Saturday, November 23, 2024

బహుజన రాజ్యాధికారంతో ఎస్సీలకేంపని?

“పూనా వడంబడిక వల్ల ఎస్ సి లకు  జనాభాను బట్టి  రాజకీయ రిజర్వేషన్లు వచ్చాయి కదా! అలా  పొందుతున్న మీకు బహుజన రాజ్యాధికారంతో ఏం పని?” అనే ప్రశ్నను బి. ఎస్. రాములు  సంధించాడు. ఈ ప్రశ్న జవాబు కోసం పూనా ప్యాక్ట్ దగ్గరకి నుండి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం

డాక్టర్ అంబేద్కర్ కూడా 1932 సెప్టెంబర్ 24 న జరిగిన పూనా ఒప్పందాన్ని అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రత్యేకంగా కేటాయించిన నియోజవర్గాలలో  ఎస్సీ అభ్యర్థులను ఎన్నుకుంటు న్నారు.  కానీ  అంబేద్కర్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో, “వయోజన ఓటింగ్ ద్వారా షెడ్యూల్ కులాలకు ఉమ్మడి నియోజకవర్గాలు కాక, తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే విధంగా ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి”అని డిమాండ్ చేశారు. ఆ క్రమంలోషెడ్యూల్ కులాల వారికి కమ్యూనల్ అవార్డును బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.  దీన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ ఎరువాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్ష ఫలితమే కమ్యూనల్ అవార్డు స్థానములో పూనా పాక్టు వచ్చింది.

దళితేతర ఓట్లు కీలకం

అయితే రిజర్వుడు స్థానాలలో  ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నిక కావటంలో దళితుల ఓట్ల కంటే కూడా దళితేతర ఓట్లే కీలకం అవుతున్నాయి. అదే సమయంలో టికెట్ ఇస్తున్న పార్టీ నాయకుడి కను సన్నల్లో మెలగవలసి రావటంతో తమ వర్గాల ప్రయోజనాల కోసం నిలబడటం లేదా పోరాటం చేయడానికి దళిత ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదు.

కాబట్టే పార్లమెంటులో 120 పైబడి ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఉన్నప్పటికీ వారు స్వతంత్రంగా మాట్లాడిన పాపాన ఇంతవరకూ పోలేదు. అందువల్లనే ఆవలింత వచ్చినప్పుడే నోరు తెరుస్తారనే చలోక్తి వారిపై వేయబడింది. ఈ విధంగా వారు ‘చెంచా యుగం’లోకి తోసి వేయబడ్డారు. ఇది పూనా ప్యాక్ట్ ప్రభావం.

కాన్సీరాం ప్రయోగం

ఇప్పుడు బహుజన రాజ్యాధికార సిద్ధాంతంతో రాజకీయాలు ప్రారంభించిన కాన్సిరాం ప్రయోగాన్ని పరిశీలిద్దాం. ఆయన కార్యచరణ వల్ల చాలా రాష్ట్రాలలో బలమైన పార్టీగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎదిగింది. కానీ 2007లో మాత్రమే బ్రాహ్మణులతో ఒప్పందం వంటి ప్రత్యేక సందర్భంలో మాత్రమే ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ స్వతంత్రంగా అధికారంలోకి రాగలిగింది.  ఆ తరువాత 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 22 శాతం ఓటింగ్ పొందినప్పటికీ ఒక ఎంపీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 12 శాతం ఓట్లకు తగ్గి కేవలం ఒక సభ్యుని మాత్రమే గెలుచుకోగలిగింది.

 బహుజన సమాజ్ పార్టీ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కూడా 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని 17 రిజర్వుడు స్థానాల్లో రెండింటిని మాత్రమే గెలుచుకున్నది. అంటే రిజర్వ్ స్థానాల్లో కూడా బీఎస్పీ గెలవలేక పోతున్నది. అలాగే, అంబేద్కర్ మరణాంతరం మహారాష్ట్రలో ఏర్పడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ పీఐ) గాని , బీహార్ లోని పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి గాని ఏదో ఒక అగ్రకుల పార్టీతో ఒప్పందం చేసుకుని కొన్ని సీట్లలో గెలవగలుగుతున్నారు.  ఇటీవల వీసీకే పార్టీ కూడా డీఎంకే సహకారంతో తమిళనాడులో కొన్ని సీట్లలను గెలిచింది. మొత్తంగా పరిశీలించినప్పుడు అగ్రకుల లేదా శూద్ర రైతాంగ కులాల పార్టీల లాగా స్వతంత్రంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఇసుమంత కూడా కనబడటం లేదు. మరి ఎందుకని ఎస్సీల నాయకత్వంలో ఉన్న పార్టీలు ఇతర పార్టీల లాగా స్వతంత్రంగా రాష్ట్రాలలో అధికారంలోకి రాలేకపోతున్నాయి? అనేదాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

షెడ్యూల్డ్ కులాల ప్రతికూలాంశాలు

భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ తరగతికి లేని వ్యతిరేకంశాలు షెడ్యూల్ కులాల వారికి మాత్రమే ఉన్నాయి. అగ్రకులాల వారు సంఖ్యాబలం రీత్య తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వారికి ఉన్న భూములు, ఫ్యాక్టరీలు, సంపద వల్ల రాజకీయ ఆధిపత్యాన్ని చలాయించగలుగుతున్నారు. అలాగే ముస్లింలు జాతీయ ఉద్యమ కాలంలో బలమైన వర్గంగా ముందుకు వచ్చి తమ ప్రత్యేక హక్కులనే కాక దేశాన్ని కూడా సాధించుకున్నారు. ఇప్పటికీ  కశ్మీర్ వంటి రాష్ట్రంలో ముస్లింలే ముఖ్యమంత్రి అవుతున్నారు.  హైదరాబాదు వంటి నగరంలో పాతబస్తీలో ఎంఐఎం లాంటి పార్టీ ఎదురులేకుండా గెలుస్తున్నది.

ఇక దేశ జనాభాలో 50 శాతంగా ఉండే శూద్ర కులాల్లో  రైతాంగ  కులాలు చాలా రాష్ట్రాలలో రాజకీయ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. కానీ  వృత్తి శూద్ర కులాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. ఇక షెడ్యూల్ తెగల విషయానికొస్తే వారు అటవీ ప్రాంతాలలో  ఒకే దగ్గర నివసిస్తూ  ఉంటారు. అందువల్ల  స్వయంపాలిత ప్రాంతంగా ప్రకటించటం, మా గూడెంలో/తండాలో మాదే రాజ్యం అని నినాదంలో భాగంగా వారికి ప్రత్యేక పంచాయతీలు కేటాయించే అవకాశం కలిగింది. వారు మెజారిటీగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో షెడ్యూల్ తెగల వారే ముఖ్యమంత్రి అవుతున్నారు. కానీ ఇలాంటి  అవకాశాలు షెడ్యూల్ కులాలకు లేవు.  జనాభా పరంగా, ప్రాంతాల పరంగా చూసినా గాని సామాజిక మైనార్టీలుగా ఉంటారు. బీసీ కులాలకు ఉండే సంఖ్యాధిక్యమైన వెసులుబాటు వీరికి లేదు. పైగా వీరి సమస్య రాగానే గ్రామంలో అన్ని కులాలు ఒకటైపోతాయి.  ఎస్సీ కులాల నాయకత్వాన్ని ఇతర కులాలు దాదాపుగా అంగీకరించటం లేదు. ఈ విధంగా  అన్ని విషయాలలో విపక్షకు గురవుతున్నారు. ఇటువంటి  వారికి పూనా  ప్యాక్ట్   ద్వారా 10 సంవత్సరాలకి ఉద్దేశించబడినటువంటి రాజకీయ రిజర్వేషన్లు, ఏ లక్ష్యం కోసమైతే ఇచ్చారో, ఆ ఉద్దేశాలు  నెరవేరాయా? నెరవేరకపోతే అందుకు గల కారణాలు ఏమిటి?  నెరవేరాలంటే ఏం చేయాలి? అనే విషయములో ఇంతవరకు ఎలాంటి శాస్త్రీయమైన చర్చ జరగ లేదు.

ఎన్నికల విధానంలో మార్పులు  ఆవశ్యకత

 కానీ పాలక పార్టీలు మాత్రం రిజర్వేషన్లను పొడిగించుకుంటూ వస్తున్నాయని భారతీయ ఎన్నికల వ్యవస్థ పై విశ్లేషణాత్మక “అంబేద్కర్, గాంధీ, పటేల్. భారత ఎన్నికల వ్యవస్థ రూపకల్పన”అనే పరిశోధనాత్మక పుస్తకం రాసిన ఉండ్రు రాజశేఖర్ (IAS) అంటున్నారు. అదేవిధంగా తమ ప్రతినిధులుగా ఎన్నిక కాబడ్డవారు, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఏ విధంగా, ఎంత సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారనే అంశం పై  కూడా చర్చ జరగటం లేదు.

కాబట్టి ఇప్పటికైనా అల్పసంఖ్యాక వర్గాలకు నిజమైన శాసన నిర్ణయాధి కారంలో భాగస్వామ్యం కల్పించబడే విధంగా ఎన్నికల విధానంలో మార్పులు జరగాలి.  ప్రత్యేకించి వారి నుంచి డైరెక్ట్ గా (ప్రత్యక్షంగా) ఎన్నికయ్యే విధంగా ఎన్నిక విధానం ఉండాలి. ఇందుకోసం రాజ్యసభను, శాసన మండలిని ఉపయోగించాలి. ఇంతవరకు ఈ రెండు సభలు ప్రత్యేక తరగతులు, నిపుణులు పేరుమీద అగ్రకులాలే 100 శాతం ఎన్నిక చేయబడుతున్నారు. అలా కాకుండా అల్పసంఖ్యాక కులాలు తమ ప్రతినిధులను పంపేందుకు వీలు ఉండే విధంగా మార్పులు తేవాలి. ఇంతవరకు శాసనమండలికి ఎన్నికవుతున్న టీచర్లు, గ్రాడ్యుయేట్స్ అనేవారు అనగారిన వర్గాల వారు ఏమీ కారు. అలాగే రాజ్యసభకు ఎన్నికవుతున్న నిపుణులు కూడా అణగారిన తరగతులు చెందినవారు కారు. కాబట్టి మన  రాజకీయ ప్రాతినిధ్య విధానం మరింతగా విజయవంతం కావాలంటే ఇప్పుడు పేర్కొన్న మార్పులను చేపట్టాల్సి ఉంది. అప్పుడే ఆ వర్గాల  సమస్యల పరిష్కారానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది.

డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు

(రచయిత మొబైల్: 9959649097)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles