రామాయణమ్ – 41
రాత్రి గడిచింది. అందరికన్న ముందుగా రాముడు నిద్దుర లేచాడు. ప్రక్కకు తిరిగి చూస్తే తమ్ముడు ఇంకా నిద్దుర పోతూనే కనిపించాడు.
సోదరుడిని మెల్లగా తట్టి నిద్రలేపాడు.
లక్ష్మణా! వనంలో సంచరించే ప్రాణుల ధ్వనులు ఎంత మధురంగా ఉన్నాయో విను.
ఇది మరల మనము బయలుదేరే సమయం! త్వరగా ప్రయాణం సాగించాలి.
Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యం, మార్గదర్శనం
అన్నగారిచేత మేలుకొలుపబడ్డవాడయిన లక్ష్మణుడు నిద్రను, బద్ధకాన్ని వదిలించుకొని లేచి యమునలో స్నానం చేసి ప్రయాణ సన్నద్ధుడైనాడు.
వారు మువ్వురూ భరద్వాజ మహర్షి చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ చిత్రకూటం వైపు సాగిపోయారు.
మార్గంలో సీతాదేవికి వనశోభను చూపిస్తూ ‘‘సీతా చూశావా ఈ కింశుకవృక్షాలు! వాటిపూలను అవే మాలలు గ్రుచ్చి వేసుకొన్నట్లుగా ఉంది. ఎర్రటిపూలతో మంటపెట్టినట్లుగా ఉంది. శిశిరం వెళ్లిపోయింది. అందుకే అడవంతా విరగబూసింది. సీతా ఇటు చూడు ఈ భల్లాత(జీడి) వృక్షము. పూలు పండ్లతో భారం మోయలేక వంగిపోయి ఉంది. ఇవి అందించే మధురఫలాలను తినడానికి నరులెవ్వరూ ఇచటలేరు కదా!
‘‘లక్ష్మణా! అదుగో చూశావా ప్రతిచెట్టుమీదా తేనెపట్టు ఉంది. ప్రతి తేనేపట్టు ఎంతో పెద్దగా ఉండి నేలను తాకుతున్నట్లుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా పూలే! నేల అంతా పరుచుకొని రహదారిని కప్పివేసి సున్నితమైన సీతమ్మపాదాలకు రక్షణగా ఉన్నాయవి..
Also read: కల్లోల సాగరమై, తేరుకొని, దృఢమైన రాముడి మనస్సు
వానకోయిలకూస్తుంటే దానికి సమాధానంగా నెమలి క్రేంకారం మనోహరంగా శ్రవణానందకరంగా ఉన్నది. వనమంతా పక్షుల కూజితాలతో సందడిసందడిగా ఆహ్లదకరంగా ఉంది.
ఎదురుగా ఎత్తైన శిఖరాలతో చిత్రకూటం కనపడుతున్నది. దానిమీద గుంపులుగుంపులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి.
‘‘లక్ష్మణా మనోహరమైన ఈ గిరిశిఖరాల మీద ఉండాలనే ఉత్సాహం ఊరిస్తున్నదయ్యా!
‘‘అందాలుచిందించే ఈ చోటు చూడు! కంటికి బహు పసందయిన విందుగావిస్తున్నది. ఈ తరులు, ఈ గిరులు ఎంత రమణీయంగా ఉన్నదో కదా ఈ ప్రదేశం. ఇక్కడే మనం నివాసం ఏర్పరచుకొని సుఖంగా జీవించవచ్చు’’ అన్నాడు రాముడు.
ఆ ప్రదేశంలో ఎందరో మునులు స్థిరనివాసం ఏర్పరచుకొని తాపసవృత్తిలో జీవిస్తున్నారు. వారందరినీ చూశారు వారు.
ముందుగా వాల్మీకి మహర్షి ఆశ్రమం చేరుకొని ఆ మహానుభావుడికి నమస్కరించి వినయంగా నిలుచున్నారు మువ్వురు.
వారి ఆగమనానికి మహర్షి ఆనందించి వారిని తగురీతిగా సత్కరించి కూర్చోమని ఉచితాసనాలిచ్చినాడు.
Also read: గుహుడిని గుండెకు హత్తుకున్న రాముడు
రాముడు తమను తాము మహర్షికి పరిచయం చేసుకొని తమ రాకకు గల కారణాన్ని మహర్షికి తెలిపి, లక్ష్మణుని వైపు తిరిగి “లక్ష్మణా, మనం ఇక్కడ నివసించటానికి యోగ్యమైన ఒక గృహాన్ని నిర్మించవలె!
అందుకు కావలసిన సామాగ్రిని సేకరించుము” అని కోరాడు.
అన్నగారు కోరినదే తడవుగా మంచి దృఢమైన వృక్షశాఖలు తెచ్చి చక్కటి స్థిరమైన పర్ణశాల ఒకటి నిర్మించాడు లక్ష్మణుడు.
మెత్తటి చాపలల్లి విశాలమైన ఆవరణం ఏర్పరచి అన్న ఎదుట సావధాన చిత్తుడై నిలిచాడు.
అందంగా నిర్మింపబడిన ఆ పర్ణశాలను చూస్తూ రామచంద్రుడు, ‘‘లక్ష్మణా ఈ పర్ణశాలలో మనము చాలాకాలము జీవించవలసి ఉంటుంది. కావున ప్రవేశించే ముందు వాస్తుదేవతా శాంతి చేసుకోవాలి. అందు నిమిత్తమై నీవు లేడిమాంసము తీసుకొనిరమ్ము. శాలాపూజ చేసుకుందాము. శాస్త్ర విహితమైన కార్యముకదా!’’
Also read: గంగానదీ తీరం చేరిన సీతారామలక్ష్మణులు
రాముడి నోట మాట వెలువడిన మరుక్షణమే అక్కడ కృష్ణసారము అనే లేడిమాంసం సిద్ధంచేశాడు లక్ష్మణుడు.
ఆ మాంసాన్ని ప్రజ్వరిల్లే అగ్నిలో రక్తముపూర్తిగా తొలగిపోయేటట్లు బాగా కాల్చి పక్వమైనదని తెలుసుకొని, రామునితో, ‘‘రామా! ఇక దేవతాపూజ ప్రారంభించవచ్చు’’ అని తెలిపాడు.
ఒక స్థిరముహూర్తంలో రాముడు శుచిగా నదిలో స్నానం చేసినవాడై విశ్వేదేవతలను, రుద్రుని, విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి వాస్తుశాంతి నిమిత్తమై మంగళములు చేసి నియమానుసారముగా వాస్తుపూజాసమయంలో పఠించవలసిన మంత్రములు స్వయంగా తానే చదివి పర్ణశాలలో ప్రవేశించాడు
లోనికి వెళ్ళగానే ఆయన మనస్సులో అమితమైన ఆనందం కలిగింది.
అంత సీతారామలక్ష్మణులు అడవిలోదొరికే పూలు, పండ్లు కందమూలములు, పక్వమైనమాంసముతో సకల భూతములకు తృప్తికలుగచేశారు.
లక్ష్మణుడుఆపర్ణశాలలోవేదికలు, చైత్యములు, అగ్నిగృహాలు కూడా ఏర్పాటు చేశాడు.
మనోహరమైన చిత్రకూటపర్వత సానువులు, మాల్యవతీ నదీ, రమణీయమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మింపబడిన ఆ పర్ణశాలలో ప్రవేశించగనే అయోధ్యను విడవటం వలన వారిలో కలిగిన దుఃఖం మటుమాయమయ్యింది….
……..
అక్కడ…
రాముడు గంగ దాటిన వైపే వారు కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నిలుచున్న సుమంత్రుడు రాముడు చిత్రకూటము చేరుకున్నాడన్న వార్త తెలిసేవరకు గుహుని వద్దనే ఉండి భారమైన మనస్సుతో ఆనందశూన్యమైన అయోధ్య చేరాడు.
సుమంత్రుని చూడగనే ‘‘రాముడెక్కడ? మా రాముడెక్కడ?’’ అంటూ నగర ప్రజలందరూ ఆయన చుట్టూ గుమికూడి ప్రశ్నలవర్షం కురిపించారు.
Also read: కౌశల్యకు సుమిత్రాదేవి ఉద్బోధ
వూటుకూరు జానకిరామారావు