‘భవిష్యత్తు మానవుడు’- ఇతివృత్తంగా ఈ సంవత్సరం ప్రపంచ తాత్త్వికతా దినం (WORLD PHILOSOPHY DAY) జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో 16-18 నవంబర్ 2022 మూడు రోజులపాటు సింపోజియా-ఎగ్జిబిషన్ ల వంటి కార్యక్రమాలు జరపాలని యునెస్కో, లీఫెన్స్ నోయ్ నేషనల్ స్టూడియో సంయుక్తంగా నిర్ణయించాయి. ఇది ఎవరికి సంబంధించింది?అనే అనుమానమే రాకూడదు. ఎందుకంటే ఇది ప్రతిచోటా ప్రతి ఒక్కరికీ అవసరమైంది. జీవన మూలాల గురించి, తాత్త్వికత గురించి ఆలోచించే ప్రతివారికి ప్రపంచ వ్యాప్తంగా ఇది అవసరం.
Also read: ఇల్లు కూడా మనిషి లాంటిదే!
ప్రతి సంవత్సరం నవంబర్ లో మూడో గురువారం ప్రపంచ తాత్త్వికతా దినం జరుపుకోవడం ఎందుకంటే, ప్రపంచ పౌరులు వారివారి సంస్కృతుల్లోంచి పైకి ఎదిగి ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో ఆలోచించి, మానవుడి ఔన్నత్యాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి, దాని ప్రకారం ఆచరించి తమతమ సమాజాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి దీన్ని జరుపుకుంటున్నాం! ప్రపంచంలో ఉన్న భిన్నమైన మేధోసంపత్తిలో ఒక ఏకత్వాన్ని సాధించుకోవలసి ఉందని గుర్తు చేసుకోవడం కోసం ఈ రోజును జరుపుకుంటున్నాం!! హేతుబద్ధమైన చర్చలతో, సంప్రదింపులతో నిజాయితీని, త్యాగనిరతిని, బాధ్యతని, ఓపికగా మానవుడే కేంద్రంగా సాగవల్సిన ప్రయాణానికి ఒక తాత్త్విక భూమికను ఏర్పరచుకోవాల్సి ఉందని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని జరుపుకుంటున్నాం!
Also read: నాస్తికత్వం ఒక విచారధార – జీవన విధానం
మనిషికి వివేకంపై గల ప్రేమనే మనం తాత్త్వికత/ఫిలాసఫీ – అని అనుకోవచ్చు- విస్తృతార్థంలో చెప్పుకోవాలంటే జనం తమ గురించి- తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి- వారి మధ్య గల సంబంధం గురించి కొన్నిమౌలిక సత్యాలను అర్థం చేసుకుని, రూపొందించుకునే జీవన విధానమే తాత్త్వికత! మళ్ళీ ఈ తాత్త్వికత అనేక రకాలుగా ఉంటుంది. సిద్ధాంతబద్ధమైన తాత్త్వికత (METAPHYSICS/EPISTEMOLOGY); యదార్థం (PRACTICAL) లోంచి వెలువడ్డ తాత్త్వికత- అంటే నైతిక, సామాజిక, రాజకీయ, సౌదర్య భావనవంటి అంశాలతో కూడిన తాత్త్వికత.
Also read: దశహరాకు వక్రభాష్యాలు ఆపండి!
ఇకపోతే వ్యక్తిగతమైన విశ్వాసాలు, జీవితాంతం నిలుపుకునే విలువలూ, ఆచరించే నైతిక సూత్రాలను బట్టి అది వారి వ్యక్తిగత తాత్త్వికత అవుతుంది. అది మెరుగైనదై ఉండి, ఇతరులకు స్ఫూర్తిదాయకమైనప్పుడు – అదే ఒక ప్రాంతంలోని సమాజం ఆచరిస్తే అది సమాజ తాత్త్వికత అవుతుంది. అదే దేశం అనుసరిస్తే అది ఆ దేశపు తాత్త్వికత అవుతుంది. ఏమైనా చివరికి మానవాళికి- మనిషి కేంద్రంగా ఒక ఉమ్మడి తాత్త్విభూమిక అవసరం!
Also read: మనువాదం మట్టికరవక తప్పదు!
తాత్త్విక దృక్పథం ఎప్పుడూ గౌరవప్రదమైన సమాజ నిర్మాణానికి ఉపయోగపడాలి. ఎదురయ్యే సవాళ్ళను సంయమనంతో ఎదుర్కోగలిగే శక్తిని కూడా అందజేయాలి. దీనిలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావల్సిందే. తమవంతు బాధ్యతను నిర్వహించాల్సిందే. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. కానీ, ఆ భాషల్లో తాత్త్విక దృక్పథం లేకపోతే అవి బీడు భూములయిపోతాయి. అందులో పచ్చని జీవన తాత్త్వికతను మొలిపించుకోవాలి. విశాల దృక్పథంతో మానవత్వం వికసించాలంటే తప్పదు – మనుషులంతా ఒక్కటి – అని నినదించక తప్పదు! ఆ మానవాళి పురోగతికి కంకణబద్ధులమై పని చేస్తామని, ప్రపంచ పౌరులంతా దీక్ష తీసుకోకా తప్పదు!! మారుతున్న పరిస్థితులను గమనిస్తూ, అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతిచోటా ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాల్సి ఉంది. 17 నవంబర్ 2022న జరుపుకునే తాత్త్వికతా దినం ఉద్దేశం అదే!
Also read: చిన్నారుల మెదళ్ళలో మతబీజాలు
(17 నవంబర్ 2022 ప్రపంచ తాత్త్వికతా దినం)