Wednesday, December 18, 2024

మహాత్మాగాంధీ ప్రస్థానం

‘మహాత్మాగాంధీ’ పుస్తకానికి ముందుమాట

సత్యనిష్ఠ, క్రమశిక్షణ, నిగ్రహం, స్థిరచిత్తం, ఆత్మపరిశీలన, పరివర్తన, స్వపరిపాలన మహాత్మాగాంధీలో కొట్టవచ్చినట్టు కనిపించే లక్షణాలు. ఆయన ఆత్మకథ ‘మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్’ చదివినవారికి ఈ చిన్ని పుస్తకం ప్రయోజనం తేలిగ్గా అర్థం అవుతుంది. గాంధీ పోరుబందరులో అందరిలాగే పుట్టాడు. ఇతరుల మాదిరే పెరిగాడు. అందరూ చేసే తప్పులే చేశాడు. ఇతరులలో చాలామందికి లేనిదీ, గాంధీకి ఉన్నదీ ఏమిటంటే దిద్దుబాటు స్వభావం. తప్పులు ఎన్ని చేసినా పర్వాలేదు చేసిన తప్పు మళ్ళీ చేయకండా ఉంటే అదే పదివేలు అంటారు పెద్దవాళ్ళు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూత్రాన్ని కొద్ది సవరణలతో గాంధీజీ పాటించారు. ఇంట గెలుస్తూనే రచ్చ గెలిచే ప్రయత్నం చేశాడు. అంతర్మథనంలో తనతో తాను పోరాడుతూనే బయటి నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక, అహంకారం మూర్తీభవించిన శక్తులతో పోరాడారు. తనలో ఉన్న బలహీనతలను అధిగమిస్తూ బలవంతులైన ప్రత్యర్థులతో తలపడ్డారు. ఇందులో విజయం సాధించడానికి తోడ్పడిన లక్షణాలలో ముఖ్యమైనవి చిత్తశుద్ధి, మాటతప్ప కూడదనే నియమం, తనలో తప్పులు గమనించి వాటిని దిద్దుకునే మానసిక సంసిద్ధత. ఆధిపత్య ధోరణిపైన తిరుగుబాటు స్వభావం.

గాంధీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను గమనిస్తే ఒక క్రమానుగతమైన ఎదుగుదల కనిపిస్తుంది. ఒక మనిషి కొండంత ఎత్తు ఎదిగి మహామనీషిగా పరివర్తన చెందిన తీరు గమనించవచ్చు. ప్రతి చర్యలో తిరుగుబాటు ధోరణి కావచ్చు, దిశానిర్దేశం చేసే ఉద్దేశం కావచ్చు, నీతిపాఠం చెప్పే విధానం కావచ్చు, సత్యపాలన కావచ్చు స్పష్టంగా కనిపిస్తాయి. గాంధీజీ జీవితం తెరచిన పుస్తకం. ఆయన జీవితం గురించి తెలిసినవారికి ఈ చిరుపుస్తకం ఒక మార్గదర్శిగా ఉపయోగిస్తుంది.

