Sunday, December 22, 2024

వానర వీరులకు దిశానిర్దేశం చేసిన సుగ్రీవుడు, హనుమకు తన గుర్తుగా ఉంగరం ఇచ్చిన రాముడు

రామాయణం115

అంత సుగ్రీవుడు గజ, గవాక్ష, నీల, జాంబవంత, ఆంజనేయ అంగదాదులను రావించి వారికి అంగదుని నాయకునిగా చేసి వారిని దక్షిణ దిక్కుకు పయనమై పొమ్మనెను.

ఆ దిక్కున ఎటువైపు వెళ్ళాలో వారికి సమగ్రముగా వివరిస్తున్నాడు సుగ్రీవుడు.

‘‘వేయి శిఖరములు కలది వింధ్య పర్వతము.  అది దాటిన పిదప నర్మదా, గోదావరి, కృష్ణవేణి నదులు కలవు. అశ్వవంతి,అవంతి, విదర్భ, ఋషీకము, మాహిషకము, మత్స్య, కళింగ దేశములు, దండకారణ్యము, ఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళములు కలవు. కావేరి నదికూడాకనపడుతుంది. అచట మలయమున నున్న అగస్త్యమహర్షికి నమస్కరించి పాండ్యరాజ్య సరిహద్దున ఉన్న మహేంద్ర పర్వతమును చూడుడు. అచటనుండి శత యోజన విస్తీర్ణ మున్న ద్వీపమొకటి కలదు. అచటికి చేర వలెనన్న సముద్రము దాటవలెను. అది దురాత్ముడైన రావణుని దేశము. అచట మీరు జాగరూకతతో సీతాదేవి ని వెదుకవలెను’’ అని చెప్పుచూ చిట్టచివ్వరి యముని రాజధాని వరకూ గల ప్రాంతములు చెప్పి ‘‘మీలో ఎవ్వరు నాకు సీతాదేవి కనుపించినది అని చెప్పుదురో వారికి జీవితాంతము నాతొ సమాన వైభవ ప్రాప్తి కలుగును’’ అని పలికినాడు సుగ్రీవుడు.

Also read: ఆకాశం నుంచి రాముడి ఎదుట దిగిన వానర సైన్యం

అటుపిమ్మట తార తండ్రి అయిన సుషేణుని వద్దకు తానే వెళ్ళి అంజలి ఘటించి  ఆయనకు నమస్కరించి, రెండు లక్షల వానర బలములతో పశ్చిమదిక్కుకు ఏగుమని  చెప్పి ఆ దిక్కున గల విశేషాలు చెప్పినాడు సుగ్రీవుడు.

ఉత్తర దిక్కు వంతు శతబలిది. వారికి ఆ వైపున గల విశేషములు చెప్పి లక్ష మందితో పయనమై వెళ్ళమన్నాడు వానరరాజు.

నలుగురు నాయకులూ తమతమ అనుచరులతో కూడి సిద్ధమైనారు. మరొక్కమారు సుగ్రీవుడు ఏమిచేప్పునో అని ఆయనవద్ద శ్రద్ధాళులై వినమ్రముగా నిలుచున్నారు.

Also read: రామునికి సుగ్రీవుని పాదాభివందనం

అప్పుడు సుగ్రీవుడు ఆంజనేయుని చూసి,

 మహావీరా! నీకు  అగమ్యమైనది లేదు. తెలియని ప్రదేశము లేదు. నీ గమనమునకు అడ్డులేదు. తెలియని లోకము లేదు

….

గమనములోను

వేగములోను

తేజస్సులోను

శీఘ్రత్వములోను

నీ తండ్రి వాయువే నీకు సాటి రాగలడు!

ఓ నీతికోవిదుడా!

బలము

బుద్ది

పరాక్రమము

దేశకాల అనుగుణముగా ప్రవర్తించుట అన్నియూ నీవద్దనే ఉన్నవి …అని పలికినాడు.

Also read: లక్ష్మణుడిని శాంతబరచిన తార

 సుగ్రీవుడు హనుమను చూసి అంటున్నప్పుడు రామచంద్రమూర్తికి పూర్తిగా అర్ధమయ్యింది.

తన కార్యము సాధించుకు రాగల  ధీరుడెవ్వడో,

వీరుడెవ్వడో!!

సుగ్రీవుడు ఇంత నిశ్చయముగా చెప్పుచున్నాడు. యీతడు ఇంతగా ప్రభువు విశ్వాసాన్ని చూరగొన్నవాడు. కావున ఈతడు తప్పక కార్యమును సాధించుకు రాగలడు.

అటువంటి హనుమంతుని చూడగానే రాముని మనస్సు ఆనందముతో నిండిపోయింది. ఈతడు తప్పక సీతను దర్శించగలడు అని నమ్మకము ఏర్పడ్డది ఆయనకు.

 కాస్త ఆలోచించి సీతాదేవి ఆనవాలు కొరకై తన పేరును చెక్కిన ఉంగరమును హనుమంతునికి ఇచ్చాడు రాముడు.

అది ఇచ్చి ఈవిధముగా చెప్పాడు:

 “హనుమంతుడా, ఈ చిహ్నమును చూసిన వెంటనే సీత నిన్ను చూసి భయపడకుండా నీవు నాదగ్గరినుండే వచ్చినావని తెలుసుకోనగలదు.( ఆవిడ మనస్సు ఎంతగా రాముడు చదివాడో చూడండి).’’

Also read: సుగ్రీవుడిని హడలెత్తించిన లక్ష్మణ ధనుష్టంకారం

అంత హనుమంతుడు ఆ ఉంగరమును తన శిరస్సుపైనిడుకొని చేతులు జోడించి నమస్కరించి పాదాభివందనము చేసి ప్రయాణమయ్యెను.

విశాలమైన వానర సైన్యము తీసుకొని పయనమయిన హనుమంతుడు ఆకసమునందు చుక్కల్లో చంద్రుడు వలె వెలిగిపోయాడు.

ఆ వాయుకుమారుని చూసి శ్రీరాముడు మరొక్కమారు గట్టిగా, ‘‘ఓ హనుమా, నీమీదే నమ్మకము పెట్టుకొని ఉన్నాను. సీత లభించునట్లు ప్రయత్నము చేయుము” అని పలికాడు.

శతబలి ఉత్తరదిక్కునకు, వినతుడు తూరుపు దిక్కునకు, సుషేణుడు వరుణపాలిత పశ్చిమ దిక్కునకు తమతమ అనుచరులతో కలసి పయనమయ్యారు.

అందరిదీ ఒకటే లక్ష్యం!

సీతాదేవి జాడ కనుగొనటం!

ఆ ప్రాంతమంతా యుద్ద ఉత్సాహము, ఉన్మాదముతో కూడిన  రణన్నినాదములతో  నిండి పోయింది .

అందరూ వెళ్ళిపోయారు!

ప్రస్రవణ పర్వతము మీద రామ,లక్ష్మణ,సుగ్రీవులు మువ్వురూ మిగిలారు . అప్పుడు రాముడు, ‘‘సుగ్రీవా, నీకు ఈ భూ మండలమంతా ఎలా తెలియునయ్యా?’’ అని అడిగాడు.

అందుకు సుగ్రీవుడు….

NB

ఆయన నవ వ్యాకరణ వేత్త మహాబలవంతుడు ఉదయాద్రిమీద ఒక కాలు అస్తాద్రి మీద ఒక కాలు ఉంచి ఆదిత్యుడి వద్ద విద్యను అభ్యసించినవాడు! మహాబలశాలి. ఏ అస్త్రమూ ఆయనను ఏమీ చేయలేదు. చివరకు బ్రహ్మాస్త్రము కూడా!

కించిత్తు గర్వము, అహంకారము లేదు! సేవక వృత్తిలో ఎంత ఒదిగిపోయాడో!

ఆయన నుంచి మనము నేర్చుకొనవలసిన వాటిలో ఇది ఒకటి !

ఆయన హనుమంతుడు!

ఈ రోజుల్లో  కొంచెము తెలిసినవాడు కూడా expert పేరిట చెలామణి అయ్యి తమ అహంకార ప్రదర్శన చేయటము మనము చూస్తూనే ఉన్నాం కదా!

Also read: రామసందేశంతో సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరిన రామానుజుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles