Thursday, November 21, 2024

హిందీపై తిరుగుబాటు బావుటా

  • ఐచ్ఛికంగా హిందీ నేర్చుకుంటున్నారు
  • బలవంతంపెడితే బెడిసి కొడుతుంది
  • త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే బాగుండేది

హిందీ భాషను దేశమంతా బలవంతంగా రుద్దే ప్రయత్నం, చదువుల్లో రుబ్బే యత్నం జరుగుతున్నాయనే ప్రచారం పెరిగిపోతోంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాల నాయకులు మండిపడుతున్నారు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, తెలంగాణలో ఈ వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలను విరమించాలంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానికి లేఖ కూడా రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ ముఖ్యనేత కె టీ ఆర్, కమ్యూనిస్ట్ పార్టీ నేతలు హిందీ వ్యతిరేక స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు. కేంద్ర హోం శాఖా మంత్రి అధ్యక్షుడుగా ఉండే అధికార భాషా సంఘం హిందీ అమలుపై పలు ప్రతిపాదనలు చేసింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు ఇటీవలే అందజేశారు. ఈ వార్త పలు ప్రాంతాల్లో అగ్గి రగులుస్తోంది. ఒకప్పుడు హిందీకి వ్యతిరేకంగా ఉద్యమం జరిగినట్లే మళ్ళీ ఆ దిశగా కొందరు ముందుకు దూకే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ అలజడి మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల్లోని కర్ణాటక బిజెపి పాలనలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉంది. మిగిలిన మూడు రాష్ట్రాల్లో పాలనలో ఉన్నది బిజెపియేతర పక్షాలు కావడం గమనార్హం. హిందీయేతర రాష్ట్రాలలో హిందీని బలవంతంగా రుద్దాల్సిన అవసరం ఏముందన్నది వీరి వాదన. హోం శాఖా మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్రపతికి సమర్పించిన నివేదిక ఇంకా అధికారికంగా బహిర్గతం కాలేదు.

Also read: ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అంటే మాటలా?

రుద్దడం లేదని అంటున్న భర్తృహరి

అవగాహన లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశ్యంతో  తప్పుడు సమాచారంతో ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయని కమిటీ ఉపాధ్యాక్షుడు భర్తృహరి మండిపడుతున్నారు. హిందీని రుద్దే ప్రయత్నం చేయడం లేదని, ఆ యా రాష్ట్రాలలో ఉండే వాడుక శాతన్ని బట్టి హిందీని అమలుచేస్తామని ఆయన అంటున్నారు. స్థానిక భాషల ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గదని భర్తృహరి చెబుతున్నారు. నిజంగా అలా జరిగితే మంచిదే. ఐఐటీ, ఐఐఎం వంటి కేంద్ర విద్యాలయాల్లోనూ, సాంకేతిక విద్యలోనూ హిందీని విద్యార్ధులపై రుద్దడం, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ హిందీ ప్రాముఖ్యతను పెంచడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. దేశంలో రాజకీయంగా పట్టు సాధించడానికి, హిందీ మాట్లాడే ప్రజలను గంప గుత్తంగా  ఆకర్షించడానికి చేసే దుష్టప్రయత్నమని కొందరు వాదిస్తున్నారు. నిజానికి హిందీ అమలు అంశం ఈనాటిది కాదు. గాంధీ,నెహ్రు కాలం నుంచీ ఉంది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా హిందీ పక్షపాతాన్ని చూపించాయన్నది పచ్చినిజం. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పైచేయి సాధించడానికి భాషలను కూడా పార్టీలు వాడుకుంటున్నాయన్నది అక్షర సత్యం. హిందీ అమలును వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో గతంలోనూ పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో  ‘త్రిభాషా సూత్రం’ కూడా అమలులోకి వచ్చింది. అంతర్జాతీయ భాష ఇంగ్లిష్, జాతీయ భాష హిందీ,  స్థానిక /మాతృభాష మూడు కలుపుకొని త్రిభాషా సూత్రాన్ని అప్పటి ప్రభుత్వాలు రచించాయి.

Also read: సౌర విద్యుత్తుకు అపారమైన అవకాశాలు

తెలుగు రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం త్రికరణశుద్ధిగా అమలు

ఉత్తరాదిలో ఎలా ఉన్నప్పటికీ, దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, మలయాళ రాష్ట్రాల్లో ఈ సూత్రాన్ని పూర్తి స్థాయిలో పాటించారు. తమిళనాడు, కర్ణాటకలో ఆ స్థాయిలో అమలు కాలేదు. కానీ, దక్షిణ భారత హిందీ ప్రచార సభను మద్రాసులోనే స్థాపించారు. ఈ కేంద్రం ద్వారా మిగిలిన రాష్ట్రాలతో పాటు తమిళులు కూడా హిందీని బాగానే నేర్చుకున్నారు. భాషా దురభిమానాలు అటుంచగా పలు భాషలను నేర్చుకోవడం తప్పు కానే కాదు. భారతీయమైన హిందీ భాషను నేర్చుకోవడం అస్సలు తప్పు కాదు. బలవంతంగా రుద్దడం, మిగిలిన భాషలను తక్కువగా చూడడం, మిగిలిన భాషీయులకు తక్కువ ప్రయోజనాలు కల్పించడం, కేవలం హిందీవారికే అన్నింటా అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఏ మాత్రం సమంజసం కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఉన్న విద్యా విధానాన్ని గమనిస్తే ఇంగ్లీష్, హిందీకి దక్కిన గౌరవానికి లోటే లేదు. ఉద్యోగాలు, ఉపాధి పేరుతో మాతృభాషకు జరిగే హాని పెరుగుతోంది. ప్రస్తుత అంశానికి వస్తే, ఇంగ్లిష్ కు కూడా ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నాలు మొదలవుతున్నాయానే విమర్శలు వస్తున్నాయి. మాతృభాష, దేశంలో  ఎక్కువమంది మాట్లాడే హిందీని విస్మరించడం సరియైనది కాదు. అదే సమయంలో అంతర్జాతీయంగా ఎంతగానో ఉపయోగపడే ఇంగ్లిష్ భాషను తక్కువ చేయాలని చూస్తే అది ఏ మాత్రం సరియైన విధానం కాదు. స్థూలంగా చెప్పాలంటే ‘త్రిభాషా సూత్రం’ అమోఘమైంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే నేడు అధికారంలో ఉన్న బిజెపికి హిందీ రాష్ట్రాలు గుండెకాయ వంటివి.

Also read: జీ-ట్వంటీలో మన గళం

రాజకీయ ప్రయోజనాలే ప్రధానమా?

నేడు హిందీకి ప్రాముఖ్యతను పెంచేలా బిజెపి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అందులో రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నది దాచలేని సత్యం. కర్ణాటకలో తప్ప మిగిలిన అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ బిజెపి ఇంకా వెనుకబడే ఉంది. ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. ఈ ప్రాంతాల్లో పట్టు సాధించాలంటే ఇక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. మనోభావాల్ని కించపరచే నిర్ణయాలు తీసుకుంటే ఏ పార్టీయైనా రాజకీయంగా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. కేంద్రం కొత్త విద్యా విధానాన్ని కూడా అమల్లోకి తెచ్చింది. ఇందులోనూ మాతృభాషకు పెద్దపీట వేస్తున్నారు. అది అభినందనీయం. స్థానిక భాషలకు ప్రాధాన్యాన్ని ఇస్తూనే ఇంగ్లిష్ పై పట్టు వచ్చేలా చూడడం అంతే ముఖ్యం. పాఠశాల విద్య వరకూ మాతృభాషకు ప్రాముఖ్యతను ఇవ్వడం మంచిదే. ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్యవైపు చేసే ప్రయాణంలో ఇంగ్లిష్  చాలా అవసరమైన భాష. ఎక్కువ పుస్తకాలు ఇంగ్లిష్ లోనే ఉంటాయి. ఉపాధి రీత్యా ప్రపంచ స్థాయిలో ఇంగ్లిష్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాంకేతిక /ప్రొఫెషనల్ కోర్సులను స్థానిక భాషల్లో, హిందీలో అందించేంత జ్ఞాన భాండాగారం మన దగ్గరలేదన్నది వాస్తవం. దక్షిణాదివారు హిందీని నేర్చుకున్నట్లే ఉత్తరాదివారు దక్షిణాది భాషలను నేర్చుకోవడం ఉత్తమం. తద్వారా సాహిత్యం, సంస్కృతి పరంగా జ్ఞానవినిమయం జరుగుతుంది. భారతదేశం భిన్న భాషలు, సంస్కృతుల సంగమం. బహుళత్వమే మనదైన సౌందర్యం. ఐకమత్యాన్ని పదికాలాల పాటు కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. భారతీయతను కాపాడుతూ మన జ్ఞాన సంపద బహుముఖంగా వికాసం చెందే దారులు వెతకడం కూడా ఏలికల బాధ్యత.

Also read: కె సీ ఆర్ జాతీయ విన్యాసం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles