రామాయణమ్ – 119
ప్రాయోపవేశము చేయదలుచుకొన్న అంగదుని చుట్టూ వానరులంతా చేరి తాముకూడా చనిపోవుటకు నిశ్చయించుకొని రామ కధ చెప్పుకొనుచూ, సీతాపహరణ వృత్తాంతము ముచ్చటించుకుంటూ మాటల మధ్యలో జటాయువు ప్రస్తావన తీసుకువచ్చారు.
ఎప్పుడైతే జటాయువు అని మాట్లాడారో ఆ మాట ఆ పర్వత శిఖరము మీద నివసించే ఒక వృద్ధ గృధ్ర రాజుకు వినబడింది. ఆయన నెమ్మదిగా శిఖరముపైకి వచ్చి ముచ్చటించుకొంటున్న వానరులను చూశాడు. ఆహా ఎన్నాళ్ళకు మంచి ఆహారము దొరికినది అని సంబరపడిఫోయినాడు. గొప్ప శరీరము కల ఆ పక్షిని చూసి వానరులు ఇలా తమ చావు ఆ పక్షి నోట రాసి పెట్టి ఉన్నదేమో అని భయపడిపోయినారు.
Also read: అంగదుడికి హనుమ మందలింపు
అంత ఆ పక్షి రాజు, ‘‘ఎవరురా నా తమ్ముడి గురించి మాట్లాడినది? వాడు చనిపోయినాడని చెప్పిన వారు ఎవ్వరు?’’ అని వారిని అడిగాడు.
అప్పుడు అంగదుడు సీతాపహరణము, జటాయువు పోరాటము, రావణుని చేతిలో ఆయన మరణము మొదలుగాగల వివరాలన్నీ ఆయనకు పూసగుచ్చినట్లు వివరించాడు.
ఆ గృధ్రరాజు పేరు సంపాతి. జటాయువుకు అన్న.
Also read: స్వయంప్రభ సందర్శనము
తమ్ముడి మరణానికి చలించిపోయిన మనస్సు కలవాడై దుఃఖించి జటాయువుకు తర్పణములు విడుచుటకొరకై సముద్రపు ఒడ్డుకు చేర్చమని వారిని కోరినాడు. అంగదుడు మొదలుగాగలవారు ఆ పక్షిరాజును సముద్రపు ఒడ్డుకు చేర్చినారు.
తమ్ముడికి తర్పణములు విడిచి మెల్లగా వణుకుతున్న స్వరముతో, ‘‘నాయనలారా, రావణుడు ఒక స్త్రీని ఎత్తుకొని పోవటము నేను నా కన్నులారా చూశాను. ఆవిడ సీతాదేవి అని నాకుతెలియదు. వాడు ఆవిడను ఎత్తుకొని తీసుకొని పోతున్నప్పుడు ‘‘హా రామా, హా లక్ష్మణా, అని దీనముగా అరవటము కూడా నేను విన్నాను. నేను గరుత్మంతుడి వంశానికి చెందినవాడను కావున ఇక్కడికి నూరు యోజనముల దూరములోనున్న లంక నాకు స్పష్టముగా కనపడుచున్నది. అక్కడ రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న సీతాదేవి నాకు కనపడుచున్నది. అంతేకాదు, రావణుడు కూడా కనపడుతున్నాడు’’ అని చెప్పగా వానరులలో అంతకు ముందు ఆత్మహత్య చేసుకోవాలి అని ఉన్న ఆలోచన స్థానములో కొత్త ఆశలు చిగురించాయి.
Also read: హనుమపైనే అన్ని ఆశలు
వానరులందరూ సంపాతి చుట్టూ చేరినారు. వారిలో పెద్దవాడైన జాంబవంతుడు లేచి సంపాతితో ఇలా అన్నాడు, ” సీతాదేవి ఎక్కడ ఉన్నది? ఆమెను ఎవరు చూసినారు? ఆమెను హరించిన వాడెవడు? నీవు దీనినంతను చెప్పి మాకు సహాయము చేయుము” అని ప్రార్ధించాడు.
ఉత్కంఠతతో తనను అడుగుతున్న వానరులను చూసి వారిని ఓదార్చి, సంపాతి ఇలా అన్నాడు:
‘‘నా తమ్ముడు జటాయువు, నేను పోటీ పెట్టుకొని సూర్యమండలము వరకు ఎగురుచుండగా సూర్య కిరణముల వేడికి వాడు సోలిపోయి నీరసపడిపోయినప్పుడు వానిని సూర్యకిరణముల బారినునుండి నా రెక్కలు అడ్డుపెట్టి కాపాడితిని. కానీ అందువలన నా రెక్కలు కాలిపోయి నేను ఈ శిఖరముపై పడిపోయితిని. ఇది జరిగి చాలా వేలసంవత్సరముల గడిచిపోయినవి. ఇప్పుడు నేను వృద్దుడనై పోయితిని. నా బలపరాక్రమములు క్షీణించి పోయినవి. ఇప్పుడు నాకు నా కుమారుడు ఆహారము తెచ్చి ఇచ్చి నన్ను పోషించుచున్నాడు. వాడి పేరు సుపార్శ్వుడు.
Also read: వానర వీరులకు దిశానిర్దేశం చేసిన సుగ్రీవుడు, హనుమకు తన గుర్తుగా ఉంగరం ఇచ్చిన రాముడు
‘‘గంధర్వులకు కామము అధికము. సర్పములకు కోపము అధికము. లేళ్ళకు భయము అధికము. మా పక్షి జాతికి ఆకలి అధికము. ఒకరోజు నాకు విపరీతమైన ఆకలి వేస్తున్నది. నా కుమారుడు ఎంతకూరాలేదు. వాడు సాయం సమయానికి ఉత్తచేతులతో తిరిగి వచ్చినాడు. వాడిని నేను తీవ్రముగా నిందించితిని. వాడు నన్ను బ్రతిమిలాడుకొని జరిగిన విషయము చెప్పినాడు.
‘‘వాడు మహేంద్ర పర్వతము వద్ద నిలుచుని యుండగా నల్లటి కాటుక రాశి వంటి దేహము కలిగిన వాడొకడు ఒక స్త్రీని బలవంతముగా తీసుకోనిపోతూ కనబడ్డాడట. అతడిని చూసి వారిరువురినీ ఆహారముగా గ్రహించవలెనని అడ్డుకొనగా ఆ పురుషుడు నా కుమారుని దారి ఇమ్మని బ్రతిమిలాడుకొన్నాడట. వాని బ్రతిమిలాటకు కరిగిపోయి దారి ఇచ్చి వేసి ఉండిపోయిన నా కుమారుని వద్దకు మునులు వచ్చి వాడు రావణుడని, ఆ స్త్రీ సీతాదేవి అని ఎరిగించినారట. అందువలన సమయము గడచిపోయినదని చెప్పి నన్ను సమాధాన పరచినాడు నా పుత్రుడు సుపార్శ్వుడు.
‘‘మీ అందరికి ఒక విషయము తెలిపెదను, రామకార్యము నా కార్యమే. మీకు మాట చేతను, బుద్దిచేతను ప్రియము చేసెదను. నా వృత్తాంతము సమగ్రముగా చెప్పెదను వినుడు.
Also read: ఆకాశం నుంచి రాముడి ఎదుట దిగిన వానర సైన్యం
వూటుకూరు జానకిరామారావు