భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారంనాడు దుబాయ్ లో జరిగిన రెండవ క్రికెట్ టీ-20 మ్యాచ్ ను అత్యున్నతమైన క్రీడా ఘటనగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అభివర్ణించారు. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో చిట్టచివరి బంతి మిగిలి ఉన్నదనగా పాకిస్తాన్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బాబర్ ఆజం నాయకత్వంలోని జట్టును అభినందిస్తూ అఫ్రిదీ ‘‘అద్భుతమైన విజయం. రిజ్వాన్, నవాజ్ మంచిగా ఆడారు. ఆసిఫ్ బ్రహ్మాండంగా ఆటను ముగించాడు,’’ అని అన్నాడు. ఇక ఫైనల్ కు చేరాలంటే ఇండియా శ్రీలంకపైనా, అఫ్ఘానిస్తాన్ పైనా గెలవవలసి ఉంటుంది.
అర్షదీప్ ఖరీదైన పొరబాటు
పద్దెనిమిదవ ఓవర్ లో అర్షద్వీప్ తేలికగా పట్టుకోవలసిన క్యాచ్ ను నేలవిడిచాడు. ఇది చాలా ఆవేశకావేశాలకు దారి తీసింది. కెప్టెన్ రోహిత్ శర్మ దిగ్భ్రాంతి చెంది బిగ్గరగా అరిచాడు. బౌలర్ రవి బిష్ణోయ్ నోరు వెళ్ళబెట్టాడు. విరాట్ కొహ్లీ అర్షద్వీప్ ను బలపరిచారు. ఎవరైనా పొరపాట్లు చేస్తారనీ, పొరబాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసిందే కానీ కుమిలిపోకూడదనీ అన్నాడు. తాను మొదటిసారి పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో ఒకానొక దరిద్రపు షాట్ కొట్టి అవుటైన సందర్భంలో తెల్లవారుజామున అయిదు గంటల వరకూ చూరు చూసుకుంటూ పడుకున్నాననీ, ఆ రాత్రి నిద్రపట్టలేదనీ, తన క్రీడాజీవితం ముగిసినట్టేనని అనుకున్నాననీ గుర్తు చేసుకున్నాడు. ‘‘ఇటువంటివి సర్వసాధారణంగా జరుగుతాయి. చింతించి వగచిన ఫలం లేదు. మళ్ళీ అటువంటి పొరబాటు చేయకుండా ఉంటే సరిపోతుంది’’ అని విరాట్ కొహ్లీ వ్యాఖ్యానించాడు. మాజీ టెస్ట్ క్రికెటర్ హర్ భజన్ సింగ్ కూడా అర్షద్వీప్ ని సమర్థించారు. ‘కావాలని ఎవ్వరూ క్యాచ్ డ్రాప్ చేయరు. ఒక్కొక్కప్పుడు అట్లా జరుగుతుంది. అర్థం చేసుకోవాలి’ అంటూ ట్వీట్ ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం చివరి ఓవర్ ను అర్షద్వీప్ తోనే బౌల్ చేయించాడు. ఏడు పరుగులు చివరి ఓవర్ లో సునాయాసంగా తీయగలిగిన పాకిస్తాన్ జట్టు గెలుపొందింది.
మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు పోగొట్టుకొని 181 పరుగులు చేసింది. ఈ మధ్య పరుగులు అంతగా చేయలేకపోతున్న మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ 44 బంతులలో 60 పరుగులు చేసి చివరి ఓవర్ లో రనౌట్ అయ్యాడు. మొదట్లో రోహిత్ శర్మ విజృంభించి ఆడాడు. పరుగులు వేగంగా చేయాలన్న తాపత్రయంలో రోహిత్, రాహుల్ లు బంతిని పైకి కొట్టి క్యాచ్ లు ఇచ్చి అవుటైనారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఆశాభంగం కలిగించారు.
రిజ్వాన్ విజృంభన
పాకిస్తాన్ 182 పరుగులు చేసే లక్ష్యంతో దీక్షాదక్షతలతో ఆడింది. పాకిస్తాన్ వికెట్ కీపర్, బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ 51 బంతులలో 71 పరుగులు చేశాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో వికెట్ కీపింగ్ చేసిన రిజ్వాన్ ఒక బంతిని ఎగిరి పట్టుకోబోయి కిందపడిపోయాడు. కాలికి దెబ్బతగిలింది. ఫిజియో వచ్చి చికిత్స చేసిన తర్వాత ఆట కొనసాగించాడు. రిజ్వాన్ ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. మహమ్మద్ నవాజ్ నంబర్ 4 బ్యాటర్ గా వచ్చి 20 బంతులలో 42 పరుగులు సాధించి పాకిస్తాన్ విజయానికి దోహదం చేశాడు.