ఉడిపి మఠాన్ని సందర్శించిన నాటి ‘ఇస్రో’ చైర్మన్ శివన్
ఏదేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ మూఢ నమ్మకాలు ఎంత తక్కువగా ఉంటే అంతగా ఆదేశం అభివృద్ది చెందుతుంది. కానీ తరతరాలుగా మన పెద్దల నుండి వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు, ఛాందసభావాలు పేరుతొ వస్తున్న వాటిని ప్రజలు వదులుకోలేకపోతున్నారు.
చిన్నప్పటినుండి మనమెదళ్లలో తాతయ్యలు, అమ్మమ్మలు నూరిపోచిన దేవుడూ, దెయ్యం, బూచోడు, పుక్కిటి పురాణ కధలు, మంత్రాలు, శాపాలు, వీటిబారినుండి అంతసులభంగా బయటపడలేకపోవటమే ప్రధానకారణం.
అందువల్లనే ఈరోజు ఎంతచదువుకున్నా సరిఅయిన శాస్త్రజ్ఞానం లోపించినందున, మనిషిని కోసి బతికించగల డాక్టర్లు గాంధీ ఆస్పత్రుల లాంటిచోట మృత్యుంజయ యాగం చేస్తున్నారు.
‘ఇస్రో’ చైర్మన్ లాంటివారుకూడా తమ ప్రయోగం విజయవంతం కావాలని చెంగాళమ్మ గ్రామదేవతకు మొక్కుతున్నాడంటేకారణం చిన్ననాటి ఛాందసభావాలను వదిలించుకోలేకపోవటమే!
పిల్లలకు శాస్త్రీయవిద్య బోధించాలి
అందుకే ప్రాధమిక విద్య నుండి పుక్కిటి పురాణాలు లేని శాస్త్రీయ విద్యను విద్యార్థులకు అందించినట్లైతే సమాజమారేందుకు అవకాశముంది.
పదార్థం సృష్టించబడదు, నాశనంకాదు, మార్పుమాత్రమే చెందుతుంది అని పాఠాలు చెప్పే ఫిజిక్స్ పంతుళ్లు ఎవడో ఒక బాబా ఆకాశంలోనుండి గొలుసు సృష్టిస్తే వెళ్ళి వాడి కాళ్ళమీద పడుతున్నారు.
రాహుకేతువులు కల్పితం, సూర్య చంద్రగ్రహణాలు భూమి, చంద్రుడు, సూర్యుడు కదలికల వలన ఒక దాని నీడ ఒక దానిమీద పడి గ్రహణాలు ఏర్పడుతాయి అని స్కూళ్లలో చెప్పే సైన్సు టీచర్లు గ్రహణంరోజు పట్టుస్నానాలు, విడుపుస్నానాలు అంటు ఆ సమయంలో తిండికూడా మానేసే స్థితిలో ఉన్నారు.
వేదాలలో అన్నీ ఉన్నాయిష!
అంతేనా రాజ్యాంగం అర్టికల్ 51 A (h ) లో వ్రాసుకున్న సూత్రాలను అమలుపరుస్తామని ప్రమాణం చేసిన దేశ ప్రధాని సయితం, ఒకానొక సైన్సు కాంగ్రెసు సభలో ఆనాడు పురాణాల్లో వినాయకుని తల అతికించటాన్ని ఈ నాటి శస్త్ర చికిత్సలతో పోల్చాడంటే, పాలకులు ఎంత అఙ్ఞానంలో కూరుక పోయారో అర్థంచేసుకోవచ్చు. వేదకాలంలోనే విమానాలున్నాయని కూడా ఆనాటి సభలో ప్రధాని చెప్పాడంటే ……వీరికి చరిత్ర , సైన్సు తెలియదనుకోవాలా? లేక తెలిసే నాటకాలు ఆడుతున్నారనుకోవాలా?
ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాలు నిర్మించిన దొంగ స్వాముల దగ్గరకు అధికారికంగా వెళ్ళి వారిపాదాలకు సాష్టాంగపడుతున్న ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు రాజ్యంగములో వ్రాసుకున్న లౌకికవాదాన్ని మంటగలుపుతున్నా ప్రశ్నించేవారులేరు.
రామదూత దర్శనం చేసుకున్న యడ్యూరప్ప
ప్రకాశంజిల్లాలో రామదూత అనేదొంగస్వామి వద్దకి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మంత్రి గాలిజనార్దనరెడ్డిలు వఛ్చి సాష్టాంగపడ్డారు. వారికోర్కెలుతీరక పోగా ఇద్దరుజైలుకెళ్లారు. అప్పటి బిజెపి జాతీయ అద్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూడావచ్చాడు. ఆతరువాత ఆయనకు ఒకకేసులో సుప్రీంకొర్టు సంవత్సరము శిక్షవేసింది. తరువాతచనిపోయాడు.
బాబాల వద్దకు వెళ్లినా ప్రయోజనం ఉండదు అని తెలుసుకోవాలి. ఒక్కొక్క బాబా ఒక్కొక్క కుంభకోణాలలో ప్రత్యేకత కలిగి వుంటారు. భూకుంభకోణాలు, హత్యలు, అమ్మాయిలపై త్యాచారాలు, మాదకద్రవ్యాల అమ్మకాలు, చెక్ బౌన్సకేసులు ఇలా …..
