Sunday, November 24, 2024

ఎపికి జగన్ ద్రోహం చేస్తారా?! ఉండవల్లి సలహా పాటిస్తారా?

వోలేటి దివాకర్

  • సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 22న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తేటతెల్లం
  • అప్పుడు ఏపీ విభజనను వ్యతిరేకించిన జగన్ ఇప్పుడేమంటారు?

పార్లమెంటులో ఎపి విభజనను వ్యతిరేకించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఎపి తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది రాష్ట్ర విభజనను వ్యతిరేకించడం లేదనీ, ఈ అంశాన్ని మళ్లీ కెలికితే తేనెతుట్టెను కదిపినట్టవుతుందని వాదించడం పట్ల మాజీ ఎంపి, రాష్ట్ర విభజనపై అలుపెరగని న్యాయపోరాటం చేస్తున్న ఉండవల్లి అరుణకుమార్ తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది వాదన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు  తెలిసే జరిగితే రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్టేనని బుధవారం విలేఖర్ల  సమావేశంలో వ్యాఖ్యానించారు. ఏపీ పునర్విభజన పిటిషన్ పై మొత్తం 21 మంది పిటిషన్లు దాఖలు చేయగా, వారిలో ఒకరైన ఉండవల్లి సుప్రీంకోర్టులో ఇటీవల స్వయంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యాంగాన్నీ, పార్లమెంటు నిబంధనలనూ బ్రష్టుపట్టించారని ఉండవల్లి పునరుద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ఆమోదం లేకుండానే రాష్ట్రాన్ని విభజించారన్నారు.

Also read: శనివారం … పోలవరం!

ఈ విధానం జగన్ కే నష్టం

ఏపీ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించినపుడు వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకున్నారని, దీంతో ఏపీకి చెందిన ఎంపీలను పార్లమెంటు నుంచి బయటకు పంపేశారని, ఆ సమయంలో జగన్ తన పక్కనే ఉన్నారని గుర్తుచేశారు. అప్పుడు విభజనను వ్యతిరేకించిన జగన్ తన వైఖరిని మార్చుకున్నారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన తీవ్ర అన్యాయాన్ని దేశ ప్రజలకు తెలిసేలా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విభజన హామీలు, ఉమ్మడి ఆస్తుల పంపకం కోసం పట్టుపట్టాలని ఉండవల్లి సూచించారు. లేనిపక్షంలో జగన్ కు  రాజకీయ భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఇప్పటి వరకు తగిన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరంకు ఇకపై నిధులు ఇవ్వబోమని బిజెపి ప్రభుత్వం చేయడం దారుణమన్నారు.

Also read: పార్టీ ఒకటే కానీ … వారి పంథాలే వేరు! 

వాస్తవాలు సమాధి చేస్తారా ? …. తేలేది ఫిబ్రవరి 22

రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని భావించే సుప్రీంన్యాయమూర్తి ఈ కేసును సమాధి చేయాలా, కేసు కొట్టివేయాలా అన్నది ఫిబ్రవరి 22 న జరిగే విచారణలో తేలుస్తామని వ్యాఖ్యానించి ఉంటారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఈ కేసులో  కేంద్రం ఇప్పటి వరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదనీ, ఫిబ్రవరి 22 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలనీ కేంద్రాన్ని న్యాయమూర్తి ఆదేశించారని ఉండవల్లి వెల్లడించారు.

Also read: రామోజీరావుకు భారతరత్న అయినా ఇవ్వండి లేదా … మార్గదర్శిలో తేడాలు తేల్చండి!

బిజెపి లక్ష్యం 50 రాష్ట్రాలు

దేశంలోని రాష్ట్రాలను విభజించి, 50 చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని బీజీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఉండవల్లి అరుణకుమార్ చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై నోరువిప్పకపోతే ఇదే రీతిన బిజెపి రాష్ట్రాల విభజన చేపడుతుందని హెచ్చరించారు. తద్వారా ఆయా రాష్ట్రాలు ఏపీ తరహాలోనే అన్యాయానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి కేసు విషయంలో ఉండవల్లి అరుణకుమార్ సలహాలు పాటించనట్లు కనిపించిన జగన్ రాష్ట్ర విభజన కేసులో ఏవిధంగా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరం.

Also read: పాపం ఈసారి ఎవరి ‘కాపులు’?

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles