వోలేటి దివాకర్
- ఉండవల్లి అరుణకుమార్ ప్రశ్న
- మార్గదర్శిపై పోరాటం గురించి పుస్తకం రాయనున్నట్టు వెల్లడి
ఖాతా పుస్తకాల్లో షేర్లు, నగదు నిల్వలను ( క్యాష్ ఈక్వెలెంట్ ) తప్పుగా చూపించి దొరికిపోయిన సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు స్వచ్చందంగా పోలీసులకు లొంగిపోయి జైలుకు వెళ్లారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. తాను కేసు వేసిన సమయంలో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ పరిస్థితి కూడా అలాగే ఉందని ఆయన చెప్పారు. దేశంలోనే అత్యంత పలుకుబడి కలిగిన రామోజీరావు సత్యం రామలింగరాజులా జైలుకు వెళతారా? లేక చట్టానికి న్యాయానికి అతీతులుగా నిలుస్తారా? అన్నది తేలాల్సి ఉందన్నారు.
Also read: పాపం ఈసారి ఎవరి ‘కాపులు’?
ఉండవల్లి సోమవారం విలేఖర్ల సమావేశంలో మార్గదర్శి కేసు గురించి మాట్లాడారు. తాను కేసు వేసిన సమయంలో మార్గదర్శి సంస్థ రూ. 13 వేల కోట్ల నష్టాల్లో ఉందన్నారు. 16 ఏళ్లుగా ఈ కేసును ఎటూ తేల్చడం లేదన్నారు. రామోజీరావును జైలుకు పంపాలన్నది తన ఉద్దేశం కాదని, చట్టం ముందు అందరూ సమానమేనన్నది తేల్చాలని మాత్రమేనని వ్యాఖ్యానించారు.
బ్యాంకింగేతర సంస్థలు ఉమ్మడి హిందూ కుటుంబం (హెచ్ యుఎఫ్) చట్ట ప్రకారం డిపాజిట్లు స్వీకరించ కూడదన్నారు. అయితే, రామోజీరావు తనకు ఈ చట్టం వర్తిందని వాదిస్తున్నారన్నారు. ఒక వైపు మార్గదర్శి సంస్థ వారు రామోజీరావుకు చిటఫండ్ సంస్థకు సంబంధం లేదని చెబుతున్నారని, మరోవైపు సంస్థ బ్యాలెన్స్ షీట్లను పరిశీలించగా చైర్మన్ రామోజీరావు సంతకం ఉందనీ అన్నారు. దీనిలో ఏది వాస్తవమన్నది తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం చిట్ ఫండ్ సంస్థలు ఇతర వ్యాపారాలు చేయకూడదన్నారు. అయితే, రామోజీరావుకు అనేక వ్యాపారాలున్న విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. పాడుకున్న చిటీల సొమ్మును విధిగా జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్నా ఈ నిబంధనలను మార్గదర్శిలో పాటించలేదన్నారు.
Also read: పాదయాత్ర కలిపింది ఆ ఇద్దరినీ!
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
రాష్ట్రంలోని అన్ని చిట్ ఫండ్ కంపెనీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల పత్రికల్లో చదివానని ఉండవల్లి చెప్పారు. చిట్ ఫండ్ వ్యాపారంలో 80 శాతం వాటా ఉన్న మార్గదర్శిలో మాత్రం ఈ తరహా తనిఖీలు చేసినట్లు దాఖలాలు లేవన్నారు. మార్గదర్శిలో తనిఖీలు చేస్తే రామోజీరావుకు చెందిన ఈనాడు, ఈటీవీల్లో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తాయేమోనన్న భయం ప్రభుత్వానికి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పుడే చట్టం తన పని తాను చేసుకోగలదని ఉండవల్లి స్పష్టం చేశారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ( ఆర్ఓసి ) మార్గదర్శిలో ఇడి తనిఖీలు చేయాలని సిఫార్సు చేసిందని, డిపాజిట్ల స్వీకరణపై ఆర్బిఐ జోక్యం చేసుకుని విచారణ జరపాలని, రామోజీ ఫిలిం సిటీలో జరిగిన భూగరిష్ట పరిమితి చట్టం ఉల్లంఘనపై విచారణ జరపాలని సూచించిందని ఉండవల్లి వివరించారు. హెచ్ యుఎఫ్ ప్రకారం మార్గదర్శి డిపాజిట్లు స్వీకరణను ఆర్బిఐ తప్పు పట్టిందని చెప్పారు. తన వద్ద మార్గదర్శి చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి ప్రకటించారు.
Also read: కరవు కాటకాలకు ఆనకట్ట…కాటన్ బ్యారేజీకీ అంతర్జాతీయ గౌరవం!
అద్వానీ … ఉపేంద్ర పెట్టుబడులు పెట్టారా?
మార్గదర్శి సంస్థలో బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ, దివంగత కేంద్రమంత్రి ఉపేంద్ర వంటి వారు పెట్టుబడులు పెట్టారా? అంటే ఉండవల్లి చెప్పిన దాని ప్రకారం దీనిపై అనుమానాలు ఉన్నాయి. మార్గదర్శికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉండవల్లి తన పరిశీలనలో ఈ పేర్లు ఉన్నట్లు చెప్పారు. మార్గ దర్శిలో పెట్టుబడులు పెట్టిన వారి జాబితాలో అద్వానీ, ఉపేంద్ర వంటి వారి పేర్లు ఉన్నాయని చెప్పారు. అయితే వారు బిజెపి నేత ఎల్కే అద్వానీ, మాజీ మంత్రి పి ఉపేంద్రేనా అన్న విషయాన్ని తాను రూఢీ చేయలేనన్నారు. మార్గదర్శిపై తాను చేస్తున్న పోరాటంపై పుస్తకం రాస్తానని ఉండవల్లి వెల్లడించారు. ఈ పుస్తకం న్యాయవిద్యార్థులకు దిక్సూచిగా ఉంటుందని తెలిపారు.
Also read: అమరావతా? అధికార వికేంద్రీకరణా? ఏది రైటు?