెట్టాలి. ఇలాంటివి ఎన్నో చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, నడిపే పాలకులది. గుర్తు చేయాల్సిన కర్తవ్యం అందరిదీ. మన అవధాన విద్యకు ఒక రోజు రాబోతోంది. జయోస్తు! జయ జయ తెలుగు పద్యం! జయ జయ అవధాన సారస్వతం!
Also read: సరిహద్దుల్లో మళ్ళీ ఘర్షణ