రామాయణమ్ – 98
‘‘రామా, సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము’’ అని హనుమంతుడు పలుకగా, లక్ష్మణుడాయనను గౌరవించి, రామునితో ఇలా అన్నాడు:
‘‘అన్నా, ఈయన మాటలాడిన తీరు చూసినట్లయిన వీరికి కూడా మనవలన ఏదో ఒక పని జరుగవలసి యున్నట్లుగా తోచుచున్నది. ఇక మన కార్యము సిద్ధించినట్లే.ఈయన పలుకులలో విశ్వసనీయత కనపడుచున్నది.
లక్ష్మణుడు అన్నతో ఆ విధముగా పలికిన తరువాత హనుమ తన సన్యాసి రూపము విడిచి అన్నదమ్ములిరువురినీ తన మూపుపై కూర్చుండ బెట్టుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని పోయెను.
Also read: హనుమ వాక్పటిమ గురించి లక్ష్మణుడికి రాముడి వివరణ
సుగ్రీవునకు రామలక్ష్మణుల గురించి చెప్పి ఆయన వద్దకు వారిని తీసుకొని పోయినాడు.
‘‘సుగ్రీవా, ఈయన రాముడు. సత్యపరాక్రముడు. ఇక్ష్వాకు వంశమందు జన్మించిన వాడు. దశరధకుమారుడు. ధర్మాత్ముడు. తండ్రి ఆజ్ఞపాటించి భార్యా సోదర సమేతముగా అడవులకు వచ్చినాడు.
ఇదుగో, ఈయన లక్ష్మణుడు. అన్నను అనుసరించి వచ్చినవాడు. అన్నకు తగ్గ తమ్ముడు. రాముని భార్యను రావణుడపహరించగా ఆమెను తిరిగి పొందుటలో నీ సహాయము అర్ధించి వచ్చినాడు. వీరు నీ స్నేహము కోరుచున్నారు.వీరిని స్వీకరించుము’’ అనిపలికిన హనుమంతుని మాటలు విని వారిరువురినీ ఆనందముగా చూచుచూ, ‘‘రామా, నీ గురించి హనుమ అంతా చెప్పినాడు. నీవు ధర్మాత్ముడవనీ, సత్యపరాక్రమము కలవాడవనీ, గొప్పతపఃసంపన్నుడవనీ తెలిపినాడు.
Also read: తనను రామలక్ష్మణులకు పరిచయం చేసుకున్న హనుమ
‘‘ఓ ప్రభూ, వానరుడనైన నాతో స్నేహము కోరుచున్నావనగా అది నాకు గొప్ప సత్కారము. రామా, ఇదుగో నా చేయి చాపుచున్నాను స్వీకరించవయ్యా.’’
సుగ్రీవుని ఈ మాటలు విన్న రాముడు మిక్కిలి ఆనందముతో ఆయన చేయి తన చేతితో దృఢముగా పట్టుకొని ఆయనను దగ్గరకు తీసుకొని తన బాహువులతో గాఢముగా కౌగిట బంధించినాడు.
శ్రీరామ సుగ్రీవ ఆలింగనమయినపిదప హనుమంతుడు రెండు కర్రల నుండి అగ్నిని పుట్టించి, ఆ అగ్నిని పుష్పములతో పూజించి, అలంకరించి, శ్రద్ధతో ఆ అగ్నిని రామసుగ్రీవుల మధ్య ఉంచగా వారిరువురూ ప్రదక్షిణము చేసి అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు.
Also read: కిష్కింధలో కలకలం
“త్వం వయస్యోసి హృద్యో మే ఏకం దుఃఖం సుఖం చ నౌ”
‘‘రామా, ఇప్పుడు నీవు నాకు ప్రేమ పాత్రుడవైన మిత్రుడవు. ఇకపై మన సుఖదుఃఖములు ఇరువురికీ సమానములు.’’
అంత సుగ్రీవుడు చక్కగా పుష్పించి మెత్తటి ఆకులు పువ్వులు గల ఒక మద్దిచెట్టు కొమ్మ విరిచి దానిపై రామునికి సుఖాసనమేర్పరచి తానుకూడా ఆయన పక్కనే కూర్చున్నాడు.
అప్పుడు హనుమంతుడు, నిలబడియున్న లక్ష్మణునకు ఒక చక్కని గంధపు చెట్టు కొమ్మ విరిచి దానిమీద ఆసనము ఏర్పాటు చేసెను.
Also read: శబరికి మోక్షం
అందరూ కూర్చొన్న తరువాత సుగ్రీవుడు రామునితో ‘‘రామా, నా అన్న వాలి నా భార్యను అపహరించి నన్ను అవమానించి రాజ్యమునుండి వెళ్ళగొట్టినాడు. అతనికి భయపడి ఇతరులెవ్వరూ ప్రవేశించలేని ఈ భయంకరారణ్యములో ప్రవేశించి నివాసమేర్పరచుకొన్నాను. రామా, వాలివలన నాలో ఏర్పడిన భయాన్ని తొలగించుము’’ అనుచూ వేడుకొన్న సుగ్రీవుని చూసి చిరు నవ్వుతో ‘‘మిత్రమా, స్నేహానికి ఉపకారమే ప్రయోజనము అను విషయము నేనెరుగుదును. నీ భార్యను అపహరించిన వాలిని నేను చంపివేయగలను.
‘‘రామా, నీ పలుకులు నా హృదయములో మరల సంతోషాన్ని నింపినవయ్యా. నా అన్న మరల ఇంకెప్పుడూ నన్ను బాధించకుండాయుండునట్లు చేయుమయ్యా’’ అని సుగ్రీవుడు మరల పలికినాడు.
NB
Fair weather friendship కాదు రామ,సుగ్రీవులది. ఒకరి అవసరాలను మరొకరు గుర్తించి పరస్పర ఉపకారము చేసుకొనుట అనేటటువంటిది స్నేహముయొక్క లక్ష్యము. అన్నీబాగున్నపుడు స్నేహము, మనిషి కష్టాలలో ఉన్నపుడు ముఖము చాటెయ్యడం ఇది స్నేహము అనిపించుకోదు.
తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుకదరా సుమతీ! ….ఇలాంటి స్నేహాలు ఇప్పుడు కోకొల్లలు.
Also read: రామలక్ష్మణులకు బుుష్యమూక పర్వతానికి దారి చెప్పిన కబంధుడు
వూటుకూరు జానకిరామారావు