గ్రామాలలో జాతర్లు, నగరాలలో యాగాలు, బాబాలు
గ్రామాలలోని పామరులు కొలుపులు, జాతర్లు పూనకాలతో ఊగిపోతుంటే, పట్టణాలలోని నాగరికులు యాగాలు, యజ్ఞాలు, యోగాలు, బాబాలు అంటు ఊరేగుతున్నారు. వాళ్ళూవీళ్ళూ అందరూకలసి జాతకాలు, వాస్తు, కాలసర్పదోషాలు, నగ్న పూజల పేరుతో బాబాలను ,రంగురాళ్ళు, సంఖ్యాశాస్త్రాలు, రుద్రాక్షలు,అష్టలక్ష్మి యంత్రాలు, అంటు టీవీ లలోవచ్చే ప్రకటనలకు లోనై సర్వం కోల్పోతున్నా, వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వము పట్టించుకోవడంలేదు. కారణం నియంత్రించాల్సిన అధికారులే మూఢ నమ్మకాలలో కూరుకపోయి ఉన్నారు. వేరొక ప్రక్క చేతబడులు, బాణామతులు, క్షుద్రపూజలపేరుతో జంతుబలులు, రైస్ పుల్లింగ్ యంత్రాలు, గుప్తనిధుల పేరుతో నరబలులు, చేతబడి చేశాడని పళ్లూడగొట్టడాలు, సజీవదహనాలు….ఎటుపోతున్నాం?
కూతుళ్ళను త్రిశూలంతో పొడిచి చంపిన తల్లిదండ్రులు
మదనపల్లి లో జంటహత్యలు ….తలి దండ్రులే సొంత కూతుళ్లను త్రిశులంతో పొడిచి, కొట్టి చంపారు. ఏమి ఆశించి చంపారో, ఈ హత్యల వెనుక ఏ బాబా సూక్తులు, బోధనలు దాగి ఉన్నాయో ఎందుకు తేల్చలేదు? ఏ బాబా బోధనలు దాగి ఉన్నాయో తేలుచుకోవటం చాలాసులభం. ఆ హత్యలకు ముందు రెండు నెలల నుండి వారి ఫొన్ కాల్ డేటా బయటకుతీస్తే ఖచ్చితముగా ఏబాబా ప్రేరేపితమో బయట పడుతుంది. ఎందుకని ఫ్రభుత్వం ఆపనిచెయ్యలేదు? ప్రభుత్వము ,బాబాలు, ఫాస్టర్లూ, మౌల్వీలూ అంతా తోడు దొంగలు అనుకోవాలా?.
బాబాలకు , ఫాస్టర్లకు కావలసింది ఈలోకంకాదు. పరలోకం …ముందుగా వారిని పరలోకం పంపి చూసి రమ్మంటే సరిపోతోంది. ఎందుకంటె ఆ మధ్య తూర్పు గోదావరి జిల్లాలొ ముగ్గురు మహిళలు, ఏసు ప్రభు పిలుస్తున్నాడంటూ ఉరివేసుకుని చనిపోయారు. అప్పుడే ఢిల్లీలో పదకొండుమంది మోక్షం కోసం ఆత్మహత్య చేసుకున్నారు. కేరళలో ఒక ముస్లిం మహిళ ఆరుసంవత్సరాల కొడుకుని దేవునికి బలిచ్చింది. అంతెందుకు? కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప 2019 లో ఎవడొ చెప్పాడని తనపేరును యడియారప్పగా మార్చుకున్నాడంటే మూఢ నమ్మకాలు ఎంతబలంగాఉన్నాయో గమనించవచ్చు.అయన చివరికి పెరుమార్చుకున్నా ఉపయోగంలేక రాజీనామా చేయవలసి వచ్చింది.
ఆవు మూత్రం సర్వరోగ నివారిని
ఆవు మూత్రం సర్వరోగ నివారిని అన్నప్రచారం ఈమద్య కొంతమంథి విపరీతంగా ప్రచారంచేస్తున్నారు. ఈమధ్య కొత్త ట్రెండ్ వచ్చింది. గుళ్ళకి పోవలసిన అవసరంలేదు. బాబావద్దకి పోవలసిన అవసరంలేదు. ప్రార్థనలు అవసరంలేదు. ఐదు యాలకులు పర్సులో పెట్టుకుంటే చాలు. లక్ష్మి నెత్తిమీద కూర్చుంటుంది. పది లవంగాలు జేబులో పెట్టుకుంటేచాలు ….కర్పూరము బీరువాలో పెట్టుకుంటే ఆ సువాసనకి లక్ష్మి అమ్మవారు బీరువాలో తిష్టవేస్తుందట. ఈ రకంగా మూఢ నమ్మకాలు ఆరు యాలకలు , పది లవంగాలలాగా పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టాలంటే హేతువాద నాస్తికోద్యమాలను బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ప్రచారంచేయాలి. హేతువాదనాస్తిక సంఘాలు ఇంకా చురుకుగా, వేగంగా, ఆచరణాత్మకంగా ముందుకుపోవాలి.
మహారాష్ట్రలోనూ, కర్ణాటక, మరికొన్ని రాష్ట్రాలలో వచ్చినట్లు మూఢ నమ్మకాల నిర్ములనా చట్టాలకోసం రాష్ట్రంలో హేతువాదసంఘాలు, నాస్తికసంఘాలు, జనవిజ్ఞాన వేదికలు, అభ్యుదయవాదులు, కలసివచ్చే ఇతర సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని కలసి విస్తృతంగా ప్రచారం చెయ్యవలసిన అవసరం ఉంది.
నార్నెవెంకటసుబ్బయ్య.
అద్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం.