- తల్లి ఎలిజెబెత్ రాణికి శ్రద్ధాంజలి
- పెద్ద కుమారుడు విలియమ్స్ కు వేల్స్ యువరాజు పదవి
- చిన్న కుమారుడు హారిస్ కు ప్రేమ, శుభాకాంక్షలు
రాణి ఎలిజెబెత్ అస్తమయం తర్వాత ఆమె కుమారుడు చార్లెస్ రాజు అవుతాడు. వారసత్వ మండలి సమావేశంలో శనివారం సాయంత్రం కింగ్ చార్లెస్ నియామకాన్ని ప్రకటిస్తారని బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. సెంట్ జేమ్స్ ప్యాలెస్ లో వారసత్వ మండలి సమావేశం భారత కాలమానం ప్రకారం శనివారంనాడు రెండున్నర గంటలకు జరుగుతుంది. రాణి ఆరోగ్యం సవ్యంగా లేదని కబురు అందగానే బల్మోరల్ ఎస్టేట్ లోనే ఉన్న చార్లెస్, అతడి భార్య కొమిల్లా రాణి నివాసానికి గురువారంనాడే చేరుకున్నారు. రాణి కుమార్తె ఆనే కూడా అప్పుడే రాణి చెంతకు చేరుకున్నారు.
ఎలిజెబెత్ స్మారకార్థం ఆమె వయస్సుకు తగినట్టు హైడ్ పార్క్ లోనూ, టవర్ ఆఫ్ లండన్ లోనూ 96 సార్లు తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. ఏడాదికి ఒక సారి వంతున తుపాకీ పేల్చినట్టు అనుకోవాలి. స్కాట్లాండ్ లోని ఎడింబరో కేజిల్ లోనూ, నార్దర్న్ ఐర్లాండ్ లోని హిల్ బరో కేజిల్ లోనూ, గిబ్రాల్టర్ లోని చానెల్ ఐలాండ్స్ లోనూ తుపాకులు పేల్చారు. రాజలాంఛనాలతో రాణి అంత్యక్రియలు సెప్టెంబర్ 19న జరుగుతాయి. సెయింట్ జార్జిలో ఆమె సమాధిలో నిద్రిస్తారు.
రాణి ఎలిజెబెత్ తన జీవితమంతా ప్రేరణాత్మకంగా జీవించారని చార్లెస్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తల్లిని కొనియాడారు. బ్రిటన్ లో అత్యంత సుదీర్ఘకాలం సింహాసనం అధిష్టించిన రాణిగా ఎలిజెబెత్ చరిత్ర పుటలలోకి ఎక్కారు. 70 సంవత్సరాల పైచిలుకు ఆమె బ్రిటన్ రాణిగా ఉన్నారు. ‘క్వీన్ ఎలిజెబెత్ తోపాటే మనం జీవించాం. నా జీవితం చివరి వరకూ నేను మన దేశాలకు సేవచేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నా తల్లి సేవలు అందుకున్నవారు ప్రగాఢమైన కృతజ్ఞతాభావం కలిగి ఉన్నారు’’ అని ప్రిన్స్ చార్లెస్ అన్నారు. ‘ఆమె పాలనలో ఆప్యాయత, గొప్ప భావన ప్రముఖంగా కనిపించేవి. ఆ లక్షణాలు ఆమె వ్యక్తిత్వంలో ఉండేవి. ఆమె మరణం దఃఖం కలిగిస్తుందని నాకు తెలుసు. అందరితో ఆ బాధనూ, దుఃఖాన్నీ నేను పంచుకుంటాను’’ అని చెప్పారు. ‘థాంక్యూ, డార్లింగ్ మామా’’ అంటూ చనిపోయిన తన తల్లిని సంబోధించారు. ‘‘కొమిల్లా నా రాణి అవుతుంది. కర్తవ్యదీక్షను ఆమె ప్రదర్శిస్తారు. నా వారసుడు విలియం అవుతాడు. ప్రస్తుతానికి అతడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గా పనిచేస్తాడు. అతడి భార్య కేట్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అవుతారు. విదేశాల్లో తమ జీవితాలను నిర్మించుకుంటున్న హారీస్ కూ, మేఘన్ కూ నా ప్రేమను వెలిబుచ్చుతున్నాను. మన దేశానికి అత్యంత ప్రియమైన రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తానని నేను హామీ ఇస్తున్నాను,’’ అని తన ప్రసంగాన్ని ముగించారు.