Sunday, November 24, 2024

దారితప్పిన దళితోద్యమం!?

భారతదేశ ప్రజాఉద్యమాల్లో మహారాష్ట్ర దళిత ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతవరకు డాక్టర్అంబేద్కర్ అవలంబించిన ఘర్షణరహిత వ్యూహాలకు భిన్నంగా షెడ్యూల్ కులాలలో వామపక్ష పోరాట పద్ధతులను ఈ ఉద్యమం తీసుకోచ్చింది. దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపటంలోనూ ముఖ్యంగా సాహిత్యరంగంపై విశేషమైన ప్రభావం నేటికీ కలిగి ఉంది.  1972లో ప్రారంభమైన ఈ ఉద్యమానికి 50 ఏళ్లు నిండాయి. ఈ స్వర్ణోత్సవ వేళ అంబేద్కర్ సిద్ధాంత వెలుగులో ఈ ఉద్యమంపై చర్చ జరగవలసిన అవసరం ఉంది.

దళిత్ పాంథర్స్ ఉద్యమ సిద్ధాంతములోనూ దాని పోరాట పద్ధతుల్లోనూ నక్సలైట్ భావజాలం స్పష్టంగా కనిపిస్తుంది. 1973లో ప్రకటించిన దళిత మానిఫెస్టోలో భూపంపిణీతో పాటు వర్ణ, కుల, వర్గ వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా ప్రకటించుకున్నది. అంతేకాక పార్లమెంటేరియన్ వామపక్షాల రాజకీయాలను, రిపబ్లిక్ అండ్పార్టీఆఫ్ఇండియా అవకాశవాద రాజకీయాలను ఆ కార్యక్రమం విమర్శించింది. అదే సమయంలో 1974లో సెంట్రల్ బాంబే నియోజకవర్గంనుండి లోక్ సభకు జరిగిన ఉపఎన్నికను కూడా బహిష్కరించారు. మొత్తంగా ఈ భావజాలం వెనకాల ఆ ఉద్యమనిర్మాతల్లో ఒకరైన నాందేవ్దసల్కు కమ్యూనిస్టు భావజాలం ఉండటమే. బుద్దిస్ట్ అంబేద్కరైటైన రాజ్ధాలేకు ఆ కార్యక్రమంతో విభేదం ఉన్నప్పటికీ మిలిటెన్సీ విషయములో విభేదం ఉన్నట్లు కనబడదు.

సహజంగానే అణచివేత, వివక్షులు, పేదరికంవల్ల దళితుల్లో మిలిటేన్సి పట్ల ఆరాధనాభావం ఉంటుంది. కానీ ఈ మిల్టెన్సీ పద్ధతి అంబేద్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకమైనది. ఆయన జీవితకాలంలో శాసనవ్యవస్థలను కేంద్రంగా చేసుకొని రాజకీయ పోరాటాలను నిర్మించాడు. మహద్ చెరువు పోరాటం గాని, నాసిక్ దేవాలయ ప్రవేశం లాంటివి రౌండ్టేబుల్ సమావేశాల్లో దళితులు హిందువులలో భాగంకాదని, ప్రత్యేక రాజకీయగ్రూపుగా నిలిపి హక్కులను డిమాండ్ చేయటంకోసమే ఆ పోరాటాలను చేపట్టాడు. కాబట్టి అణచివేతకు గురవుతున్నఏ సామాజికవర్గాల సమస్యల పరిష్కారం రాజకీయాలద్వారానే సాధ్యమవుతుంది. అందుకనుగుణంగానే బాంబే ప్రెసిడెన్సికి ఎన్నిక దగ్గరినుండి అటు తర్వాత రాజ్యాంగ నిర్మాణ సభ, పార్లమెంటును తన రాజకీయపోరాట కేంద్రాలుగా చేసుకున్నాడు.