పదమూడు సంవత్సరాలకే కస్తూర్బాతో వివాహం జరిగింది. సముద్రం దాటకూడదనే తన సామాజికవర్గం నాయకుల ఆదేశాన్ని ధిక్కరించి విద్యాభ్యాసం కోసం  లండన్ వెళ్ళాడు. దానిని మొదటి ధిక్కారంగా పరిగణించవచ్చు. లండన్ నుంచి వచ్చి వకీలుగా ప్రాక్టీసు మొదలు పెట్టి అది సవ్యంగా సాగకపోవడంతో ఒక ముస్లిం యజమానికి సేవ చేసేందుకు దక్షిణాఫ్రికా వెళ్ళారు. అక్కడ భారత సంతతి ప్రజల కష్టాలను కళ్ళారా చూసి చలించిపోయాడు. వారి హక్కులకోసం పోరాడాలని అనుకున్నారు. ఆ దేశం వెళ్ళి ఆ దేశంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. హరిలాల్, మణిలాల్, రామదాస్, దేవదాస్ లను కన్నారు. బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. పాత్రికేయం ప్రజాసేవలో ప్రధానమైన సాధనమని గుర్తించిన గాంధీ ‘భారతీయ స్ఫూర్తి’ ప్రథమ సంచిక వెలువరించారు. మరుసటి సంవత్సరం ఫీనిక్స్ సెటిల్ మెంట్ నెలకొల్పారు. 34వ ఏట బ్రహ్మచర్యం స్వీకరించారు. ఎంపైర్ థియేటర్  నల్లజాతి వ్యతిరేక చట్టం పట్ల నిరసన ప్రదర్శించిన సందర్భంలో సత్యాగ్రహ ప్రక్రియ ఆలోచనకు బీజం పడింది.  తన బంధువు మఖన్ లాల్ గాంధీ మాటవరుసకు అన్న ’సదాగ్రహం’ అన్న మాటను సవరించి దానిని ‘సత్యాగ్రహం’గా ఖాయం చేశారు. లండన్ లో ప్రవాస భారతీయులతో సమాలోచనలు జరిపి భారత్ లో సంభవిస్తున్న పరిణామాలను సమీక్షించారు. స్వాతంత్ర్య సముపార్జన అసాధ్యమనే తీరులో కొంతమంది మాట్లాడారు. స్వాతంత్ర్య సాధనకు మార్గం ఏమిటో వివరిస్తూ ‘హింద్ స్వరాజ్’ అనే పుస్తకాన్ని గుజరాతీలో రాశారు. లండన్ లో ఓడ ఎక్కి దక్షిణాఫ్రికాలో దిగే వరకూ పుస్తకం రాయడం పూర్తయింది. దాన్ని ‘ఇండియన్ ఓపీనియన్’ అనే వారపత్రికలో ధారావాహికగా ప్రచురించారు. దాన్ని పుస్తకంగా ప్రచురించి బొంబాయికి పంపుతే అన్ని ప్రతులనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హింద్ స్వరాజ్ ను స్వయంగా ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ‘ఇండియన్ హోమ్ రూల్ ’ అన్న పేరుతో పుస్తకం వేసి తనకు ఇష్టమైన  రచయిత టాల్ స్టాయ్ కి పంపించారు. ప్రపంచం అంతటా ఆ పుస్తకానికి మంచి పేరు వచ్చింది. భారత స్వాతంత్ర్య సమరానికి గాంధీ ప్రణాళిక ఆ పుస్తకంలో ఉంది. గాంధీ జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో టాల్ స్టాయ్ తో పాటు జాన్ రస్కిన్ (అన్ టు ది లాస్ట్) ఒకరు.

దక్షిణాఫ్రికాలో టాల్ స్టాయ్ ఫాంను ఏర్పాటు చేశారు. నాలుగేళ్ళ తర్వాత లండన్ వెళ్ళి గోపాకృష్ణ గోఖలేని కలుసుకున్నారు. మరుసటి సంవత్సరం గాంధీ భారత్ కు తిరిగి వచ్చారు. జవహర్ లాల్ నెహ్రూను మొట్టమొదటిసారి గాంధీ కలుసుకున్నారు. పట్నా వెళ్ళి చంపారన్ లో నీలిమందు రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆచార్య కృపలానీ, బాబూ రాజేంద్ర ప్రసాద్ తో కలసి పని చేశారు. అక్కడే సంత్ రౌత్ అనే కార్యకర్త గాంధీని మొట్టమొదటిసారిగా బూపూ (తండ్రీ) అని సంబోధించాడు. మహాత్మా అని కూడా అన్నాడు. దాన్ని అనంతరం రవీంద్రనాథ్ టాగూర్ ధృవీకరించారు. సబర్మతి ఆశ్రమం ప్రారంభించారు. మహదేవ్ దేశాయ్ గాంధీకి కార్యదర్శిగా చేరారు. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల పక్షాన పోరాటంలో ఆమరణ నిరాహారదీక్ష పూనారు. రాజీ కుదరడంతో దీక్ష విరమించుకున్నారు.

అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటంలో సత్యాగ్రహాన్నీ, నిరాహారదీక్షనూ సాధనాలుగా వినియోగించుకున్నారు. రాజీకి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం గాందీలోని ప్రత్యేకత. అంబేడ్కర్ తో పుణెలో ముఖాముఖి పోరాటం జరిపే  క్రమంలో ఎరవాడ జైలులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. అంబేడ్కర్ తో సమాలోచన జరిపి రాజీకి అంగీకరించి దీక్ష విరమించారు. రాజీ అంటే పరాజయం కాదు. ఒక మెట్టు దిగడం. ఆచరణ సాధ్యమైన పరిష్కారానికి అంగీకరించడం.  రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం పాటించారు. జాతీయ హర్తాళ్ చేశారు. అరెస్టయినారు. జలియన్ వాలాబాగ్ లో నరమేథం జరిగింది. నవజీవన్ పత్రిక మొదటి సంచిక విడుదలయింది. యంగ్ ఇండియా తొలిసంచిక విడుదల చేశారు.

గాంధీ భారతీయులలో నిరుపేదల ఆహార్యం లాగే తాను కూడా కొల్లాయి కట్టడం ప్రారంభించారు. హంటర్ కమిషన్ ను కాంగ్రెస్ బహిష్కరించింది. సహాయనిరాకరణ ఉద్యమం ఆరంభించారు. చౌరీచౌరాలో ప్రజలు పోలీసులపై తిరుగుబాటు చేశారు. 23మంది పోలీసులూ, ముగ్గురు పౌరులూ మరణించారు. ఈ పరిణామంతో దగ్భ్రాంతి చెందిన గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులంతా దిగ్భ్రాంతి చెందారు. యంగ్ ఇండియాలో మూడు వ్యాసాలు ప్రచురించినందుకు గాంధీపై దేశద్రోహం కేసు పెట్టి ఆరేళ్ళు జైలు శిక్ష విధించారు. యరవాడ జైలుకు తరలించారు. రెండేళ్ల తర్వాత బేషరతుగా విడుదల చేశారు. మతసామరస్యం కోసం మౌలానా మొహమ్మద్ అలీ నివాసంలో 21 రోజులు నిరాహారదీక్ష చేశారు. గాంధీ ఆత్మకథ ‘మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్’ ప్రచురించారు. సైమన్ కమిషన్ ను బహిష్కరించారు. జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ లో జరిగిన ఏఐసీసీ సమావేశం ‘పూర్ణ స్వరాజ్’ తీర్మానం చేసింది. ఆ ఉద్యమం ఊపందుకోలేదు. గాంధీ దండి యాత్ర చేసి ఉప్పు సత్యాగ్రహం పతాక సన్నివేశంగా ఉప్పు తయారు చేసి వలసపాలకుల నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో స్వాంతంత్ర్య ఉద్యమానికి మళ్ళీ ఊపు వచ్చింది. మరోసారి గాంధీని అరెస్టు చేసి యరవాడ జైలుకు పంపించారు. కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రతినిధిగా రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  రొమేయిన్ రోలాండ్ ని కలుసుకున్నారు. వాటికన్ సందర్శించారు. రోమ్ వెళ్ళి ముస్సోలినీని కలుసుకున్నారు. సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభించాలని కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించింది. వెంటనే గాంధీని అరెస్టు చేసి యరవాడ జైలుకు పంపించారు. అప్పటికే ఆ జైల్లో వల్లభ్ భాయ్ పటేల్ ఉన్నారు. దళితులకు ప్రత్యేక ఓటింగ్ హక్కు ఉండాలన్న అంబేడ్కర్ వాదనను నిరసిస్తూ గాంధీ ఆమరణ దీక్ష ప్రారంభించారు. ‘పూనా ప్యాక్ట్’ పేరుతో రాజీసూత్రానికి అంగీకరించారు. అది జరిగిన ఆరు రోజులకే ‘హరిజన్ సేవక్ సంఘ్’ ను నెలకొల్పారు. వెంటన్ ‘హరిజన్’ పేరుతో ఇంగ్లీషులోనూ, ‘హరిజన్ సేవక్’ పేరుతో హిందీలోనూ, ‘హరిజన్ బంధు’ పేరుతో గుజరాతీలోనూ పత్రికలు ప్రారంభించారు. దళితులను కలుసుకోవడానికై ఉద్దేశించిన ‘హరిజన్ యాత్ర’ను దేశమంతటా ప్రారంభించారు. బిహార్ లో యాత్ర చేస్తూ ఉండగా దుండగులు దాడి చేశారు. ఒడిషాలో పాదయాత్ర చేశారు.  ట్రావన్కోర్ దేవాలయంలో హరిజనులకు ప్రవేశం కల్పించారు. ముస్లింలు గాంధీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. గాంధీ హిట్లర్ కి లేఖ రాశారు. సేవాగ్రాంలో ఏఐసీసీ సమావేశం జరిగింది. వ్యక్తి సత్యాగ్రహాలు చేయవచ్చునని తీర్మానించింది. వినోబాభావేని మొదటి వ్యక్తి సత్యాగ్రాహిగా గాంధీ నియమించారు. కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించింది. గాంధీని మరోసారి అరెస్టు చేసి ఆగాఖాన్ ప్రాసాదంలో ఉంచారు. మహదేవ్ దేశాయ్ మరణించారు. రెండేళ్ళ తర్వాత కస్తూర్బా అస్తమించారు. చర్చల కోసం గాంధీని లార్డ్ వేవల్ ఆహ్వానించారు. ముగ్గురు బ్రిటిష్ ప్రతినిధులు దిల్లీ వచ్చి కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారు. వైస్రాయ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. నౌఖాలీలో మతకలహాలు జరిగాయి. అక్కడికి గాంధీ ప్రయాణం. చెప్పులు కూడా లేకుండా పాదయాత్ర. వైస్రాయ్ మౌంట్ బాటన్ తో సమావేశం. దేశ విభజన పథకానికి కాంగ్రెస్, ముస్లింలీగ్, సిక్కుల అంగీకారం.  ఈ మేరకు కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానం. స్వాతంత్ర్యసిద్ధి. నెహ్రూ అర్ధరాత్రి ప్రసంగం. మతకలహాలు జరిగిన ప్రాంతాలలో గాంధీ పర్యటన. స్వాతంత్ర్యం వచ్చి నాలుగు మాసాలు గడవగానే జనవరి 20 నాడే గాంధీజీ ప్రార్థనా సమావేశంపై బాంబు దాడి. ఆ తర్వాత పది రోజులకు దిల్లీ బిర్లామందిర్ లో ప్రార్థనకు వచ్చిన గాంధీపై నాథూరాం గాడ్సే పిస్తోల్ తో మూడు సార్లు కాల్చగా అస్తమయం. కుమారుడు రాందాస్ చేతుల మీదుగా యమునా నదీతీరంలో అంతిమసంస్కారం. తేదీలన్నీ పుస్తకంలో ఉన్నాయి. చిన్న పుస్తకానికి పెద్ద పరిచయం అనవసరం అనిపించి విస్తరించడం లేదు.

గాంధీజీ జీవితంలోని  తేదీలకూ, స్వాతంత్ర్య పోరాటంలోని ఘట్టాలకూ దగ్గరి సంబంధం ఉంది. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చినప్పటికి కాంగ్రెస్ పార్టీని స్థాపించి మూడు దశాబ్దాలు జరిగిపోయాయి. అంతవరకూ పరిస్థతి స్తబ్దుగా ఉంది. గాంధీ వచ్చిన వెంటనే పోరాటం ప్రారంభించి మూడు దశాబ్దాలలో స్వాతంత్ర్యం సాధించారు.

గాంధీ వల్ల కాదు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నలిగిపోవడం వల్ల మనకు స్వాతంత్ర్యం ఇచ్చిందని కమ్యూనిస్టులు వాదించవచ్చు. గాంధీని హత్య చేయడం వల్ల దేశానికి ఉపకారం చేశాడని గాడ్సేకి భారతరత్న బిరుదు ఇస్తున్నట్టు హిందూ మహాసభ ప్రతినిధులు ప్రకటించవచ్చు. కానీ గాంధీ జీవితం తెలుసుకున్నవారికీ, ఈ చిన్న పుస్తకంలో తేదీలను పరిశీలించినవారికి గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే, మతసామరస్యం కోసం ఎట్లా ఆరాట పడ్డారో, హిందూమతోద్ధరణకు ఎంత ప్రయాసపడ్డారో, దళితుల సంక్షేమానికి ఎంతగా పాటుపడ్డారో స్పష్టంగా తెలిసిపోతుంది. గాంధీనీ, నెహ్రూనీ పూర్వపక్షం చేయాలనే ప్రయత్నాలకు సమర్థమైన సమాధానం ఈ పుస్తకం. భావితరాలకు గాంధీ జీవితం, ఆయన పోరాటం, ఆయన పరివర్తన చెందిన తీరూ, స్వాతంత్ర్యం సాధించిన పద్దతీ పరిచయం చేయడం ఈతరం బాధ్యత. అటువంటి ప్రవిత్రమైన కర్తవ్య నిర్వహణలో కృతకృత్యులైనందుకు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికీ, జి. కోటేశ్వరప్రసాద్ గారికీ, ఎన్.ఆర్. తపస్వి గారికీ, ఇతర మిత్రులకీ హృదయపూర్వక అభినందనలు.

Also read: గాంధీమార్గమే శరణ్యం

(అక్టోబర్ 2, గాంధీ జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles