Sunday, November 24, 2024

సీతారాముల సంభాషణ

రామాయణమ్ – 29

భర్తయొక్క ఈ రూపం వింతగా ఉన్నది సీతమ్మకు.

తనకు మొదట తెలిసిన రాముడు వీరమూర్తి, ఆ తరువాత శృంగారమూర్తి,ఇంట్లో శాంతమూర్తి.

వీరశృంగారము, శాంతవీరము కలబోసిన దివ్యచైతన్యదీప్తి!  నేడేమిటి? దీనమూర్తి అయినాడు?  ఆవిడ మనస్సులో సందేహం పొడసూపింది.

రాఘవా! ఏరి వందిమాగధులు? ఏది భద్రగజము? ఏవి సకల రాజలాంఛనాలు? ఏల నీవు పాదచారివై సంచరిస్తున్నావు? ఇన్ని ప్రశ్నలను ఆవిడ చూపులు సంధించాయి!

Also read: రామునికి లభించిన కౌసల్య అనుమతి

ఉండబట్టలేక అడిగేసింది సీతమ్మ!

ఏమి కారణము రామభద్రా! నీ విచారమునకు? ఆయన దుఃఖము చెలియలికట్ట దాటిన సంద్రమే అయినది! మెల్లగా తనను తాను సమాధానపరచుకొని, “సీతా! తండ్రిగారు నన్ను అరణ్యమునకు పంపివేయుచున్నాడు,” అని పలికాడు.

‘‘మా తండ్రి పూర్వము తనకిచ్చిన రెండువరములను మా తల్లి కైక నేడు కోరుకున్నది. దాని ప్రకారము నేను పదునాలుగేండ్లు వనవాసము చేయవలే. నా బదులుగా భరతునకు పట్టముగట్టవలే!  అందుచేత అరణ్య వాసమునకు బయలుదేరిన నేను నిన్ను చూసి, నీకు చెప్పి వెడదామని వచ్చాను’’ అని అన్నాడు రాముడు.

‘‘సీతా నీవు ధైర్యముగా ఉండు. నీవు దైవధ్యానంలో ఉండి ఈ పదునాలుగేండ్లు వ్రతములు, ఉపవాసములతో కాలము గడుపు! నా తల్లులను, తండ్రిని ఇప్పటివలెనే ఆదరించాలి సుమా! భరత,శత్రుఘ్నులను సోదరులవలే, పుత్రులవలే  చూసుకోవాలి నీవు.’’

(ఈ మాట అంటున్నప్పుడు లక్ష్మణుడి ప్రసక్తిరాలేదు గమనించండి)

Also read: మర్యాదపురుషోత్తముడు రాముడొక్కడే!

విశేషించి భరతుడు రాజ్యమునకు సర్వాధికారి, అతనికి అనిష్టము చేయగూడదు.

( రాజులకు ఇష్టము లేని పనులు చేయకూడదు. నేటి కాలంలో అన్వయము ఏమిటంటే BOSS IS ALWAYS RIGHT, FOLLOW THE BOSS).

రాముడి మాటలు వింటున్న సీతమ్మ మనస్సులో …..

‘‘ఓ నా పిచ్చి రాఘవా!’’ అనుకుంది.

ప్రేమ పెల్లుబికి వచ్చింది ! అదే ప్రేమతో కూడిన కోపంతో, ‘‘ఈ మాటలు అనడానికి సిగ్గు అనిపించడంలేదా? వినడానికి నాకే సిగ్గుగా ఉన్నది. ఎవరి పుణ్యపాపములను వారే అనుభవిస్తారు! ఒక్క భార్యమాత్రమే భర్తయొక్క భాగ్యమును పంచుకొంటుంది. భార్యాభర్తల భాగ్యమొక్కటే. నిన్ను అడవికి వెళ్ళమంటే నన్నూ వెళ్లమన్నట్లే.

నారీణామ్ పతిరేకో గతిఃసదా!…. స్త్రీల కు భర్త ఒక్కడే ఉత్తమ గతి.

‘‘నీ ప్రయాణము దుర్గమారణ్యములయితే నీ ముందు నడచి నీ మార్గంలో కంటకములు ఏరివేసి నీవు సుఖంగా నడిచేటట్లు చేస్తాను. ఈ విషయములో నీ మాట నేను మన్నించను. మేడల మీదా,మిద్దెలమీదా నివాసము కన్నా భర్తతో కలసి వుండటంలోనే ఆనందమున్నది. రామా! నా తల్లిదండ్రలు అనేకమయిన విషయాలలో నేనెలా నడచుకోవాలో నాకు ముందే ఉపదేశించి ఉన్నారు. నేడెవ్వరూ చెప్పవలసిన పనిలేదు. నీవు నాతోడు ఉంటే నాకు వేరే బ్రతుకెందుకయ్యా? అడవి అయినా  అయోధ్యానగరి అయినా నీతోటే నాజీవితం.

Also read: రాముడి మాట విని కుప్పకూలిన కౌసల్య

‘‘అడవి నాకు నా పుట్టిల్లు లాంటిది…సకలజీవ సంరక్షకా రామా! అడవిలో నన్ను నీవు రక్షించుకోలేవా? రామా! మా మిధిలలో ఉన్నప్పుడు ఒక భిక్షుకి నాకు వనవాసమున్నట్లుగా ఎరుక చెప్పినది.  ఒక బ్రాహ్మణుడు కూడా అదే విషయము నాకు చెప్పినాడు. అంతే కాకుండా నాకు కూడా అడవులలో సంచరించాలనే కోరిక ఉన్నది. నీతో చెట్టాపట్టాలేసుకుని చెట్టూచేమా, ఏటిగట్లు నదులు, సరస్సులలో విహారం చేయాలని ఉంది. విరగబూసిన కమలాలతో నిండిన సరస్సులలో మనోహరంగా తిరుగాడే హంసలను, కారండవపక్షులను నీ చేతిలో చేయివేసి కూర్చుని ఆనందంగా వీక్షించాలని ఉన్నది.

మనోహరమైన ప్రకృతిలో నీతో కలిసి లక్షసంవత్సరాలయినా ఆనందంగా జీవించగలను రామా!’’ అని ఎంతో ఉత్సాహంగా పలుకుతున్న సీతాదేవి మాటలకు రాముడు అడ్డువచ్చాడు!

Also read: తండ్రి ఆనతిని రాముడికి తెలియజేసిన కైక!

“సీతా! అరణ్యమంటే ఆషామాషీ కాదు.  భయంకరమైన సింహగర్జనలతో వనమంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మత్తెక్కి క్రీడించే క్రూరమృగాలు మనుషులను చూడగనే మీదిమీదికి దుముకుతుంటాయి. నదులన్నీ మొసళ్ళు, బురదతో నిండి దాటటానికి శక్యం కాకుండా ఉంటాయి. దారులన్నీ డొంకలతోటి ,ముళ్ళతోటి నిండిఉంటాయి. అడవికోళ్ళ అరుపులు వినపడుతుంటాయి. నీరు దొరకదు. పగలంతా శ్రమపడి రాత్రివేళ ఆకులు పరచుకొని ఆ పక్కలపై పడుకోవాల్సి ఉంటుంది. కందమూలాలు తవ్వుకొని తినాల్సి ఉంటుంది. కావున ఓ సుకుమారీ! ఎండకన్నెరుగనిదానవు నీవు. ఏడుమల్లెలెత్తుగా పెరిగినదానవు. ఇన్ని కష్టాలు భరించలేవు. వనవాసము దుఃఖము తో కూడినటువంటుది నీవు రావలదు”” అని స్పష్టంగా చెప్పేశాడు రాముడు!.

అప్పుడు కన్నుల నీరు నింపుకొని ప్రేమగా భర్తను చూస్తూ, ‘‘రామా నిజమే. వనవాసంలో ఇన్ని దోషాలు ఉన్నమాట నిజమే.  కానీ నీ సాంగత్యంలో అవన్నీ నాకు గుణాలే. క్రూరమృగాలు నిన్నుచూస్తేనే పారిపోతాయి. నీతో ఒక్క క్షణ వియోగమైనా నాకు మరణహేతువు! రామా నీవు నా ప్రక్కన ఉంటే ఈ ప్రపంచంలో ఏదీ నాకు అవసరం లేదు’’ అంటూ ప్రాధేయపడింది సీతమ్మ.

Also read: కృద్ధుడైన తండ్రిని చూసి వేదన చెందిన రాముడు

ఇంతగా ప్రాధేయపడినా రాముని మనసు కరుగలేదు. ఇక లాభంలేదనుకుంది సీతమ్మ.

ప్రేమచేత ప్రార్ధిస్తే వినటంలేదీయన అని అనుకొన్నది.

ఎర్రబడ్డకళ్ళతో కించిదహంకారంతో నిందించడం మొదలుపెట్టింది.

‘‘రామా! నీవు పురుష శరీరంలో ఉన్న ఒక ఆడుదానివి. అసలు నిన్ను ఆ మిధిలాధీశుడు ఏం చూసి అల్లుడుగా చేసుకొన్నాడో అర్ధం కావటంలేదు నాకు! నువ్వుతప్ప నాకిక్కడ ఎవ్వరూ గతిలేరు. నీవులేక నేను ఒంటరిదానను. నన్నిక్కడే వదిలివెళ్ళాలని ఎందుకనుకుంటున్నావు? నీ భయానికి గల కారణమేమిటి? సావిత్రి సత్యవంతుడిని అనుసరించినట్లు నీ నీడలా నిన్ను అనుసరిస్తూనే ఉంటాను.’’

NB.

(సినిమా ప్రభావంలో ఉన్న మనకు సీతమ్మ ఇట్లా మాట్లాడిందా అనే అనుమానం కలుగుతుంది .అక్షరాలా ఇంతే మాట్లాడింది. సీతాదేవి అంటే తల వంచుకొని కష్టాలు మౌనంగా భరించేది కాదు. ఒక ధీరోదాత్తురాలైన స్త్రీ. తనకు ధర్మబద్ధంగా ఏది ఇష్టమో ఆ పనే చేసింది. Height of a woman’s imagination in this country is Sitha and Savithry అని స్వామీ వివేకానందుడంటారు).

Also read: కైక కోరిన రెండు వరాలు: భరతుడి పట్టాభిషేకం, రాముడి అరణ్యవాసం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles