Tuesday, December 3, 2024

పుతిన్ పైన మరోసారి హత్యాయత్నం

  • లోగడ అనేక విడతల దాడులు
  • ఉక్రెయిన్ పై దాడితో పెరిగిన పుతిన్ వ్యతిరేకత
  • అమెరికా అధ్యక్షుడిపైన పుతిన్ విమర్శలు
  • పుతిన్, చైనా అధినేత షీ మధ్య పెరుగుతున్న మైత్రి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ను అంతమొందించడానికి కుట్రలు సాగుతూనే ఉన్నాయని తాజా సంఘటన కూడా రుజువు చేస్తోంది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగినట్లు జనరల్  జీ వీ ఆర్ టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరహా ప్రయత్నాలు గతంలోనూ అనేక సార్లు జరిగిఉండడం గమనార్హం. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచీ పుతిన్ పై వ్యతిరేకత కొన్ని వర్గాల నుంచి పెరుగుతూ వస్తోంది. కొన్ని నెలలు క్రితం ఆయన కాకస్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. తనపై జరిగిన హత్యాయత్నాల గురించి 2017లో స్వయంగా ఆయనే వెల్లడించారు. అప్పటికే తనను అంతమొందించడానికి ఐదు సార్లు కుట్రలు జరిగాయని పుతిన్ చెప్పుకుంటూ వచ్చారు. ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. అనేక సార్లు జరిగినప్పటికీ ఆ వివరాలను ఎక్కువ సార్లు గోప్యంగానే ఉంచారనే మాటలు అంతర్జాతీయ సమాజంలో వినపడుతున్నాయి.

Also read: త్రిభాషాసూత్రమే భారతీయులకు భూషణం

పుతిన్ సామ్రాజ్య విస్తరణ కాంక్ష

పుతిన్ తీరుపై కూడా మొదటి నుంచీ అనేక విమర్శలు ఉన్నాయి. దూకుడుగా వ్యవహరిస్తారనేది అందులో ఒకటి. సామ్రాజ్య విస్తరణ కాంక్ష, నియంతృత్వ ధోరణులు ఆయనలో ఎక్కువగా ఉన్నాయనేది ప్రధానమైన విమర్శ. సోవియట్ యూనియన్ గా  ఉన్నప్పుడు ప్రపంచంలో ఎటువంటి బలం, పరపతి ఉన్నాయో తిరిగి అటువంటి వైభవాన్ని తేవాలన్నది ఆయన లక్ష్యంగా ప్రచారంలో ఉంది. పశ్చిమాసియాలో ఆధిపత్యం చెలయించాలన్నది ఆయన ఆశయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పుతిన్ పోటీపడుతున్నట్లు జరిగిన పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ దేశాల దౌత్య, రాజకీయ వైఖరుల్లో ఇటీవల కొన్ని కీలక పరిణామాలు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొన్న జులైలో ఇజ్రాయిల్, సౌదీ అరేబియాలో విస్తృతంగా పర్యటించారు. ఆయన పర్యటన ముగిసిన మూడు రోజులకే పుతిన్ ఇరాన్ లో అడుగుపెట్టారు. ఈ రెండు దేశాల అధిపతులు తమ ప్రయోజనాలను పెంచుకొనే దిశగా పశ్చిమాసియాపై దృష్టి ఎక్కువ పెడుతున్నారని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీలున్నప్పుడల్లా అమెరికా అధినేతపై రష్యా అధిపతి పుతిన్ విరుచుకు పడుతుంటారు. వాణిజ్య, ఆర్ధిక, సైనిక ప్రయోజనాలను నెరవేర్చుకొనే దిశగా చైనా, ఇరాన్, భారత్ వంటి దేశాలతో మైత్రిని మరింతగా పెంచుకోడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో బంధాలు బాగా పెంచుకున్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ఏలికలు తాలిబాన్ తోనూ రష్యా అధినేత చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

Also read: గంగానది ప్రక్షాళన

చైనా, భారత్ మధ్య రష్యా

చైనా ప్రభావం, ఒత్తిడితో భారత్ కు దూరంగా జరిగే చర్యలు నిన్నమొన్నటి వరకూ జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, యూరప్ దేశాలన్నీ కక్ష కట్టిన తరుణంలో మళ్ళీ భారత్ మైత్రి రష్యాకు కావాల్సివచ్చింది. మనం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాం. అమెరికాకు మింగుడు పడకపోయినా రష్యా వైపే భారత్ మొగ్గు చూపించింది. దీనితో ఇరు దేశాల మైత్రి మరింత గట్టి పడింది. ఈ పరిణామాలు జరుగకపోతే రెండు దేశాల మధ్య బాంధవ్యాలు మరింత బలహీనపడి ఉండేవి. ఆ యా దేశాల అంతర్గత అంశాలు అటుంచగా ఉక్రెయిన్ పై రష్యా  వ్యవహరించిన తీరుకు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నయా సామ్రాజ్య కాంక్ష, పెత్తందారీ పోకడలు, నియంతృత్వ ధోరణులు, శతృవులను చంపి సాధించాలనే రాక్షస ప్రవృత్తి రష్యా అధిపతి పుతిన్ లో పుష్కలంగా ఉన్నాయని లోకం గుర్తించింది. పోరాటపటిమ సంగతి ఎలా ఉన్నా, మాటిమాటికీ గొడవలకు దిగే దుందుడుకు స్వభావం ఆయనకు ఎక్కువనే పేరుంది. ఈ స్వభావమే పుతిన్ కు శత్రువులను పెంచింది. యూరప్ దేశాలన్నీ ఆయనపై గుర్రుగా ఉన్నాయి.ఇక ఉక్రెయిన్ సంగతి సరే సరి! భారత్ కూడా ఆయనను పూర్తిగా నమ్మే పరిస్థితులు లేవు. నిప్పుకు నెయ్యి దొరికినట్లు పుతిన్ కు జిన్ పింగ్ జత కట్టాడు. వీరిద్దరిదీ దాదాపు ఒకటే స్వభావం. ఎప్పుడూ ఏయో దేశాలపైన కత్తులు నూరుతూనే ఉంటారు. సామదాన భేదదండోపాయాలతో మిగిలిన దేశాలను తొక్కేసి తన కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తారు. ఈ తీరు శాంతి కాముక దేశాలను కూడా రెచ్చగొడుతోంది. ఇక అగ్రదేశమైన అమెరికా ఊరుకుంటుందా? చైనాతో సాగుతున్న అధిపత్య పోరులో ఆ దేశానికి సఖ్య దేశమైన రష్యాపై పగ మరింత పెంచుకుంటోంది. పుతిన్ తీరుపై స్వదేశంలోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయన శత్రువుల సంఖ్య పెరుగుతోంది.

Also read: నిద్ర ఒక యోగం, విజయానికి సోపానం

పుతిన్ లో పరివర్తన రావాలి

ఆ మధ్య ఉక్రెయిన్ ను హెచ్చరిస్తూ… సైనిక చర్య కేవలం ట్రయల్స్ మాత్రమే ముందు ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రింగుమంటున్నాయి. అవసరమైతే అణ్వాయుధ ప్రయోగానికి వెనకాడమనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. ఈ వైఖరి యుధ్ధోన్మాదానికి అద్దం పట్టింది. ఇదంతా శత్రుత్వ భావన పెరగడానికి దోహదం చేస్తుంది. మనిషిపై మనిషి దాడిచేయడం అమానుషం. దేశాధినేతలను మట్టుపెట్టాలని ఎవరు ప్రయత్నించినా అది దుర్మార్గం. విభేదాలు, వివాదాలు ఉంటే వాటిని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అంతే తప్ప హత్యలకు తెగపడకూడదు. పుతిన్ కూడా తన తీరును మార్చుకోవాలి. తన దేశాభివృద్ధిపై దృష్టి సారించాలి. యుద్ధ మార్గం విడనాడాలి. అంతర్గతంగా దేశంలోనూ, ప్రపంచంలోనూ శాంతి వెల్లివిరియడానికి తన హస్తాన్ని అందించాలి.మానవీయ కోణంలో సాగుతూ ప్రపంచ ప్రగతికి తోడ్పడాలి. రాజనీతిజ్ఞత కలిగిన యుద్ధనీతిని పాటించాలి. రష్యా అధిపతి పుతిన్ పై జరుగుతున్న దాడులను సభ్యసమాజం ఖండిస్తూనే ఉంది. భారత్ వంటి శాంతికాముక దేశాలతో స్నేహం ద్విగుణీకృతమైతే సహనం, సమభావం, సోదరత్వం వంటి సుగుణాలు సహజంగానే పల్లవిస్తాయి. పుతిన్ ఈ దిశగా బలమైన అడుగులు వేయాలని ఆకాంక్షిద్దాం.

Also read: పోలవరం కుంటినడక ఎవరి శాపం?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles