— డా౹౹ ఎన్. గోపి
ఇవాళ
మా ఊరు ఊరిలో లేదు
తప్పిపోయింది.
నిన్నమొన్నటి దాకా
ఇక్కడే వుండేది
ఇప్పుడు కనపడుట లేదు.
వెతకటానికి బయల్దేరాను
ఎక్కడని వెతకను
పొలాల కోసం చూస్తే వాటి
ఆనవాళ్లు కూడా లేవు
వీధుల పోలికలు
తుడి చేసిన గీతల్లా వున్నాయి
మా అమ్మా నాన్నల సమాధులు
ఇక్కడే వుండాలి.
ఎన్నెన్ని జ్ఞాపకాలు!
వాటికి ఆస్కారమే లేదు.
ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు
కనిపిస్తున్నారు గాని
వారి వెర్రి చూపులను
దీకోడ్ చేయ్యడం కష్టం!
ఎటు చూసినా సిమెంటు దారులు
రోడ్ల వ్రణాలపై కదిలే
కార్ల కీటకాలు,
రోడ్డు మలుపు తిరిగే చోట
బడా బాబుల వంకర బుద్ధులు,
జవనాశ్వాల్లా లేస్తున్న భవనాలు,
అణగారిన బతుకుల ఎముకల్లా
అక్కడక్కడ తేలిన రాళ్లు,
వేగమే లక్ష్యమై
ఆగమాగమైన జీవితాలు
ఎటు చూసినా విధ్వంస క్రీడ
ఒక మృత్యుసౌందర్యం
బైపాస్‌ల పేరుతో
పాములు చుట్టి ముట్టినప్పుడే
అనుమాన మొచ్చింది.
ఇప్పుడిక రింగు రోడ్ల పేరిట
కొండ చిలువలు జొర్ర వడ్డప్పుడు స్పష్టమైంది.
అభివృద్ధి గొడ్డళ్ల కింద
మా ఊరు ముక్కలయ్యింది.
తరతరాల నుండి
సౌభాగ్య సీమగా
తరలి వచ్చిన మా ఊరు
తప్పి పోవడం కాదు
చచ్చిపోతుంది.
ఇప్పుడు నేను ఏ ఊరు లేని వాణ్నయ్యాను
అయ్యా!
కాస్త ధర్మం చేయండి.
Also read: ఒక రోజు
Also read: ప్రేమ తత్త్వం
Also read: పరామర్శ
Also read: గ్రంథోపనిషత్
Also read: శీలా వీర్రాజు స్మృతిలో..