తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఆదర్శ అధ్యాపకుడు, శాసనమండలి మాజీ సభ్యుడు చుక్కారామయ్యను తెలంగాణ మంత్రి ఎర్రబల్లి దయాకరరావు, జనగామ ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారంనాడు సన్మానించారు. ఇద్దరు రాజకీయ నాయకుడు విద్యానగర్ లోని రామయ్య స్వగృహానికి వెళ్ళి పాదనమస్కారం చేసి, దుశ్శాలువ కప్పి సన్మానం చేశారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో విలీనమైన రోజును తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతాదినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ సమాజానికి పెద్దదిక్కు అయిన రామయ్యను సత్కరించారు.
చుక్కారామయ్య హైదరాబాద్ లో ఐఐటీ కోచింగ్ ప్రారంభించి వేలమంది విద్యార్థులకు ఐఐటీలో ప్రవేశం లభించడానికి కారకులైనారు. అందుకే ఆయన పేరు ఐఐటీ రామయ్యగా చరితార్థమైంది. తెలంగాణ ఉద్యమంలో ఆయనది గురుతరమైన బాధ్యతాయుతమైన పాత్ర. సీమాంధ్ర ప్రజలను కూడా ఆయన ప్రేమిస్తారు. మానవీయ విలువలకూ, పౌరహక్కులకూ, సమసమాజ స్థాపనకూ దారితీసే విలువలకు కట్టుబడి జీవితం గడుపుతున్న రామయ్య అందరికీ ఆదరణీయుడు. దళిత, ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చి వారిని ఐఐటీలో చేర్పించిన సహృదయుడు చుక్కారామయ్య.