ఇందుకోసమే ఇండిపెండెంట్లే బర్పార్టీ, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి రాజకీయపార్టీల ఏర్పాటు చేశాడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఆఖరిలో వచ్చింది. ఈ విధంగా ఆయన జీవితం అంతా రాజకీయపోరాటాలే కనిపిస్తాయి. కానీ ఆయన్ని మార్గదర్శిగా భావించే దళిత విద్యావంతులు ఆయన రాజకీయ పోరాట పంథాకు పూర్తిగా వ్యతిరేక రూపాలను తీసుకుంటున్నారు. మార్క్సిజం కూడా రాజకీయ పోరాటాలనే వర్గపోరాటాలుగా పరిగణిస్తుంది. అందుకుభిన్నంగా ఈ దళిత్ పాందర్స్ ఉద్యమం వామపక్ష ఆందోళన పద్ధతులను అనుసరించింది. కాబట్టే ఎలాంటి రాజకీయ ఫలితాలను సాధించకుండానే ఈ ఉద్యమం 1974 నాటికే చీలికకు గురై అ తరువాత స్తబ్దలోకి నెట్టబడింది.

పురుడు పోసుకున్న దళిత ఉద్యమం

ఇక మన దగ్గర చుండూరు, కారంచేడు ఘటనల నేపథ్యములో ఇక్కడ దళిత ఉద్యమం పురుడు పోసుకుంది. మొదట హేతువాద ఉద్యమంలో ఉన్న కత్తిపద్మారావు ,నక్సలైటు భావజాలం గల బొజ్జతారకం లాంటి వారు ఈ ఘటనల నేపథ్యంలో దళిత ఉద్యమాన్ని నిర్మించారు. కానీ దళిత మహాసభ ఉధృతి ఈ రెండు ఘటనలకే పరిమితమైంది. ఆ తరువాత అలాంటి ఘటనలు జరిగినప్పటికీ దళితమహాసభ గతంలోలాగా ఉద్యమించలేకపోయింది. దాని స్థానంలో వామపక్షపార్టీల అనుబంధ సంఘాలు ఆ ఘటనలపై స్పందిస్తున్నాయి. మరీ దళితులపై నిత్యం ఏదో మూల హత్యలు, దాడులు, వివక్షులు కొనసాగుతున్నప్పటికీ ఎందుకని దళిత ఉద్యమం కొనసాగలేకపోయింది?  ఈవిషయంపై ఇప్పటి వరకు కూడా ఆత్మపరిశీలన చేసుకున్నట్లు కనపడదు.

ఎంఆర్ పీఎస్ రాకతో మారిన క్రమం

చారిత్రకంగా పరిశీలిస్తే,   మన తెలుగురాష్ట్రాలలో షెడ్యూల్ కులాల విద్యావంతుల స్పృహ మొదట S.C చైతన్యంగా 1990 నాటికి కనబడుతుంది. ఆ తరువాత చుండూరు, కారంచేడు ఘటనలతో దళితచైతన్యంగా మారింది. ఇక కాన్సిరాం రాకతో బహుజన రాజకీయ చైతన్యంగా మారే క్రమంలో MRPS రావటంతో కులాల (ఏకులానికి ఆకులం విడిగా) ఉద్యమం ముందుకు వచ్చింది. అక్కడినుండే అంబేద్కర్ ఉద్యమరథం వెనక్కి తిప్పబడింది. అంటేదళితచైతన్యం కాస్త మాల, మాదిగ, ఉపకులాల చైతన్యానికి కుదించబడ్డది. ఒక మాటలో చెప్పాలంటే కులాల అస్తిత్వాన్ని ఘనీభవింపజేసింది. కవులు, మేధావులు మనువాద పద్ధతిలోనే కులాలవారి అస్తిత్వ సాహిత్యాన్ని అద్భుతంగా సృష్టించారు. బహుజన సాహిత్యం పేరాకూడా కులాల అస్తిత్వం గురించే రాస్తున్నప్పుడు దళితచైతన్యం, ఉద్యమం ఎలాబ్రతికిబట్టకట్టకలుగుతుంది?  వాస్తవానికి ‘దళిత ‘అనే పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. అటువంటప్పుడు మనువాద పద్ధతిలో కులాలవారీగా జరిగే ఉద్యమాలను దళిత ఉద్యమంగా ఎలా పరిగణిస్తారు?

Also read: కులాన్ని పట్టించుకోవటం అంటే ఏమిటి?

మహారాష్ట్ర అనుభవం

ఇక దళితచైతన్యం కూడా రాజకీయ నిర్మాణం జరగటానికి సరిపోదని మహారాష్ట్ర అనుభవం ఉన్నప్పటికీ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మిలిటెన్సీ ఉద్యమాన్ని మరాఠా దళిత ఉద్యమం అందించింది. మనువాద పద్ధతిలో కులాలవారీగా సంఘాలు పెట్టుకుని పోరాడే పద్ధతికంటే దళితఉద్యమం అభ్యుదయకరమైనది. వైపరీత్యం ఏమంటే,   మహారాష్ట్ర నక్సలైట్ ఉద్యమం షెడ్యూల్ కులాలను ఉమ్మడిగా, ఇంకా విస్తృత అర్థంతో అక్కడ వారిని కలిపి ఉద్యమాన్ని చేపడితే ఇక్కడి నక్సలైట్ ఉద్యమాల నుండి వచ్చిన కేజీసత్యమూర్తి, ఉ.సాంబశివరావు, మారోజువీరన్న, కంచెఐలయ్య, బిఎస్ రాములు లాంటి వారు ఇంతకు ముందు పేర్కొన్న మనువాద కులఉద్యమాలకు సిద్ధాంత భూమికులను రూపొందించారు. కుల ఉద్యమాలు వచ్చినప్పుడు దళిత ఉద్యమం అనేది సహజంగానే చచ్చిపోతుంది. ఈ కులాలవారీ ఉద్యమాలకు అన్ని నక్సలైట్ గ్రూపులు, వారి మేధావులు ఏదోమేరకు సమర్ధించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి తెలుగు నాట దళిత ఉద్యమం చాపచుట్టడానికి కులాలవారీ ఉద్యమాలే కారణం.

రాజకీయ పరిమితులు

మొత్తంగా అంబేద్కర్ సిద్ధాంత వెలుగులో చూసినట్లయితే దళిత ఉద్యమానికి రాజకీయంగా చాలా పరిమితులు ఉన్నట్లు అర్థమవుతుంది. అందుకనే కాన్సిరాం, “దళితింగ్ అంటే అడుక్కోవడంలో నాజూకైన రూపం” అని అంటాడు. ఇలా అడుక్కోవడానికి అలవాటుపడినవారికి రాజకీయ ఉద్యమ అవసరం అంతగా ఉండదు. మొత్తంగా  “చెంచాయుగం”ఇక్కడి ఉద్యమాలలోను, సాహిత్యంలోనూ రాజ్యమేలుతుంది. ఈ విధంగా దళిత విద్యావంతులు, మేధావులు ఇండియన్ వామపక్ష భావజాలానికి పరాయికరించబడ్డారు. మేధావులలో కూడా పెద్ద స్థాయిలో లంపేర్గం ఒకటి తయారైంది. వీరు పాలకవర్గాలతో చేరి అందుకు అనుగుణంగా సిద్ధాంత కీర్తనలు రాస్తున్నారు, పాడుతున్నారు, ఆడుతున్నారు. ఇంకా వెనక్కివెళ్లి కులాల వారి అస్తిత్వాన్ని గురించి శ్లాఘించి, కీర్తించే అద్భుత సాహిత్యం వర్ధిల్లుతున్నది. కాబట్టే బహుజన రాజకీయ ఉద్యమానికి సరైన పునాది ఇక్కడ పడలేదు. ఈ రకంగా అంబేద్కర్ అనుచరులు ఆయనను వదిలి జగజ్జీవన్ రామ్ మార్గాన్నిచేపట్టి దారితప్పారు.

Also read: బహుజన రాజ్యాధికారంతో ఎస్సీలకేంపని?

డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు

9959649097

(డిసెంబర్ 6, అంబేడ్కర్ వర్థంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles