- బాంబే హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన సుప్రీం
- సాయిబాబాను దోషిగా నిర్దారించింది తీవ్రమైన ఆరోపణలని వివరణ
- గృహనిర్బంధానికి సైతం అంగీకరించని అత్యున్నత న్యాయస్థానం
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా జైలులోనే కొనసాగాలని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. శుక్రవారంనాడు బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ సాయిబాబానూ, మరి అయిదుగురు నిందితులనూ విడుదల చేయాలని చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శనివారంనాడు సస్పెండ్ చేసింది. చాలా ఘోరమైన నేరాలకు సాయిబాబా శిక్ష అనుభవిస్తున్నారనీ, ఆయనను విడుదల చేయడానికి వీలు లేదనీ సుప్రీంకోర్టు బెంచ్ నిర్ణయించింది. ఈ బెంచ్ లో జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదీ ఉన్నారు.
శుక్రవారంనాడు బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అత్యవసరంగా అప్పీలు చేసుకున్నది. ఉపాచట్టం కింద అరెస్టు చేసి, నేరస్థుడుగా నిర్ధారించిన వ్యక్తిని విడుదల చేయడం తొందరపాటు చర్య అవుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఇది అత్యవసరం అంటున్నారు కనుక శనివారం సెలవు దినమైనప్పటికీ పిటిషన్ ను విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. నిందితులకు నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. అంటే అంత అత్యవసరంగా కేసును విచారించవలసిన అవసరం లేదని అత్యున్నత స్థానం భావించిందని అనుకోవాలి.
తన క్లయంట్ తొంభైశాతం దుర్బలుడైన అంగవైకల్యంతో బాధ పడుతున్నారనీ, విడుదల చేయడం సాధ్యం కాకపోతే కనీసం గృహనిర్బంధంలో ఉంచాలని సాయిబాబా తరఫు సీనియర్ న్యాయవాది బసంత్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయనకు శిక్ష వేసింది చాలా తీవ్రమైన నేరారోపణ మీదననీ, జైలులో ఉండటమే అవసరమనీ సుప్రీంకోర్టు చెప్పింది. ప్రొఫెసర్ సాయిబాబాను 2014 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. గడ్చిరోలీ సెషన్స్ కోర్టు సాయిబాబాను దోషిగా నిర్ధారించి మార్చి 2017లో జీవిత కారాగార శిక్ష విధించింది. ఉపా చట్టం కింద నేరం చేసినట్టు రుజువుచేసే సాక్ష్యాధారాలు లేవనీ, సాయిబాబా నిర్దోషి అనీ బాంబే
హైకోర్టు నిర్ధారించి సాయిబాబానూ, మరి అయిదుగురినీ విడుదల చేయాలని ఆదేశించింది. ఒక జర్నలిస్టు, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక విద్యార్థి ఈ అయిదుగురిలో ఉన్నారు. సాయిబాబాతో పాటు ఆ అయిదుగురు కూడా జైలులోనే కొనసాగుతారు.