Sunday, December 22, 2024

చిరునవ్వు చెరగని హీరో కృష్ణ

ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ గా ప్రసిద్ధుడు ఘట్టమనేని కృష్ణ మంగళవారంనాడు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అనేక చిత్రాలలో నటించిన కృష్ణ పద్మాలయా స్టూడియో నిర్మాణం ద్వారా సినీ పరిశ్రమం మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలిరావడమనే కార్యక్రమానికి తుది రూపు ఇచ్చారు. అంతకు ముందే అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో నిర్మించి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు రావడానికి శ్రీకారం చుట్టారు. తర్వాత సారథి స్టూడియో, రామానాయుడు స్టూడియోస్ వచ్చాయి. ఎన్ టి రామారావు, చిరంజీవి వంటి ప్రముఖ నటులు హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

నటనలో నిమగ్నమై ఉన్నప్పటికీ చిత్రాలు నిర్మించడంలోనూ, రాజకీయ వ్యవహారాలలో తనదంటూ పాత్ర పోషించడంలోనూ కృష్ణ ముందు పీటీలో ఉన్నారు. 1972లో జైఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. పదేళ్ళ తర్వాత ఈనాడు చిత్రాన్ని నిర్మించారు. అది రాజకీయ చిత్రం. ఆ తర్వాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ విధానాలకు ‘ఈనాడు’ చిత్రం ఇతివృత్తానికి దగ్గర సంబంధం ఉన్నదని ప్రజలు అనుకున్నారు. కానీ ఎన్ టి రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పి, తొమ్మిదిమాసాలలో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన తర్వాత ఆయనకూ, కృష్ణకూ అభిప్రాయ భేదాలు వచ్చాయి. అవి రాజకీయ వైరానికి దారితీశాయి.

నా మటుకు నాకు కృష్ణ సోదరులతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1995 మేలో నేను సంపాదకుడుగా ఉన్న సమయంలో ‘ఉదయం’ మూసివేసినప్పుడు ఉద్యోగం లేదు. అప్పటికే సంపాదకుడిగా పని చేసిన నాకు ఏదైనా సంపాదక స్థానం ఖాళీ ఏర్పడితే కానీ ఉద్యోగం దొరకదు. నేను తక్కువ  స్థాయిలో పని చేయడానికి సిద్ధపడినా సదరు పత్రిక సంపాదకుడు అంగీకరించరు. అందువల్ల పామర్రుకు చెందిన మిత్రుడు, ‘ఉదయం’లొ సహచరుడు ఎన్. వి.  ప్రసాద్ చొరవతో కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావును కలిశాను. ప్రసాద్ తండ్రి జానకిరామయ్య కూడా పద్మాలయ స్టూడియోలో పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆయన సహకారంతో పద్మాలయ టీవీకి రెండు కార్యక్రమాలు నిర్మించే ఒప్పందం కుదుర్చుకున్నాను. రెండు సంవత్సరాలపాటు అక్కడ పని చేశాను. పన్నెండు మంది బృందం పని చేసేది. ఆ పని జరుగుతుండగా ‘వార్త’ను స్థాపించిన సంపాదకుడు ఏబీకే ప్రసాద్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చేరవలసిందిగా వార్త అధినేత గిరిష్ సంఘీ ఆహ్వానించారు. ఎడ్వర్టయిజ్ మెంట్ జనరల్ మేనేజర్ కేఆర్ పీ రెడ్డితో కబురు పెట్టారు. కృష్ణ దగ్గరా, ఆదిశేషగిరిరావు దగ్గరా సెలవు తీసుకొని ‘వార్త’ సంపాదకుడిగా 1998లో చేరిపోయాను. ఆ విధంగా కృష్ణ సోదరులతో అనుబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు కృష్ణగారిని కలుసుకునే అవకాశం లభించింది. కృష్ణ చిరునవ్వుతో హుషారుగా మాట్లాడేవారు. మంచి మనిషిగా పేరుంది.

తాను నిర్మాతగా నటులకు, సాంకేతిక నిపుణులకు పారితోషికం చెల్లించడంలో చాలా ఠంచనుగా వ్యవహరించేవారు. ఒప్పుకున్న మొత్తాన్ని బేరం చేయకుండా చెల్లించేవారు. సినిమా బాగా అడినా, ఆడకపోయినా చెల్లింపులకు ధోకా ఉండేది కాదు. ‘సింహాసనం’ సినిమా నిర్మించిన రోజుల్లో భారీ వడ్డీకి డబ్బు తీసుకొని వచ్చేవారు. అగ్రనటులు నటించిన సినిమాలను పోలిన సినిమాలు తీయడం లేదా అటువంటి సినిమాలలో నటించడం కృష్ణ చేసిన సాహసం. ‘దేవదాసు,’ ‘దానవీరశూరకర్ణ’ సినిమాలకు పోటీగా తీసిన సినిమాలను నిర్మించి ఆర్థికంగా నష్టపోయారు. అదే విధంగా చిరకాల మిత్రుడు, గానగంధర్వుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం నిర్మించిన సినిమా కుప్పకూలింది. అందులో హీరోగా కృష్ణ నటించారు. నటనపూర్వకంగా అంత రాణిచలేకపోయినా సాంకేతకంగా సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. చివరికి బాలూతో కూడా వైరం తప్పలేదు.

ఎనిమిది పదుల నిండు జీవితం జీవించిన కృష్ణ తాను అనుకున్న విధంగా నడుచుకునేవారు. విజయనిర్మలతో కలిసి 42 సినిమాలలో నటించారు. ‘సాక్షి’ సినిమా షూటింగ్ సందర్బంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకున్నారు. అప్పటికే కృష్ణకూ, విజయశాంతికీ వేరేవారితో వివాహాలు జరిగాయి. విజయనిర్మలకు నరేష్ పుట్టాడు. కృష్ణకు రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల, ప్రియదర్శిని, పద్మావతి సంతానం. విజయనిర్మల భర్తతో విడిపోయి కృష్ణకు రెండో భార్యగా ఉండటానికి మొగ్గు చూపారు. కృష్ణ మొదటి  భార్యను ప్రేమగా చూసుకుంటూనే విజయనిర్మలతో కలిసి జీవించారు. వారిద్దరికీ పిల్లలు లేరు.

నాలుగు సంవత్సరాల కిందట ‘సాక్షి’ ఎక్స్ లెన్స్ అవార్డు స్వీకరించడానికి రావలసిందిగా ఆహ్వానించేందుకు నేనూ, సహడైరెక్టర్ రాణిరెడ్డి కలిసి ఆయన ఇంటికి వెళ్ళాం. అప్పుడు విజయనిర్మల ఆరోగ్యంగానే ఉన్నారు. ముందు మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు పోయారు. తర్వాత విజయనిర్మల, అనంతరం తల్లి ఇందిరాదేవి మరణించారు. ఇప్పుడు తండ్రి కృష్ణ పోవడంతో మహేశ్ బావురుమన్నాడు. సినీ ప్రపంచ దిగ్గజాలు కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. బుధవారంనాడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. అంతకంటే ముందు కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయాస్టుడియోలో ఉంచుతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles