Sunday, November 24, 2024

లక్ష్మణుడిని శాంతబరచిన తార

రామాయణమ్ 112

‘‘తారా  నీవు భర్త హితము కోరుదానవు కదా, ఆతని దోషములేల గమనింపవు?

కామవృత్తుడై, పానమత్తుడై, మదొన్మత్తుడై  మా సంగతినే విస్మరించినాడు నీ . మిత్రుని విడిచి, ధర్మమూ మరచి, భోగలాలసుడైన సుగ్రీవుని విషయములో మేము ఏమి చేయవలెనో నీవే ఎరిగింపుము.

లక్ష్మణుని మాటలు విని తార

‘‘ఓ రాజకుమారా, ఇది కోపము వహించు కాలము కాదు. స్వజనము విషయములో నీవంటి విజ్ఞుడు కోపించునా? సుగ్రీవుడు నీ స్వంత మనిషి! ఆతని పొరపాటును నీవు సహింపవలెను. గుణవంతుడైన నీ వంటి వాడు అల్ప బుద్ది యైన వాడిపై కోపించ తగునా?

Also read: సుగ్రీవుడిని హడలెత్తించిన లక్ష్మణ ధనుష్టంకారం

‘‘ఉద్యమశీలుడు,మహా తపః సంపన్నుడు అయిన నీవంటి వాడు కోపమునకు వశుడగునా? రాముని కోపము ఎంత అమోఘమైనదో నాకు తెలియును. రాముని బాణము ఎంత వాడిగలదో నాకు అనుభవపూర్వకముగా తెలియును. రామకార్యము ఆలస్యమైనదనియూ తెలియును. రాముని విషయమున మేమొనరించిన అపచారమూ తెలియును. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యమేమో తెలియును.

‘‘ఓ లక్ష్మణా, మన్మధుని బలము ఎంత సహింప శక్యము కానిదో నాకు తెలియును. చాలాకాలమునకు నాతో, రుమతో ఆనందించుటచే సుగ్రీవునకు కాలము తెలియలేదు. నీకు ఇంత కోపము కలుగుటవలన నాకు ఒక విషయము తెలియుచున్నది. నీకు కామ తంత్రము మీద ఆసక్తి లేదని. అరివీర భయంకరుడవైన ఓ లక్ష్మణా, కామప్రవృత్తి కలవాడై కామావేశము చేత నా వద్దనే యున్న నీ సోదరుని వంటి వాడైన సుగ్రీవుని నీవు క్షమింపుము. ఆతడు వానరుడు. చపల స్వభావుడు.  పైగా చాలాకాలము స్త్రీ స్పర్శకు దూరము అయిన వాడు. కనుక సుగ్రీవుని నీవు క్షమింపుము!

Also read: రామసందేశంతో సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరిన రామానుజుడు

‘‘ఇంత కామ వశుడై యుండి కూడా మీ కార్యము గురించి ఆలోచన చేయుచునే యున్నాడు. ఇప్పటికే కోట్లకొలది వానరులు కిష్కింధకు చేరుకున్నారు. కోపము వీడి అంతః పురములోనికి రమ్ము. మిత్రభావమున పరదారా అవలోకనము పాపము కాదులే.’’

అని పలికిన తార పలుకులకు సంతసించి లోనికి అడుగిడినాడు లక్ష్మణుడు.

కానీ అక్కడి దృశ్యము చూసి మరల క్రోధోద్దీపితుడైనాడు.

మరల తార  లక్ష్మణుని తో, రాజకుమారా, రావణుడు సామాన్యుడుకాడు. ఆతని లంక శత్రు దుర్భేద్యము అయినటువంటిది. అనేక వేల కోట్ల మంది మహా బలవంతులైన రాక్షసులు నిత్యమూ సంరక్షిస్తూ ఉంటారు. వారు ఇచ్ఛారూపధారులు, క్రూరులు, మహా శూరులు.

Also read: సుగ్రీవునికి హనుమ మేల్కొలుపు

 వారిని మట్టుపెట్టకుండా సీతాదేవిని విడిపించి తీసుకు రావడము అసాధ్యము. అంతెందుకు, అసలు రావణుని సమీపమునకు కూడా మనము వెళ్ళలేము .

రావణుని బలము నాకెట్లు తెలియును అని సందేహింపకుము. వాలినుండి నేను తెలుసుకున్న సమాచారమిది.

అన్ని కోట్లమంది రాక్షసులను సంహరింపవలెనన్న మనకు కూడా అంతే సంఖ్యలో అటువంటి వీరులే కావలెను. అటువంటి వీరులు వానరులలో కోకొల్లలు. అయితే వారందరూ భూమిమీద వివిధ ప్రదేశములలో నివసించుచున్నారు. వారినందరినీ సమీకరించుట అత్యంతావశ్యకము. ప్రస్తుతము ఆ పనిలోనే సుగ్రీవుడు నిమగ్నుడై వున్నాడు.

భూమండలము మీద నివసించు వానరులందరికీ ఎప్పుడో కబురు పెట్టడ మైనది.

Also read: వాలి దహన సంస్కారం

 నేడో రేపో వారందరూ ఇచ్చటికి చేరగలరు. కావున కోపమును విడువుము. రామ కార్యము ఎప్పుడో ఆరంభమైనది.

చక్కగా యుక్తముగా పలికిన తార పలుకులు లక్ష్మణుని కోపమును తగ్గించినవి.

అది చూసిన వెంటనే సుగ్రీవునకు భయము తగ్గి వెంటనే తన శృంగారపురుష వేషమును త్యజించివేసెను.

అంత సుగ్రీవుడు వినయముగా లక్ష్మణునితో, సౌమిత్రీ, నేను అనుభవించు ఈ సుఖములన్నియూ రాముని భిక్ష. ఆయన కృపా కటాక్ష వీక్షణములే నాకు చాలును.

ఆయనకు తిరిగి ఉపకారము చేయగలంత పెద్దవాడను కాను. ఆయనకు నేను కేవలము సహాయకుడను మాత్రమే.

తన పరాక్రమముచే రాముడే మరల సీతను పొందగలడు.

ఒక్క బాణము చేత ఏడు సాల వృక్షములను పడగొట్టి భూమిని, పర్వతమును  చీల్చిన  రామచంద్రునకు వేరొకరి సహాయము అవసరమా? 

ఏ రాముని ధనుస్సు చేయు శబ్దమునకు సకల భువనములు కంపించునో అట్టి రామునకు ఇతరుల సహాయము అవసరమా?

లక్ష్మణా నేను కేవలము రాముని వెనుక నడచు బంటును మాత్రమే.

Also read: శోక వివశులైన తార, సుగ్రీవుడు

.

విశ్వాసము వలనగానీ  స్నేహముచేత గానీ  నా  వలన ఏదైనా అపరాధము జరిగినచో నన్ను మన్నింపుము. అపరాధము చేయని వాడు ఎవడూ ఉండడు కదా. 

సుగ్రీవుని వినయపూర్వక సంభాషణమునకు సంతసించిన లక్ష్మణుడు ఇలా అన్నాడు ….

NB

లక్ష్మణుని తార చల్లబరచిన విధానములో ఎంత లౌక్యమున్నదో గమనించండి !

సముద్రపు అల వంటిది లక్ష్మణుని కోపము దానికి ఎదురు పోయినామా, అంతే సంగతులు! తలవంచి నిలుచుంటే తనమీదే ఆడనిస్తుంది అల!

రొమ్ము విరిచి ఎదురు వెడితే అంతు చూస్తుంది!

Crisis Management! ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి!

కోపములో ఉన్న వ్యక్తిని ఎలా చల్లబరిచిందో కదా!

Also read: తార ఆక్రందన, సుగ్రీవునికి వాలి విజ్ఞాపన

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles