Sunday, November 24, 2024

మద్యమా? మానవ మనుగడా?

 (తొలి మద్య వ్యతిరేక కరపత్రాల సంకలనం)

సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఏర్పడిన మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి(2012), రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సహృదయ మిత్ర మండలి(2001), 35 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న  విజ్ఞాన వేదిక (1988) సంయుక్తంగా చేసిన ఒక గొప్ప ప్రయత్నం ఈ కరపత్రాల సంకలనం!

తెలుగులో జరిగిన వ్యసన వ్యతిరేకోద్యమ చరిత్ర గతికి చేయూతని అందిస్తూ, గత ఇరవై ఏళ్ళలో వివిధ సందర్భాలలో అనేకమంది ఆలోచనాపరులు రాసిన మద్య వ్యతిరేక కరపత్రాలని ఒక్కదరికి చేర్చడం నిబద్ధతతో చేసిన దశాబ్దాల ప్రస్థానానికి ఒక శక్తివంతమైన సమిష్టి సాక్ష్యం ఈ పుస్తకం !

మొత్తం దేశంలోనే మొట్టమొదటి సారిగా యావత్ భారతీయ భాషల్లో ఎందులోనూ ఇప్పటిదాకా జరగని విధంగా తెలుగులో ఒక భయంకరమైన అమానవీయ వ్యసనానికి వ్యతిరేకంగా వివిధ సందర్భాలలో ప్రచురించిన ఈ అక్షరాయుధాల్ని ఏర్చి కూర్చి ఒక్క దరికి చేర్చడం చరిత్రాత్మకం. దానిని ధైర్యంగా చేయగలగడం మిత్రమండలికి మాత్రమే సాధ్యమయ్యే సాహసం!

గాంధీ జయంతిని మద్యరహిత దినోత్సవంగా ప్రకటించమనే న్యాయమైన డిమాండ్ మొదలు కొని నూతన సంవత్సరాన్ని మద్యంతో స్వాగతించవద్దనే వరకూ, ఆరోగ్యకర సమాజ స్థాపనకు సహకరించమని విద్యావంతులను అభ్యర్దించడం నుండి మహిళల్ని మద్యం మీద తిరగబడమని పిలుపిచ్చేంత దాకా అనేక విలువైన అక్షరాలకి చక్కని చిహ్నం ఈ ప్రయత్నం!

సమాజ హితైషి కీ. శే. టి.వి.ఎల్. నరసింహా రావు గారికి అంకితం ఇవ్వబడిన ఇందులో, మరో ప్రత్యేకత ఏమిటంటే, తిరుగులేని స్పష్టతతో మత్తుని కలిగించే అవాంఛనీయ పదార్ధాలు అన్నింటినీ మద్యంగా గుర్తిస్తూ జె.వి.వి. మహాసభల తీర్మానపత్రం, అలాగే ‘తాగబోకురోరన్నో తాగబోకురా’ అంటూ నడిచే మద్యపాన వ్యతిరేక గీతం!

ఒక సాధారణ ఉద్యోగిగా ఉంటూనే చివరి వరకు వ్యసనాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్య పర్చడం కోసం స్పందించిన మాష్టారు, చనిపోయే రెండు రోజులు ముందు సతీష్ కి తాను రాసిన బాలల గేయం ఇవ్వడం జరిగింది. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి కట్టుబడిన ఆ పెద్దాయన అక్షరాలే పుస్తక ప్రారంభంలో ఇచ్చిన  ఆకర్షణీయ గేయం!

అంతకంటే ముఖ్యమైన ఆకర్షణ, చివరి వరకూ పిల్లల తోనూ, ప్రజాతంత్ర ఉద్యమాలతోనూ కలిసి ప్రయాణించి ఎన్నో ఉద్యమ సంఘాలకి సానుభూతి పరునిగా ఉంటూ, మరెన్నో ప్రజా పత్రికలకి అద్భుతమైన చిత్రాలు వేసిన మిత్రులు, మంచి సినిమా కార్యకర్త, రచయిత కీ. శే. కరుణాకర్ గారు మరణించే ముందు ప్రేమగా వేసి పంపిన ఆలోచింపచేసే  ముఖచిత్రం!

వ్యసనాలకు వ్యతిరేకంగా జరిగిన ‘నషాముక్తి ఆందోళన్’ దేశ వ్యాప్త యాత్రలో మద్యపాన వ్యతిరేక పుస్తకాన్ని మహోద్యమకారిణి మేధాపాట్కర్ హైదరాబాదులో ఆవిష్క రించడం, రామచంద్రాపురం లో వందలాది మంది సమక్షంలో అసాధారణ రీతిలో జరిగిన మద్యపాన వ్యతిరేక సమితి అర్ద దశాబ్ది ఉత్సవం వంటి ఫొటోలు పుస్తకానికి అదనపు అందం!

ఇన్నేళ్ళ ప్రజా ఉద్యమ పయనంలో సమితి మద్దతుతో ప్రచురించిన పది విలువయిన పుస్తకాల జాబితానూ, వాటిలోని ప్రత్యేకతల్ని పేర్కొంటూ మరీ పుస్తకం చివర్న వరుస క్రమంలో  వివరాలివ్వడం అంటే, పదేళ్ళ తన ప్రస్థానాన్ని తిరుగులేకుండా అక్షరీకరించిన మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి పనిని పునస్సమీక్ష కోసం నిజాయితీగా ప్రజానీకం ముందు పెట్టడం!

 ఎన్నో ప్రత్యేకతలతో కూడిన కరపత్రాలు, బాలల గేయం, మద్య వ్యతిరేక గీతం, పౌరుల్ని, పెద్దల్ని, విద్యార్దుల్ని, యువతని, మహిళల్ని, పాలకుల్ని, శ్రామికుల్ని ఉద్దేశిస్తూ రాసిన అర్ధవంతమైన పదబంధాలు, ఇరువురు ప్రజా ఉపాధ్యాయులకి ఇవ్వబడిన నివాళులు, అసలు ఈ పుస్తకం యొక్క అవసరం పేర్కొంటూ రాసిన ముందు, ముగింపు మాటలు, ఆయా సందర్భాల్ని ఉల్లేఖిస్తూ భద్రపరిచిన ఫొటోలు…ఎవరవునన్నా కాదన్నా అవే నిజానికి ఈ గుచ్ఛానికి ఎదురులేని విశిష్ట పురస్కారం!

అందులో భాగంగా, నేను చేసింది ఏమీ లేకపోయినా అభిమానంగా నన్ను సంపాదకుడిగా ఉండాల్సిందేనని పట్టుబట్టి తన ప్రేమపూర్వక ప్రస్థానంలో భాగం చేసుకున్న సహృదయ మిత్ర మండలి, మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి, విజ్ఞాన వేదికలకు, సోదరుడు సతీష్, పావనీ, సూర్యనారాయణ ఇంకా ఇతర సంఘ సభ్యులు, మిత్రులందరికీ నా వందనం, హృదయపూర్వక అభివందనం!

(అక్టోబర్ రెండున ఆవిష్కరణ కానున్న అమూల్యమైన ఈ పుస్తకమిలా రావడానికి సహకరించిన పెద్దలు, పుర ప్రముఖులు, కార్యకర్తలు, అభి మానులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఆసక్తి ఉన్న మిత్రుల కోసం సాఫ్ట్ కాపీ పంపుతున్నాను. చదివి స్పందిస్తే సంతోషం. సహృదయ మిత్రమండలి, మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి, జన విజ్ఞాన వేదిక తరపునుండి ప్రచురించిన 40 పుటల తొలి మద్య వ్యతిరేక కరపత్రాల సంకలనం “మద్యమా?మానవ మనుగడా?” గురించి ఈ చిన్న రైటప్.)

గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles