Sunday, November 24, 2024

కులాన్ని పట్టించుకోవటం అంటే ఏమిటి?

కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శ అందరికి తెలిసిందే. అందుకు కారణం వారు కులాన్ని గుర్తించకుండా వర్గ పోరాటాల ఆధారంగా పనిచేయటమే. నిజమే. భారతీయ సమాజం లక్షణం కుల సమాజంగా ఉన్నప్పుడు కులాన్ని గుర్తించ నిరాకరించడం సరైనది కాదు. ఈ ప్రశ్నపై నాకు వచ్చిన సందేహం ఏమంటే, వర్గ పోరాటాల కోసం  వారు సోవియట్ యూనియన్ నుండో లేదా చైనా నుండో వర్గాలను దిగుమతి చేసుకున్నారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. వారి వర్గ పోరాటాల కోసం ఆ పోరాటాలకు అవసరమైన తరగతులను ఇక్కడ ఉన్న కులాలనుండి సమీకరించారు.

రైతులు, వ్యవసాయ కూలీలు

గ్రామీణ సమాజంలో రెండు రకాల వర్గాలను వారు సమీకరించారు. ఒకటి రైతులు కాగా రెండో వారు వ్యవసాయ కూలీలు. రైతుల కోసం రైతాంగ సంఘాలను కూలీల కోసం వ్యవసాయ కార్మిక సంఘాన్ని పెట్టారు. నక్సలైట్ గ్రూపులు అయితే రైతు కూలీ సంఘం అని అన్నారు. రైతాంగ సంఘంలో ప్రధానంగా రెడ్లు, కమ్మలు, కాపులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ సంఘ నాయకత్వం దాదాపుగా వీరి చేతుల్లోనే ఉంటుంది. ఇక వ్యవసాయ కార్మిక సంఘం విషయానికొస్తే ఇందులో మెజారిటీ మంది షెడ్యూల్ కులాల వారు కాగా మిగతావారు దిగువ శూద్ర కులాలు ఉన్నాయి. అదే సమయంలో వృత్తి సంఘాలుగా గీత కార్మిక సంఘం ద్వారా గౌడ కులాల వారిని, మత్స్య కార్మిక సంఘంతో బెస్తలు, ముతరాశి కులాలను, చేనేత కార్మిక సంఘంతో పద్మశాలిలను సమీకరించడం కనబడుతుంది. ఇంకా ఇతర వృత్తి సంఘాలు కూడా ఉన్నాయి. ఈ సంఘాలు ప్రధానంగా వారి ఆర్థిక డిమాండ్లను చేపట్టాయి. ఈ రకంగా ఏదో ఒక రూపంలో ఈ కులాలను సమీకరించడం అంటే అది కులాన్ని పట్టించుకోవడం కాదా?

అయితే ఈ వృత్తి సంఘాల ఆర్థిక డిమాండ్లు అన్ని ఆ వృత్తి ఆధారంగా వారికి ఆర్థిక వెసులుబాటును కల్పించటానికి ఉపయోగపడతాయి. ఇంతవరకు సరే. కానీ ఆర్థిక వ్యవస్థలో నూతన రంగాలు అంటే పారిశ్రామిక రంగం సేవా రంగాలు ప్రాధాన్యత రంగాలుగా అభివృద్ధి  చెందుతున్నప్పుడు ఈ రంగాలలో ఆ వృత్తుల వారికి అందుబాటులోకి తేవటం ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. అంటే కమ్యూనిస్టు సంఘాలు చేస్తున్న పోరాటాలలో వారు ఇతర వృత్తుల్లోకి మార్చే ఎజెండా ఉండటం లేదు. వ్యవసాయ కార్మికులుగా ఉన్న షెడ్యూల్ కులాల వారికి కేవలం కూలి పెరగటం, చారెడు భూమి లభించటం మాత్రమే వారి  సమస్యలు పరిష్కారమా? వారు ఆధునిక వృత్తిలోకి ప్రవేశించటం గాని, సేవా రంగాల్లో ఉద్యోగులుగా మారటం గానీ రాజకీయాలలో వారి జనాభా పరంగా ప్రాతినిధ్యాన్ని పొందాల వద్దా? ఈ రకంగా చూసినప్పుడు కమ్యూనిస్టు సంఘాల పోరాటాలు మొత్తం సాంప్రదాయ వృత్తుల్లోని కొంత వెసులుబాటు పొంది జీవించే విధంగా ఉన్నది తప్పా మంచి ఆదాయాలు కలిగిన ఆధునిక వృత్తిలోకి మారే విధంగా  పోరాటాలు ఉండటం లేదు.

జనాభాకు అనుగుణంగా అధికారంలో వాటా

అలాగే క్రింది కులాలు రాజకీయ అధికారంలో వారు జనాభాకు అనుగుణంగా వాటాను పొందే  విధంగా కమ్యూనిస్టులకు నేటికి కూడా ఎజెండా లేకుండా ఉంది. ఈ రకంగా చూసినప్పుడు కింది కులాల సమస్యల్ని కేవలం ఆర్థిక డిమాండ్లకే పరిమితం చేయటం, ఆ ఆర్థిక డిమాండ్లు కూడా ఆ కులవ్యవస్థ చట్రంలోనే పరిమితమై ఉండటం వల్ల చాలా పాక్షిక స్థాయిలోనే కమ్యూనిస్టులు క్రింది కులాల సమస్యల్ని పట్టించుకున్నట్లు కనబడుతున్నది. అయితే దీనికి రైతు సంఘంలో భాగంగా సమీకరించపడుతున్న కమ్మ, రెడ్లు కొంత మినహాయింపుగా ఉన్నారు. వీరు మోతుబరి రైతులుగా ఉండటం వల్ల వ్యవసాయ శ్రామికుల అదనపు విలువని దోపిడీ చేయటం ద్వారా వారు పారిశ్రామిక, సినిమా రంగంలోకి ప్రవేశించ గలిగారు. రాజకీయంగా కూడా తెలుగు రాష్ట్రాలలో తమ పట్టును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కాపులు రాజకీయ అధికారాన్ని పొందటానికి తయారవుతున్నారు.

భారతరాజ్యాంగం 1950 నుండి అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కును కల్పించింది. ఎవరు ఏ వర్గానికి చెందినప్పటికీ ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువను కల్పించింది. ఈ అవకాశం ద్వారా క్రింది కులాలు కూడా రాజకీయ అధికారాన్ని పొందే వీలు కలిగింది. ఈ విషయాన్ని బూర్జువా పార్టీలు గ్రహించాయి. ఈ విధంగా బూర్జువా పార్టీలు కింది కులాలకు అన్ని రంగాలలో కల్పిస్తున్న సమ్మిళిత విధానాన్ని విప్లవకారులకు చెప్పబడుతున్న కమ్యూనిస్టు పార్టీలు అమలు చేయలేక పోతున్నాయి. మండల్ కమిషన్ వచ్చేవరకు రిజర్వేషన్ల విషయంలో వారికి సరైన అవగాహన లేదు. ఆ పోరాటం తిరుగుతున్నప్పుడు తటస్థంగా ఉన్నారు. ఇటీవల కాలంలోనే రిజర్వేషన్లను సమర్ధిస్తున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక పారిశ్రామిక రంగం మొత్తం అగ్రకుల ఏకస్వామ్యంగా ఉంది. ఈ రంగంలో అగ్రకుల ఏకస్వామ్య ని బద్దలు చేసి అందులో అన్ని కులాలను భాగస్వామ్యం చేసే కార్యక్రమం, కార్యాచరణ ఏదీ లేదు.

కింది కులాలలో పెరుగుతున్న రాజకీయ ఆకాంక్షలు

అదే సమయంలో ఇటీవల కాలంలో క్రింది కులాలలో రాజకీయ ఆకాంక్షలు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా గుర్తిస్తున్నారు. కానీ  ఈ ఆకాంక్షలకు అనుగుణంగా వారి రాజకీయ కార్యాచరణ ఏమి ఉండటంలేదు. ఏ రకమైన సమస్యల పరిష్కారము అంతిమంగా రాజకీయాల ద్వారానే పరిష్కారమవుతాయనే విషయం కమ్యూనిస్టులకు తెలుసు. మరి ఈ రాజకీయాలలో క్రింది కులాల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నం ఏది ఉండదు. అందువల్లనే ఈ కులాల వారు బూర్జువా పార్టీల వైపు పోతున్నారు. ఇందుకోసం బీజేపీ పార్టీని కూడా వదలటం లేదు. బూర్జువా పార్టీలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి.

ఈ విధంగా  వారు కమ్యూనిస్టుల కంటే ముందు బాగానే ఉన్నారు. ఈ విషయంలో మాత్రం కమ్యూనిస్టులు 70 ఏళ్లు వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు. దానికి కారణం వారి రాజకీయ కార్యాచరణ మొత్తం కూడా వ్యవసాయ రంగానికి పరిమితమై ఉండటమే. అందువల్లనే నేటికీ వ్యవసాయక విప్లవమే ఇరుసుగా ఉంటున్నది. దీనికి కారణం వర్గ సంబంధాలని సరిగా అర్థం చేసుకోకపోవడంమే. వారి వర్గ విశ్లేషణ కూడా పాక్షికంగా ఉండటం. కులానికి ఉన్న వర్గ లక్షణాలను అర్థం చేసుకోలేక పోవటం. ఇలాంటి కారణాల దృష్ట్యా వారు తమ అవగాహనని, పోరాటాలను పరిమిత స్థాయికి కుదించుకుని ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవడం కనిపిస్తున్నది. ఇదే స్థితి కొనసాగితే బహుశా వారు తెరమరుగు కాక తప్పడెమో!?

తెలుగు రాష్ట్రాలలో నూతన ధోరణి

కులాన్ని పట్టించుకోవటం అనే విషయంలో తెలుగు రాష్ట్రాలలో ఒక నూతన ధోరణి ఉన్నది. కామ్రేడ్ వీరన్న , ఉ.సా, కంచ ఐలయ్య లాంటివారు ఉప కులాల వారీగా సంఘాలను పెట్టే విధంగా సిద్ధాంతాలను రూపొందించారు. మాన్యశ్రీ కాన్షీరామ్ బహుజన ఉద్యమం పెరగకుండా నిలువరించింది. ఈ పరిస్థితిని కాన్సిరాం గారు కూడా  ఛేదించలేక పోయారు. అంబేద్కర్ గారు దేశంలో బహుజన ఉద్యమాన్ని మొదటగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తో ప్రారంభించి తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ గా దాన్ని మార్చి, ఆఖరిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గా మార్చాడు. అక్కడి వరకు చేరిన ఆయన ఉద్యమ రథాన్ని కాన్షీరామ్ గారు బహుజన ఉద్యమంగా మార్చి దేశంలో బహుజన రాజకీయాలను కొత్త పుంతలు తొక్కించారు. కాబట్టి కులాన్ని పట్టించుకోవటం అంటే అంబేద్కర్ తో ప్రారంభమై  కాన్షీరామ్ కొనసాగిస్తున్న రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటమే. కానీ  కామ్రేడ్ వీరన్న, ఉ.సా, కంచె ఐలయ్య త్రయం బహుజన ఉద్యమ రధాన్ని తెలుగు రాష్ట్రాలలో వెనక్కు తిప్పి ఉప కులాల వారీగా కుల సంఘ ఉద్యమాలు గా మార్చారు. ఈ విధంగా బహుజన రాజకీయ పోరాటం కుల సంఘ ఉద్యమాలు గా మారిపోయాయి.

Also read: బహుజన రాజ్యాధికారంతో ఎస్సీలకేంపని?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles