Thursday, November 21, 2024

రావణుడికి సీతమ్మ హెచ్చరిక

రామాయణమ్ 78

ఒక అమాయకురాలైన పల్లెపడుచు తన అంతరంగాన్ని ఏ దాపరికమూ లేకుండా ఎలా బహిర్గతపరుస్తుందో అంతగా కల్లాకపటము లేకుండా తమ వివరాలను భిక్షుకవేషధారి అయిన రావణునికి ఎరిగించింది సీతమ్మ!

‘‘ఓ బ్రాహ్మణుడా, ఒక ముహూర్తకాలము నీవు వేచి ఉంటే నా భర్త తీసుకొని వచ్చు రుచికరమైన ఆహారము నీకు ఇవ్వగలదానను. నీవు నివసింపదలచుకొన్న ఎడల మాతో ఇచ్చటనే ఉండవచ్చును’’ అని పలికింది జానకీదేవి.

Also read: రావణుడికి అమాకురాలైన సీత అతిథి మర్యాదలు

మరల సీతాదేవి అతనిని ఉద్దేశించి, ‘‘ఓ ద్విజుడా, నీ కులము గోత్రము, నామధేయము ఎరిగింపుము’’ అని అడిగింది.

అందుకు త్రిలోక భయంకరుడైన రావణుడు తీవ్రంగా బదులు పలికినాడు.

‘‘సీతా, నేను సకలలోక భయంకరుడైన రాక్షసరాజు రావణుడను. నా నగరము లంక. అది సముద్రమధ్యమందున్న ఒక పర్వతాగ్రము మీద నిర్మింపబడిన ఒక సుందర నగరము.

Also read: ఈటెల వంటి మాటలతో లక్ష్మణుడిని బాధించిన సీత

ఓ సీతా, నిన్ను కనిన నా కన్నులకు నా భార్యల సౌందర్యమూ ఒక సౌందర్యమేనా అను భావన కలుగుచున్నది. వారివలన ఇక ఎంతమాత్రమూ సుఖము పొందజాలను. నీ అందము మాకందము!

ఓ తరుణీ, ఎన్నో లోకాలనుండి ఎందరో సుందరాంగులను తెచ్చుకొని సుఖించుచున్న నాకు నీవంటి సౌందర్యరాశి ఇప్పటివరకూ అగుపడలేదు. రా, నా తో సుఖించు. సర్వాలంకార భూషితలైన అయిదు వందల మంది దాసీజనము నీకు ఊడిగముసేయ సిద్ధముగా ఉన్నారు….’’

రావణుడి ఉన్మత్త ప్రేలాపనలు విన్న సీతాదేవి ఆగ్రహోదగ్ర అయినది.  వానిని నిందిస్తూ పరుషముగా బదులు పలికింది.

‘‘నా భర్త రాముడు ఎలాంటి వాడనుకొన్నావు? మహేంద్రుడి వంటివాడు. మహాసముద్రము వలే క్షోభింప శక్యము కాని వాడు….నేను అట్టి రాముని విషయమునందే వ్రతము కలదానను.

‘‘రాముడు సర్వలక్షణ సంపన్నుడు. వటవృక్షము వలే ఆశ్రితులకు సుఖము కలిగించువాడు. సత్యసంధుడు. మహాభాగ్యవంతుడు. నేను అట్టి రాముని అనుసరించుట అను వ్రతము కలదానను.

Also read: మారీచుడిని మట్టుపెట్టిన రాముడు

‘‘రాముడు మహాబాహువు. విశాలవక్షస్థలము కలవాడు. నరులలో శ్రేష్ఠుడు. సింహము . సింహపునడక కల వాడు. నేను అట్టి రాముని విషయమునందే వ్రతము కలదానను. నక్కలాంటి నీవు ఏ మాత్రము లభ్యము కాని ఆడుసింహమైన నన్ను కోరుతున్నావు’’ అని అంటూ ఇంకా రావణుని తీవ్రముగా హెచ్చరించసాగింది సీతమ్మ

ఆమె నేత్రాలు క్రోధారుణిమ దాల్చాయి.

రావణునుద్దేశించి, ‘‘నీవు రాముని భార్యను కోరుకుంటున్నావు. నీకు బంగారు వృక్షాలు కనపడుతున్నట్లుగా ఉంది  (మరణ మాసన్నమైన వానికి బంగారు వృక్షాలు కనపడతాయట). రాముని ప్రియసతిని కోరుతున్న నీవు, ఆకలిగొన్న సింహము నోటిలో చేయి దూరుస్తున్న వానిలాగా, మహాసర్పము కోర లాగాలనుకున్న వానిలాగా, మందరపర్వతాన్ని ఒంటి చేయితో లేపాలని చూసే వాని లాగా,

కాలకూట విషము త్రాగి బ్రతకాలి అని అనుకునే వాని లాగా, సూదితో కళ్ళు పొడుచుకొనే వాని లాగా, మంగలికత్తిని నాలుకతో నాకే వాని లాగా, గుదిబండను మెడకు కట్టుకొని సముద్రములో ఈద పయత్నించు వానిలాగా, భగభగ మండే నిప్పుకణాన్ని వస్త్రములో మూట కట్టుకొను వానిగా కనపడుతున్నావు.

Also read: సీతమ్మ కంటబడిన మాయలేడి

‘‘నీకూ రామునికీ నక్కకూ సింహానికి ఎంత భేదమో అంత. రాముడు సముద్రము, నీవు బోడి కాలువ. రాముడు బంగారము, నీవు సీసము. రాముడు క్షీరము, నీవు కడుగునీరు. ముడు మంచి గంధము, నీవు వట్టి బురదవు. రాముడు ఏనుగు, నీవు పిల్లివి. రాముడు గరుడుడు, నీవు ఒక కాకివి. నన్ను అపహరించటము ఈగ వజ్రాన్ని మింగటము లాంటిది. అది వజ్రాన్ని ఇముడ్చుకోగలదా?’’

ఇలా ఆ దుష్ట రావణునితో మాట్లాడుతూ గాలికి ఊగే అరటిచెట్టు లాగా శరీరము వణికి పోతూ తీవ్రమైన వ్యధ చెందింది సీతమ్మతల్లి.

Also read: మారీచుని చంపుతానని బెదిరించిన రావణుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles