ఫొటో రైటప్: జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా
- హిజబ్ పిటిషన్లపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తీర్పుల వైరుధ్యంతో కాలయాపన
- అకడెమిక్ సంవత్సరం వృథా కాకుండా ముస్లిం యువతులకు న్యాయం చేయాలి
విద్యాలయాలలో విద్యార్థినులు హిజబ్ ధరించవచ్చునా, లేదా అనే అంశంపైన సుప్రీంకోర్టు ద్వైదీభావం వెలిబుచ్చింది. ఇద్దరు న్యాయమూర్తుల పీఠం రెండు పూర్తి భిన్నమైన అభిప్రాయాలను గురువారంనాడు వ్యక్తి చేసింది. కర్ణాటకకు చెందిన విద్యార్థినుల పిటిషన్ల దొంతరపైన వ్యాఖ్యానిస్తూ జస్టిస్ సుధాంశుధూలియా ఫిబ్రవరి 5వ తేదీన కార్ణాటక ప్రభుత్వం హిజబ్ ధరించడంపైన నిషేధం విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రశ్నించారు. జూనియర్ కళాశాలలకు చెందిన ముస్లిం విద్యార్థినులు తలకు హిజబ్ పేరుతో గుడ్డ కట్టుకొని రావడం కాలేజి యూనిఫాంకు భంగం కలిగించడమేనంటూ కర్ణాటక ప్రభుత్వం అభిప్రాయపడింది. దీన్ని జస్టిస్ ధూలియా తప్పుపట్టారు. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉండాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, జస్టిస్ హేమంత్ గుప్తా కర్ణాటక ప్రభుత్వంతో పూర్తిగా ఏకీభవించారు. ‘ఏక రూపతను ప్రోత్సహించడంకోసం, మత ప్రమేయం లేని లౌకిక వాతావరణాన్ని క్యాంపస్ (విద్యాలయ ఆవరణలో) పెంపొందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని ఉంటుందని జస్టిస్ గుప్తా వ్యాఖ్యానించారు. ఇద్దరు న్యాయమూర్తుల తీర్పులలోని వైరుద్ధ్యం ఈ అంశంలోని సంక్లిష్టతకు అద్దం పడుతోంది. విద్యాలయాలలో ఏకరూపత ఉండేందుకు యాజమాన్యాలు ప్రయత్నించడం పొరబాటా? ఏ మతానికి చెందినవారైనా తమ మత సంప్రదాయాలకు విద్యాలయాలలో పాటించకూడదా? మత సంప్రదాయాలను పాటించే స్వేచ్ఛాస్వాంతంత్ర్యాలు స్వతంత్ర భారత దేశంలో లేవా? అసలు హిజబ్ విధిగా ధరించాలనే నిబంధన ఇస్లాంమతంలో ఉన్నదా? ఇటువంటి సున్నితమైన అంశాలపైన పిటిషనర్ల తరఫు న్యాయవాదులూ, ప్రభుత్వం తరఫు న్యాయవాదులూ గట్టిగా వాదించారు.
ఈ కేసులో తమకు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించే వ్యక్తిగత స్వేచ్ఛ విద్యార్థినులకు ఉన్నదా లేదా అన్నదే ప్రధానాంశమని జస్టిస్ ధూలియా అన్నారు. ఏది ఏమైనా విద్యార్థినులకు విద్య ప్రధానమనీ, దానికి ఆటంకం కలిగించే హక్కు ప్రభుత్వాలకు లేదనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఒక బాలికకు స్కూలుకు వెళ్ళి చదువుకోవడానికి ఇప్పటికే ఉన్నఅనేక పరిమితులనూ, ఇబ్బందులనూ, సంప్రదాయక అవరోధాలనూ దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని పరిశీలించాలని జస్టిస్ ధూలియా అన్నారు. నిజమే. ఒకే కుటుంబంలోని కుమారుడినీ, కుమార్తెనూ చదువు విషయంలో ఒకే విధంగా చూడరు. కుమారుడిని చదివిస్తాడు. ఎందుకంటే వాడు వంశోద్దారకుడు అంటారు. కుమార్తెను చదివించేందుకు అంతగా ఆసక్తి చూపరు. ఎందుకంటే ఆమె ఎంత చదివినా ఒక అయ్య చేతిలో పెట్టవలసిందే, ఈ ఇల్లు విడిచి వేరే ఇంటికి వెళ్ళేదే అనే భావన తల్లిదండ్రులను కుమార్తె చదువుపట్ల ఆసక్తిరహితంగా తయారు చేస్తుంది. ఒక ఆడపిల్ల స్కూలుకు వెళ్ళాలంటే పురుషాధిక్య సమాజంలో అనేక సమస్యలు. ఈ సమస్యలు అన్నిటికీ తోడు ప్రభుత్వం హిజబ్ ధరించడంపైన నిషేధం విధించడం అంటే అదనంగా కొత్త నిర్బంధాన్ని విధించినట్టు అవుతుందని జస్టిస్ ధూలియా అభిప్రాయం.
ఇస్లాం మత ఆచారాల ప్రకారం హిజబ్ ధరించడం తప్పనిసరి కాదంటూ కర్ణాటక హైకోర్టుల లోగడ ఆడపిల్లల పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపడుతూ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుకుంటూ కర్ణాటక యువతులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ గుప్తా కర్ణాటక హైకోర్టు మార్చి 15న ఇచ్చిన తీర్పును పూర్తిగ సమర్థించారు. ఈ వ్యవహారంలో మతం ప్రధానం కాదన్నది జస్టిస్ గుప్తా అభిప్రాయం. నిరుడు డిసెంబర్ 27 కర్ణాటకలోని ఉడిపి జిల్లాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముస్లిం విద్యార్థినులు హిజబ్ ధరించి వస్తే వారిని లోపలికి అనుమతించలేదు. వారు ఇళ్ళకు వెళ్ళిపోయారు. దాంతీ దీనికి మతం రంగు వచ్చింది. వివాదం చెలరేగింది. కర్ణాటకలోని అన్ని జిల్లాలలో హిజబ్ ధారణను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూనిఫాంలకు భంగం కలిగించే విధంగా, శాంతిభద్రలకు విఘాతం కలిగించే విధంగా, మతభావనలు రేకెత్తించే విధంగా, సమానత్వానికి భంగం కలిగించే విధంగా దుస్తులు ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించాలంటూ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం పొరబాటంటూ జస్టిస్ ధూలియా అభిప్రాయం వెలిబుచ్చారు. బిజో ఇమ్మాన్యుయెల్ కేసులో 1986లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆయన తన అభిప్రాయానికి ఊతంగా ఉటంకించారు. కోర్టు ఎదుట ఉన్న ప్రశ్న విద్యార్థినులు తమకు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించడానికి అవసరమైన స్వేచ్ఛ కలిగి ఉన్నారా లేదా అన్నదే అంటూ జస్టిస్ ధూలియా అంతిమంగా తేల్చి చెప్పారు. కేవలం హిజబ్ ధరిస్తున్నారనే కారణంగా విద్యార్థినులకు అందుబాటులో విద్య లేకుండా చేయడం సమంజసమా, కాదా అనే విషయం కోర్టు పరిశీలించాలని ఆయన అన్నారు.
భారత దేశంలోని ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని జస్టిస్ సచార్ కమిటీ స్పష్టం చేసింది. అందులోనూ ముస్లిం మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించడం తక్కువ. ఇప్పుడిప్పుడే కర్ణాటక వంటి అభివృద్ది చెందిన రాష్ట్రాలలో ముస్లిం యువతులు చదవుకుంటున్నారు. విద్యార్థినులు చదువుకోవడం వల్ల వారి హక్కులు ఏమిటో వారికి తెలుస్తాయి. వాటి సాధనకోసం ఏ విధంగా పోరాడాలో నేర్చుకుంటారు. అంతే కాని వారు హిజబ్ ధరించాలని పట్టుపడుతున్నారు కనుక వారు మతఛాందసుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని కర్ణాటక ప్రభుత్వం వ్యాఖ్యానించడం దూకుడుగా ఉంది. అన్ని విధాలా సౌకర్యాలు కలిపించి చదువుకోవడంలో ముస్లిం యువతులను ప్రోత్సహించవలసిన సమాజం హిజబ్ సాకుతో వారి చదువుకు అంతరాయం కలిగించడం న్యాయమా అన్నదే కోర్టుల ముందైనా, సమాజం ముందైనా, ప్రభుత్వాల ముందైనా, విద్యాసంస్థల ముందైనా ఉన్న ప్రశ్న. ముస్లిం విద్యార్థినుల హిజబ్ ధరించి వస్తే మిగిలినవారికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? ముస్లిం విద్యార్థినులు అడిగినట్టు సిక్కులు తలపాగా ధరించి రావడాన్ని అనుమతిస్తున్నాం. హిందూ మతానికి చెందిన విద్యార్థినులు తిలకం పెట్టుకొని రావడాన్ని ఆమోదిస్తున్నాం. అదే విధంగా తమకూ తమ మతం చెప్పినట్టు హిజబ్ ధరించే స్వేచ్ఛ ఉండాలని వారు కోరుకుంటున్నారు.
ఇప్పుడు బెంచ్ లో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులూ రెండు భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చుతూ తీర్పులు ఇచ్చారు. కనుక సమస్య పరిష్కారానికి మరో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలి. అదేదో త్వరగా జరగాలి. యువతులకు అకడెమిక్ సంవత్సరం నష్టం జరగకుండా అత్యవసరంగా న్యాయపరిష్కారం చేయవలసిన అగత్యం ఉంది.