Sunday, December 15, 2024

రాముడి పాదాల చెంతకు చేరిన భరతుడు

రామాయణమ్51

భరతుడు చిత్రకూట పర్వతం సమీపించాడు. అతని సైన్యము చేసే కోలాహలమునకు వన్యప్రాణులు బెదిరిపోసాగినవి. భరతుడు తన సైన్యంలోని వారికి ఆజ్ఞలు జారీ చేశాడు సీతారామలక్ష్మణుల జాడ కనుగొనమని. అందరూ తలకొక దిక్కుగా జట్లుజట్లుగా వెదుకుట ప్రారంభించారు. వారికి ఒక చోట నుండి పొగపైకి లేస్తూ కనపడ్డది. జనులు నివసించనిచో పొగ ఎట్లా ఉంటుంది? అది ఎవరో ఒక తాపసి ఆశ్రమమో లేక రాముడి నివాసమో అయి వుంటుంది. అని నిర్ధారణకు వచ్చి సైన్యమంతటిని ఉన్న చోటనే నిలిపి వేసి తాను  వశిష్ఠ సుమంత్రులతో కూడి ముందుకు వెళ్ళాడు భరతుడు.

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యంలో సేద తీరిన భరతుడి సేన

చిత్రకూట పర్వత శోభలు వర్ణింపనలవిగాకుండా ఉన్నవి. ఆ పర్వతం మీద నివాసముండటం వలన తాను ఎంతో సంతోషంగా అందరనీ మరచిపోయి ఉండగలుగుతున్నానని రాముడు సీతతో చెపుతున్నాడు. ఇద్దరూ హాయిగా ప్రకృతిని చూసి పరవశిస్తూ నడుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అందమైన ప్రాంతాలను ఇంద్రుడు శచీదేవికి చూపిస్తున్నట్లుగా చూపిస్తూ ఆనందంగా విహరిస్తున్నారు ఇరువురూ.

‘‘సీతా అటుచూడు నిర్మల మందాకినీ జలాలు చూడు. ఇదుగో ఇటు చూడు ఈ పద్మమాలికలు చూడు. ఎవరో కాముకులు నలిపివేసినట్లున్నదికదా. అదిగో ఆ చక్రవాకపక్షి కూతలు విను ఎంత మంగళప్రదంగా మధురంగా ఉన్నవో కదా!

Also read: గంగానదిని దాటిన భరతశత్రుఘ్నులు, పరివారం

‘‘సీతా రా నాతో కలిసి జలక్రీడలాడుదువుగాని.  ఈ మందాకినీ నదిలోని ఎర్రనైన, తెల్లనైన పద్మాలన్నీ నీ జలక్రీడలతో నలిగిపోవాలి సుమా! సీతా అందమైన ఈ చిత్రకూటమే అయోధ్య. ఇందులోని మృగాలే పౌరులు. ఈ మందాకినిని  సరయూనదిగా భావిస్తూ  నీవూ లక్ష్మణుడు తోడుంటే ఎన్ని యుగాలైనా ఇక్కడే గడిపేస్తాను.’’

ఇలా ఆనందంగా విహరిస్తూ ఆవిడను అనునయిస్తూ ‘‘ఇదిగో ఇది రుచిగా ఉన్నది,ఇదుగో ఇది బాగా కాలింది’’ అని మాంసము తినిపిస్తూ పర్వత శిఖరంపై కూర్చున్నాడు రాముడు.

ఇంతలో ఆయనకు భరతుడి సేన చేసే కలకలధ్వనులు వినపడ్డాయి. ఆ సేనలోని అశ్వ, గజముల పదఘట్టనకు రేగిన ధూళి ఆకాశాన్ని కప్పి వేస్తూ కనపడ్డది. సైన్యం సృష్టించిన అలజడికి అడవిలోని మృగాలన్నీ భయంతో పరుగెత్తుతూ వికృతంగా అరుస్తున్నాయి.

అప్పుడు రాముడు లక్ష్మణునితో అదేమిటో చూడమని చెప్పాడు. లక్ష్మణుడు వెంటనే ఒక సాలవృక్షాన్ని ఎక్కి నలుదెసలా పరీకించి చూశాడు… ఉత్తరము వైపు చూస్తూనే మహోగ్రంగా ‘‘అన్నా!

నీవు అగ్నిని చల్లార్చు. సీతమ్మను గుహలోకి భద్రముగా పంపివేయి.

కవచముధరించు! ధనుర్బాణాలను సిద్ధంచేసుకో’’ అంటూ అరిచాడు.

‘‘లక్ష్మణా ఎందుకంత ఆవేశం! ఆ సేన ఎవరిదో సరిగా చూడు’’ అని రాముడన్నాడు.

‘‘ఇంకెవరిది ఆ కైక కొడుకు భరతుడిది! మనల్నిద్దరినీ చంపివేయటానికే ఇంతసేనతో ఇక్కడికి వస్తున్నాడు. అదిగో కోవిదారధ్వజము స్పష్టముగా కనపడుతున్నది.

Also read: భరతుడినీ, సైన్యాన్నీ చూసి గుహుడికి గుబులు

‘‘ఓ మహావీరా లే! మనమిరువురమూ ధనుస్సులు ధరించి పర్వతము పైకెక్కుదాము. ఎవడి మూలంగా నీవు రాజ్యభ్రష్టుడవైనావో ఆ భరతుడు వధార్హుడే, చంపివేద్దాము ఇప్పుడే. అన్నా త్వరగా లే’’ అంటూ గావుకేకలు పెడుతున్నాడు లక్ష్మణుడు.

‘‘వాడితో పాటు కైకను కూడా చంపేస్తాను భూమిపై ఉన్న పాపము నేటితో తుడిచిపెట్టుకు పోతుంది. వాడి సైన్యాన్నంతా చీల్చి చెండాడతాను. ఈ చిత్రకూటమంతా రక్తపుమడుగులలో మునిగిపోవాల్సిందే ఈ రోజు,’’ అంటూ ఆవేశపడుతున్నాడు లక్ష్మణుడు.

కోపంగా ఉన్న లక్ష్మణుడిని చూసి రాముడు శాంతంగా, ‘‘వచ్చేది భరతుడే అయినప్పుడు ఇంక ధనుస్సుతో, కత్తితో, డాలుతో పని ఏమున్నది? లక్ష్మణా తండ్రిమాట నిలుపుటకు అడవికి వచ్చిన నేను నేడునను చూడవచ్చిన భరతుని చంపి అపకీర్తి మూటకట్టుకోమంటావా!. బంధు నాశనము, మిత్రనాశనము వలన కలిగిన  సంపదలు నాకు విషపుకూడుతో సమానము. నా తమ్ములైన మీ అందరూ సుఖించి ఉండలేని రాజ్యము నాకెందుకు? నిజానికి నేను రాజ్యము కోరేది మీ అందరినీ సుఖంగా ఉంచడానికి మాత్రమే. నేను తలుచుకొంటే సముద్రపర్యంతమైన ఈ భూమిపై ఆధిపత్యము లభించటం ఎంతసేపు? అధర్మమువలన వచ్చిన ఇంద్రపదవికూడా నేను స్వీకరించను.

Also read: రాముణ్ణి వనవాసం మాన్పించి అయోధ్యకు తీసుకురావాలని భరతుడి నిర్ణయం

‘‘లక్ష్మణా! నీవూ, భరతుడు, శత్రుఘ్నుడు అనుభవించలేని ఏ సుఖం నాకు కలిగినా దానిని కాల్చి బూడిదచేస్తాను. మీ మువ్వురితో కలిసి ఉండటంలోనే నాకు సుఖమున్నది! భరతుడు ఎలాంటి వాడనుకొన్నావు? భరతుడి గురించి ఇంతగా శంకిస్తున్నావు కదా! వాడు ఎప్పుడైనా నీకు ఇసుమంతైనా అప్రియము చేసినాడా? తాతగారి ఇంటి వద్దనుండి తిరిగివచ్చి జరిగిన విషయము తెలుసుకొని తల్లిపై కోపించి మనలను తిరిగి తీసుకు వెళ్ళడానికే వస్తున్నాడు తప్ప మనమీద కత్తిదూయటానికి కాదు. అయినా ఏ మూర్ఖుడైనా తండ్రినీ తోడబుట్టిన వారినీ చంపుకుంటాడా?  భరతుడు మనసులో కూడా మనగురించి అప్రియముగా ఆలోచించలేడు.

‘‘నీవు రాజ్యము కోసమే ఈ విధముగా మాట్లాడుతుంటే భరతుడు రాగానే ఆ రాజ్యమేదో నీకే ఇవ్వమని చెపుతాను. భరతుడు మహదానందంగా ఇస్తాడు. నీవే ఏలుకుందువుగాని. ఇంకెప్పుడూ భరతుని విషయములో నీవు అప్రియముగా మాటాడరాదు. భరతుని అంటే నన్ను అన్నట్లే’’ అని రాముడు లక్ష్మణుని మందలించగా తన శరీరములోనికి తానే ముడుచుకొని పోయినట్లుగా కుంచించుకొనిపోయి సిగ్గుపడుతూ మెల్లగా “అవును భరతుడు మనలను చూచుట కొరకే వచ్చి యుండును” అని పలికాడు లక్ష్మణుడు.

‘‘భరతునితో కలిసి మన తండ్రి కూడా వచ్చి యుండునని తలుస్తున్నాను. ఆయనే మనలను తిరిగి తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడేమో! అదుగో తండ్రిగారి ఉత్తమాశ్వములు. అదిగో శత్రుఞ్జయము అది మన తండ్రిగారి భద్రగజము! కానీ ….ఏలనో శ్వేత ఛత్రము కానరావడం లేదు! లక్ష్మణా నా మనసేదో కీడు శంకిస్తున్నది’’

అని ఈ విధంగాఇరువురూ మాట్లాడుకొంటూ ఉన్నారు.

Also read: భరతుడి వ్యథ, కౌశల్య సమక్షంలో ప్రమాణాలు

అక్కడ భరతుడు తాను, గుహుడు, శత్రుఘ్నుడు మూడు జట్లుగా మారి రాముడి నివాస స్థానం కోసం వెదుక సాగారు. పొగ వచ్చేదిక్కును గమనిస్తూ బయలుదేరారు. సైన్యాన్నంతా దూరంగా నిలిపి వేసి పాదచారులై గాలిస్తున్నారు.

భరతుడికి మనసులో ఒకటే చింత, ఆందోళన! అన్నగారి పాదాలకు శిరస్సును ఆనించి తన కన్నీళ్ళతో అభిషేకిస్తేగానీ ఆయన ఆందోళన సద్దుమణగదు.

వడివడిగా అడుగులు వేస్తున్నాడు.

 ఆయన హృదయస్పందన, అడుగుల సవ్వడి ఒకేరకంగా ఉన్నాయి వాటి ధ్వని రామా రామా అనే విని పిస్తున్నట్లుగా ఉన్నది. అప్రయత్నంగా భరతుని పాదాలు రామ సామీప్యంలోకి ఆయనను నెట్టుకొచ్చాయి.

సుమంత్రుడి మనఃస్థితి, శత్రుఘ్నుడిదీ ,గుహుడిదీ అందరిదే అదే పరిస్థితి! వారి గుండె వేగము హెచ్చింది. రామదర్శనాన్ని వారిలోని అణువణువూ కోరుతున్నది.

అదుగో పర్ణశాల! అక్కడ పడవేసి ఉన్న కట్టెలు, కోసిన పువ్వులు చూశారు. పర్ణశాల మార్గము తెలియడం  కోసమని లక్ష్మణుడు చెట్లకు కట్టిన నారచీరలు గాలికి ఎగురుతున్నాయి. చలికాలంలో  ఉపయోగించడానికి లేళ్ళపేడ, ఆవుపేడ, మహిషముల పేడతో చేసుకొన్నపిడకలప్రోగులు వారికి అక్కడ కనపడ్డాయి.

అక్కడ వీరాసనము వేసుకొని ఇందీవరశ్యాముడు, పురుష శ్రేష్ఠుడు, రాజీవనేత్రుడు, నీలమేఘశ్యాముడు నేలపై కూర్చొని కనపడ్డాడు. ఆయనను చూడగనే ‘‘ఛీ నా జీవితము ఎందుకు? లోకాలను ఏలగలిగినవాడు, మహాకాంతిశాలీ అయిన రాముడు నా వలననే కదా ఇలా కటిక నేలపై కూర్చున్నది. నా మూలముననే కదా ఆయనకు ఇన్ని కష్టాలు’’ అని కనుల నిండా నీరు నింపుకొని ఒక్కసారిగా రాముడి పాదాల వద్ద “అన్నా” అంటూ కూలబడినాడు భరతుడు.

NB

(ఎదుటి వాడి లోని శీల సంపద గుర్తించగలగటం రాముడి ప్రత్యేకత! దశరధుడు కానీ, లక్ష్మణుడు కానీ గ్రహించలేకపోయారు. ఇక సామాన్యుల మైన మన విషయానికి వస్తే !

We are Conscious of our GOODNESS and other’s BADNESS)

Also read: తండ్రి, సోదరుల గురించి తల్లిని ప్రశ్నించిన భరతుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles