Sunday, November 24, 2024

భరద్వాజ మహర్షి ఆతిథ్యం, మార్గదర్శనం

రామాయణమ్40

రాత్రి గడిచి తెల్లవారింది. పక్షుల కిలకిలారావాలు, నెమళ్ళక్రేంకారాలు, అడవికోడి కూతలతో అరణ్యంలో సందడిసందడిగా ఉంది. సీతారాములు నిదురలేచారు. మరల నడక సాగించారు.

కొంతదూరము వెళ్ళగనే వారికి పెద్దపెద్ద జలరాశులు కలుసుకున్న చప్పుడు వినపడింది.

ఆ జలతరంగ ఘోషను శ్రద్ధగా ఆలకించారు. వారికి అర్ధమయ్యింది అది గంగా యమునల సంగమక్షేత్రమనీ, అతి దగ్గరలోనే ప్రయాగ కలదనీ.

Also read: కల్లోల సాగరమై, తేరుకొని, దృఢమైన రాముడి మనస్సు

వారు నడుస్తున్న ప్రాంతంలో మనుషులచే విరవబడినట్లుగా కర్రముక్కలు కనపడ్డాయి. తలెత్తి పరీకించి చూసారు. దూరంగా పొగ ఆకాశంలోకి వెడుతూ కనపడ్డది.

ఉత్సాహంగా నడక సాగించారు. ఒక ఆశ్రమ పరిసరప్రాంతాలలో తామున్నట్లు గ్రహించారు. అది భరద్వాజమహర్షి ఆశ్రమము. ఆశ్రమంలో అడుగు పెట్టగానే ధనుర్ధారులైన వారిని చూసి ఆశ్రమంలోని మృగాలు భయపడ్డాయి. వారు మువ్వురూ శిష్య గణంతో శోభిల్లుతున్న భరద్వాజ మహర్షికి వినయంగా నమస్కారములు చేసి తమను తాము పరిచయం చేసుకున్నారు.

Also read: గుహుడిని గుండెకు హత్తుకున్న రాముడు

‘‘మహర్షీ నన్ను రాముడంటారు. దశరధమహారాజు పుత్రుడను. ఈ కల్యాణి

సీత. జనకరాజపుత్రి. అనిందిత. నా సహధర్మచారిణి. ఈతడు నా సోదరుడు లక్ష్మణుడు. నా తండ్రి నన్ను అరణ్యములకు పంపగా తనంతతానే నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు. మహర్షీ! నా తండ్రి ఆజ్ఞమేరకు మేము అరణ్యవాసము చేస్తూ కందమూలఫలములములు  స్వీకరిస్తూ కాలం గడిపెదము’’ అని పలికిన రాముని చూసి,  ‘‘రామా నీ గురించి అంతా విన్నాను. ఎంతో కాలానికి మా ఆశ్రమానికి వచ్చావు. మా ఆతిధ్యం స్వీకరించు’’  అని మధుర ఫలరసాలతో కూడిన కమ్మని ఆహారం ( తాపసులు భుజించేది, అరణ్యంలో లభ్యమయ్యేవి) వారికి అందచేసి వారుండటానికి బస ఏర్పాటు చేశారు భరద్వాజ మహర్షి.

మరల రాత్రి రానే వచ్చింది. ఎంతో దూరము నడచిన అలసట వల్ల సీతారాములు గాఢంగా నిదురించారు.

ఆ రాత్రి తెల్లవారిన పిదప రాముడు మహర్షి వద్ద సెలవు తీసుకొని మహర్షి సూచించిన చిత్రకూటపర్వతం వైపు నడక సాగించారు. ఆ పర్వతము మనోహరమై ఉండి క్రూరమృగ బాధలేని, తాపసులు నివాసముండే ప్రాంతము. అక్కడికి పది క్రోసుల దూరంలో ఉన్నది.

Also read: గంగానదీ తీరం చేరిన సీతారామలక్ష్మణులు

అంతకు ముందు భరద్వాజుడు తన ఆశ్రమంలోనే వనవాసం పూర్తిచేసుకొమ్మని చెప్పినప్పటికీ అది తమ కోసల ప్రజలు తేలికగా రాదగ్గ ప్రాంతం కావున సున్నితంగా వలదని అనువైన ప్రదేశం చిత్రకూటమని తెలుసుకొని ఆ దిశగా శ్రీ రామ ప్రయాణం సాగింది.

చిత్రకూటానికి ప్రయాణమయిన సీతారామలక్ష్మణులకు దారిచూపడానికి వారివెంట భరద్వాజ మహర్షి కూడా కొంతదూరము ప్రయాణించాడు.

‘‘రామా! ఈ మార్గములో నేను చాలా సార్లు చిత్రకూటమునకు వెళ్ళాను. ఇది ఏ విధమైన ఇబ్బందులు కలుగని మార్గము. ఇక్కడ నుండి గంగాయమునల సంగమప్రదేశానికి వెళ్ళండి. అక్కడనుండి పడమటిదిక్కుగా యముననే అనుసరిస్తూ వెళ్ళండి. అలా ప్రయాణించిన తరువాత కాళిందిని తెప్పనిర్మించుకొని దాటండి. దాటినపిమ్మట మీకు శ్యామము అనే అతివిశాలమైన మర్రిచెట్టు కనపడుతుంది. ఆ వృక్షాన్ని ఆశ్రయించి అనేకమంది సిద్ధులుంటారు. అక్కడ సీతాదేవి ఆ వృక్షానికి నమస్కరించి కావలసిన కోరికలు కోరవచ్చును. ఆ పెద్ద మర్రిచెట్టు దాటి ముందుకు ఒక క్రోసు దూరము వెళ్ళండి. అక్కడ చక్కటి నీలపురంగులో ఉండే అడవి కనపడుతుంది. అది మోదుగు చెట్లతోనూ, రేగుచెట్లతోనూ, వెదురు డొంకలతోనూ కూడి కడు రమణీయంగా ఉంటుంది. ఆ మార్గమే చిత్రకూటమునకు వెళ్ళే మార్గము.’’ ఈ విధముగా మహర్షి మార్గనిర్దేశము చేసి  రామునికోరికమీద వెనుకకు మరలి నాడు.

Also read: కౌశల్యకు సుమిత్రాదేవి ఉద్బోధ

మువ్వురూ యమునాతీరం చేరారు. యమున ప్రవాహవేగం మంచి ఉధృతంగా ఉంది. దానిని ఎలా దాటాలా అని కాసేపు ఆలోచించి, చకచకా కొన్ని ఎండిన కర్రలు, వెదురు కర్రలు సేకరించి వాటన్నిటినీ దగ్గరగా చేర్చికట్టి  ఒక తెప్ప తయారు చేసుకొన్నారు.

లక్ష్మణుడు రకరకాలచెట్ల కొమ్మలు తీసుకొని వచ్చి సీతాదేవి సుఖంగా కూర్చోవడానికి వీలుగా ఒక ఉన్నతమైన ఆసనం సిద్ధం చేశాడు. ఆ తెప్పమీదికి ఎక్కడానికి కాస్తసిగ్గుపడుతున్న సీతమ్మకు చేయూతనిచ్చి ఎక్కించాడు రామచంద్రుడు.

మూటకట్టిన సీతాదేవి ఆభరణములు, గునపము, మేకతోలుతో చేసిన చిన్నపెట్టెను, ఆయుధాలను  సీతాదేవి ప్రక్కనే ఉంచాడు రామచంద్రుడు.

ఇరువురు అన్నదమ్ములూ తెడ్లేసుకుంటూ తెప్పను నడుపసాగారు.

సూర్యపుత్రిక అయిన ఆ నది మధ్యభాగంలోకి వెళ్ళగనే సీతమ్మ మరల మొక్కులు మొక్కుకుంది. ‘‘అమ్మా రాముడు క్షేమంగా తిరిగి అయోధ్యకు రాగానే నీకు వందకుండల కల్లు వేయి గోవులు సమర్పించుకుంటానమ్మా’’ అని నదీమతల్లికి మొక్కులు మ్రొక్కింది.

ప్రయాణించి వచ్చిన తెప్పను అచటనే వదిలివేసి మరల నడకసాగించారు. వనములగుండా ప్రయాణం చేస్తూ శ్యామము అనే మర్రిచెట్టు వద్దకు వచ్చి చేరారు.

ఆ మర్రిచెట్టు చుట్టూ సీతమ్మ మరల ప్రదక్షిణం చేసి  తన భర్త నిర్విఘ్నముగా వనవాస వ్రతము పూర్తిచేయాలని కోరికలు కోరింది.

మరల నడక మొదలు పెట్టారు.  లక్ష్మణుడు ముందు తరువాత సీతమ్మ, ఆవెనుక ధనుర్ధారియై రామయ్య.

దారిలో ఏదైనా అందమైన పొదగానీ, పువ్వుగానీ కనపడినప్పుడు రామచంద్రుని దాని విశేషమడుగుతూ ఆయన చెపుతూ ఉంటే ఈవిడ చిన్నపిల్లలాగా ఆనందిస్తూ ముందుకు సాగుతున్నది.

వదినగారు ఏ పూవును పండును అయితే చూసి విశేషమడిగారో వాటిని సేకరించి మరిది లక్ష్మణుడు తీసుకొని వచ్చి ఆవిడకివ్వటం… ఇలా సాగుతున్నది వారి ప్రయాణం.

Also read: తండ్రికీ, తల్లులకూ ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకున్న రామలక్ష్మణులు, సీత

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles