Saturday, November 23, 2024

మారీచుని చంపుతానని బెదిరించిన రావణుడు

రామాయణమ్ – 73

 ‘‘నేను ఒకప్పుడు వేయి ఏనుగుల బలముతో, పర్వతమంత ఆకారముతో సంచరిస్తూ మునుల ఆశ్రమాల మీదకు దండుగా వెళ్లి వారివారి యజ్ఞాలను భంగము కావిస్తూ ఉండేవాడిని.

‘‘ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమములో కలిగిన అనుభవము చెపుతాను విను.

‘‘ఆ మహర్షి ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేయ సంకల్పించి యాగరక్షణార్ధము దశరథ మహారాజు వద్దకు వెళ్లి ఆయన కొడుకును తనతో పంపమన్నాడు. అందుకు ఆ రాజు ‘వీడింకా పసిబాలుడు, నా చతురంగబలాలు తీసుకొని నేనే వస్తాను’ అని అన్నాడు. అందుకు మహర్షి నిరాకరించి, ‘‘నా యజ్ఞ విధ్వంసానికి పూనుకునే రాక్షసులు సామాన్యులుకారు, వారిని వధించాలంటే రాముడొక్కడే శరణ్యము కావున రాముని పంపు’’ అని ఆయనను ఒప్పించి పసిబాలుడైన రాముని తెచ్చుకుని కాపలా పెట్టుకున్నాడు.

Also read: రావణుడికి మారీచుడి హితబోధ

 రాముడికి  అప్పటికింకా పసితనపు చాయలు పోలేదు. విశాలమైన నేత్రాలు, శోభాసంపన్నుడు అయిన రాముడికి మీసము కూడా మొలవలేదు. ఒకటే వస్త్రము చుట్టుకొని, జుట్టుముడిపెట్టుకొని బంగారుమాల ధరించి, చిత్రముగా ఉన్న ధనస్సును చరుచుకుంటూ ఆశ్రమ వాకిట అటూఇటూ తిరుగుతున్నాడు.

‘‘నేను అప్పుడు మహర్షి ఆశ్రమము లోపలికి ప్రవేశిస్తూ ఉండగానే నన్ను గమనించి ఏ మాత్రమూ తొట్రుపాటు, భయమూ లేకుండా ధనస్సుకు నారి కట్టాడు. ఆ! వీడేమిచేస్తాడు బాలుడు అని లక్ష్యపెట్టక తొందరగా విశ్వామిత్రుడి యజ్ఞవేదిక వద్దకు వెళ్ళాను. అప్పుడు నాకు గుర్తు. ఒకేఒక్క బాణము రయ్యిన దూసుకుంటూ వచ్చి నన్ను నూరు యోజనముల దూరములోనున్న సముద్రములో పడవేసినది.

‘‘ఎందుకు దయతలచాడో కానీ నాకు తెలవదు. నన్ను మాత్రము ప్రాణాలతో విడిచిపెట్టాడు. సముద్రములో పడ్డ నేను కొంతసేపటికి తేరుకొని బ్రతుకుజీవుడా అని లంకకు చేరుకున్నాను.

Also read: సీతాపహరణానికి రావణుడిని ప్రేరేపించి పంపిన శూర్ఫణఖ

అప్పటికి రాముడు అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకొని యుండలేదు. ఈ మధ్య కాలములో జరిగిన సంఘటన ఒకటి చెపుతాను విను.

‘‘మనవాళ్ళు ఇద్దరితో కలిసి ఒక క్రూరమైన మృగ రూపము ధరించి అడవిలో మునులను భయపెడుతూ సంచరిస్తున్నాను నేను. భార్యా, తమ్ముడితో కలిసి అడవిలో రాముడు ఉండటము చూశాను. వాళ్ళను చూడగానే పూర్వము నాకు జరిగిన అవమానము గుర్తుకు వచ్చి వారిని భక్షించాలని తలచి మెల్లగా వారి ఆశ్రమము ప్రాంతములోనికి  చేరుకున్నాము.

‘‘ఎట్లా పసిగాట్టాడో పసిగట్టాడు రాముడు మూడు బాణాలు ధనస్సుకు తొడిగాడు అవి మాకోసమే అని అర్ధమయ్యి అవి ధనుస్సు నుండి వెలువడేలోగానే నేను తప్పించుకున్నాను. పాపము వారిరువురికీ రాముడి బాణము గురించిన జ్ఞానము లేకపోవటము చేత వాటి బారినపడి మృతులయ్యారు.

Also read: రావణాసురిడిని తూలనాడిన శూర్పణఖ

‘‘కాబట్టి రావణా, హాయిగా సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖ్ఖాన ఎందుకు పెట్టుకుంటావు? నీవాళ్ళంతా రకరకాల ఉత్సవాలు చేసుకుంటూ రోజూ ఆనందముగా ఉంటున్నారు. వారికి ఆ ఆనందము కలకాలము ఉండేటట్లు చూడు. నిష్కారణముగా రాముడికి అపకారము చేసి ఆయన కోపానికి గురి అయ్యి మొత్తము రాక్షస జాతినే ఎందుకు పాడు చేసుకుంటావు?’’ అని పలికాడు మారీచుడు.

మరణించబోయేవాడికి ఇచ్చిన ఔషధములవలె, చవిటి నేలలో వేసిన విత్తనములవలె మారీచుడి హితోక్తులు నిష్ఫలమైపోయాయి.

రావణుడు రాముడి పట్ల అభిప్రాయమేమీ మార్చుకోలేదు. పైగా అతడు మానవమాత్రుడు. నన్నేమీ చేయజాలడు అన్నట్లుగా పరుషముగా మాట్లాడాడు.

ఖరుడి హత్యకు ప్రతీకారముగా ఆతడి భార్యను ఎత్తుకొని రావలసిందే అని పట్టుబట్టాడు.

Also read: సీతను రావణుడు అపహరించాలని అకంపనుడి వ్యూహం

‘‘నేను చేయాలనుకున్న పని యొక్క గుణ దోష విచారము చెయ్యి అని నిన్ను అడుగలేదు. రాజుతో మాటలాడే పద్ధతి తెలియకున్నది. దోసిలి ఒగ్గి అతనికి ప్రతికూలము కాని హితకరములైన విషయాలను వినయముగా, మృదువుగా చెప్పవలె!  ఎంత హితకరములైనా గౌరవము లేకుండా తిరస్కార బుద్ధితో  చెప్పినచో రాజు హర్షించడు. రాజు అనగా అయిదుగురు దేవతల తేజోంశలు కలగలసినవాడు. అగ్ని,ఇంద్ర, వరుణ, యమ, చంద్ర అంశలవి. నీవు ఆ జ్ఞానము కోల్పోయి నీ ఇంటికి సహాయము నిమిత్తము స్వయముగా వచ్చిన నన్ను అవమానిస్తున్నావు. ఇది మంచిదా, లేక చెడ్డదా, నాకు ఈ పని చేయగల సామర్ధ్యమున్నదా లేదా అని నేను నిన్ను అడుగలేదు. నేను తలపెట్టిన ఈ మహా కార్యమునకు నీ సహాయము అత్యంత ఆవశ్యకము. కావున నీవు చేసి తీరవలె!

 ‘‘ఇది నా ఆజ్ఞ!

‘‘నీవు చిత్రవిచిత్ర వర్ణములగల బంగారు లేడి రూపము ధరించు. ఆ లేడి వంటి మీద వెండి చుక్కలు మెరుస్తూ ఉండాలి సుమా! వారి ఆశ్రమ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షించు. నిన్ను చూసి ఆవిడకు ఆశ్చర్యము కలుగవలె. నిన్ను పట్టితెమ్మని ఆవిడ రాముని  పంపుతుంది. నీవు అతనిని ఆశ్రమానికి బహు దూరముగా తీసుకొని పోయి “అయ్యో లక్ష్మణా, అయ్యో సీతా” అని అరుపులుకూడా అరువు.

అది విని  సీత లక్ష్మణుని రాముని కొరకు పంపగలదు. వారిరువురూ ఆ విధముగా దూరముగా వెళ్ళిన పిదప అనాయాసముగా ఆమెను నేను ఎత్తుకొని రాగలను.

Also read: ఖర,దూషణాదులను యమపురికి పంపిన రాముడు

‘‘మారీచుడా, నీవు ఈ పని చేసినట్లైన ఎడల నా రాజ్యములో సగ భాగము నీకిచ్చెదను. ఆలస్యముచేయక  బయలుదేరు. నీ వెనుక రధముపై కూర్చుండి నేను అనుసరిస్తాను. ఈ విధముగా రాముని వంచించి యుద్ధము చేయకుండగనే సీతను పొంది కృతకృత్యుడనై లంకకు తిరిగి వెళ్ళెదను. నా ఆజ్ఞకు విరుద్ధముగా నీవు చేసినట్లైనచొ ఇప్పుడే నిన్ను చంపి వేస్తాను. రాజుకు ప్రతికూలముగా ఉండేవాడు సుఖముగా అభివృద్ది చెందజాలడు. నీచే బలాత్కారముగా నైనా ఈ పని చేయిస్తాను . నీ ఇష్టాయిష్టములతో నాకు పని లేదు. నీవు రాముని వద్దకు వెళ్ళినచో మరణించవచ్చును లేక మరణించకపోవచ్చును.  కానీ నాతొ విరోధము పెట్టుకుంటే తక్షణమే మరణిస్తావు. కావున నీకేది మంచిదో ఆలోచించి నిర్ణయించుకో!’’

అని బెదిరించాడు రావణుడు!

Also read: పెద్ద సేనతో రాముడిపై యుద్ధానికి బయలుదేరిన ఖరుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles