Sunday, November 24, 2024

జనని సంస్కృతంబు

  • జీవశక్తి కలిగిన భాష
  • వేదిక పార్లమెంటు కావాలన్న సుప్రీం

సంస్కృతం భరత జాతి సంపద. భారత జాతీయ భాషగా ప్రకటించండంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి రావడమే విషాదం. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిని శుక్రవారం నాడు సుప్రీం కోర్టు కొట్టేసింది. ” దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. ఇది పాలసీలకు సంబంధించిన విషయం. దీనిని మేం మార్చలేం. దీనిపై చర్చించడానికి సరియైన వేదిక పార్లమెంట్” అని సుప్రీం ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీతో పాటు సంస్కృతాన్ని కూడా జాతీయ భాషగా పేర్కొనాలని గుజరాత్ మాజీ అదనపు సెక్రటరీ కె జి వంజార పిల్ వేశారు. సంస్కృత ఉచ్చారణలో జీవశక్తి ఉంటుందని, మెదడు చురుక్కుగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని, లయబద్ధమైన ఉచ్చారణ వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందన్నది ఆయన వాదన.

Also read: ఇక జార్ఖండ్ పై ఖడ్గప్రహారం?

హిందీ, ఇంగ్లీష్ భాషలకు నష్టం లేదు

సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయడం వల్ల హిందీ,ఇంగ్లిష్ భాషలకు వచ్చే నష్టం ఏమీ లేదని ఆయన భావం. వంజార ఆలోచనలు, ఆశయం అభినందనీయం. లోక్ సభ చర్చలు, ప్రతి చర్చల్లోని రాజకీయ కోణాలు ఎలా ఉన్నా, మనదైన గొప్ప భాష కలకాలం మన్నడానికి ప్రతి ఒక్కరూ సహకరించడమే సహేతుకం. అవసరార్ధం, బతుకు తెరువు కోసం ఇంగ్లిష్ భాష అత్యవసరమైన నేటి కాలంలో,  స్థానిక భాషల ప్రస్థానం ప్రశ్నార్ధకంగా మారింది. బ్రిటిష్ పాలనలో లార్డ్ మెకాలే రుద్దిన విద్యా విధానం వల్ల మనం చాలా నష్టపోయాం. వాటిల్లో  మన భాషలు కూడా ఉన్నాయి. ‘త్రిభాషా సూత్రం’ చాలా కాలం చాలా రాష్ట్రాల్లో బాగానే అమలయ్యింది. తమిళనాడు వంటి కొన్ని చోట్ల హిందీ విషయంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భాషాభిమనం ఆహ్వానించ తగినదే. దురభిమానమే కొంపలు ముంచుతుంది. ఈ తీరు వల్ల ఆ యా రాష్ట్రాల్లో జీవించే అన్యభాషీయులకు పెద్ద అన్యాయం జరుగుతోంది. మాతృభాష /స్థానిక భాష, దేశంలో ఎక్కువమంది మాట్లాడే హిందీ, ప్రపంచభాషగా చెలామణి అవుతున్న ఇంగ్లిష్… ఇలా మూడు భాషలు చదవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉందని భాషా శాస్త్రవేత్తలు కూడా అనేకమార్లు చెప్పారు. అందులో నిజముందని నమ్మవచ్చు. కొన్ని విద్యాలయాలలో  ఇంగ్లిష్ తో పాటు కొన్ని విదేశీ భాషలు కూడా అందుబాటులో ఉన్నాయి. బహుభాషలు నేర్చుకోవడం తప్పేమీ కాదు. పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Also read: ‘హరికథా పితామహుడు’ ఆదిభట్ల

విజ్ఞాన సర్వస్వం సంస్కృతం

అదే సమయంలో, మనదైన సర్వ విజ్ఞానమంతా నిక్షిప్తమై ఉన్న సంస్కృతాన్ని కూడా తప్పకుండా చదవాలి. అత్యంత ప్రాచీనమైన మన భాషను కాపాడుకోవడంతో పాటు మన ప్రాచీన జ్ఞాన సంపద మళ్ళీ మనకు దగ్గరవుతుంది. మనదేశంలో సంస్కృతం చదివేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. మార్కుల స్కోరింగ్ నెపంతో కొందరు విద్యార్థులు మాతృభాషను వీడి సంస్కృతం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇది కేవలం మార్కుల మీద ప్రేమ తప్ప భాషాభిమానం కాదు. ఈ ఆలోచనా విధానం విద్యా విధానాల లోని లోపాల వల్ల మాత్రమే వచ్చింది. ఇంగ్లిష్ భాషను నేర్చుకోవడం వల్ల ఎన్నో పుస్తకాలు   చదవగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం, పది దేశాలు తిరిగి నెట్టుకు రాగలుగుతున్నాం. అదే స్ఫూర్తి సంస్కృత భాషను అధ్యయనం చేయడంలోనూ చూపిస్తే గొప్ప జ్ఞానం అబ్బి జీవశక్తి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుందని పెద్దలు చెప్పిన మాటలు సత్యవాక్కులు. దేశంలోని వివిధ విద్యాలయాలలోని కోర్సుల్లో ఉండే సంస్కృతం విషయంలో పరీక్షలు రాసే సమయంలో ఎక్కువ మంది ఎక్కువ శాతం సంస్కృతం కంటే ఇంగ్లిష్ లేదా మాతృభాష / స్థానిక భాషలను ఎంచుకుంటున్నారు. ‘దేవనాగరి’ లిపిని ఎంచుకుంటేనే సంస్కృత భాషా పరంగా సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది, ప్రయోజనం సిద్ధిస్తుందని చెప్పవచ్చు.

Also read: వాయువేగంగా రామమందిరం

అమరభాషను మరువరాదు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ విషయాన్ని పదే పదే గుర్తుచేస్తున్నారు కానీ ఆచరణలో అది జరగడం లేదు. దీనిపై కేంద్రంతో పాటు , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిబద్ధతతో దృష్టి సారించాలి. మన జ్ఞానమంతా వేదాల్లోనే ఉందని కదా మన పెద్దలు చెప్పారు. మన శాస్త్రాలన్నీ మొన్నటి వరకూ సంస్కృతంలో ఉన్నాయని కదా వారి వాదన. మన దేశాన్ని దురాక్రమించిన అనేక దేశస్తులు మన సంపదతో పాటు మన వేద సర్వస్వాన్ని పట్టుకెళ్ళిపోయి, మనవారితోనే ఆ విశేషాలు తెలుసుకొని వారి భాషల్లోకి అనువదించుకున్నారనే వేదనామయమైన వాదనలు మనకు తరచూ వినపడుతూ ఉంటాయి. మన శాస్త్రాలు చదివి, రహస్యాలు తెలుసుకొని మనకే వాటిని అమ్మే దుస్థితులు వచ్చాయన్నది సంప్రదాయవాదుల వాదన. ఇటువంటి దుస్థితిలోనూ మన దేశంలో ఇప్పటికీ సంస్కృతం మాట్లాడేవారు ఉండి ఉండడం మన అదృష్టం. కర్ణాటకలోని మత్తూరు అనే గ్రామంలో అందరూ పూర్తిగా సంస్కృతంలోనే మాట్లాడుతారు. అది వారికి వాడుక భాష, వ్యావహారిక భాషగా ఉండడం గొప్ప విశేషం. ఈ ఊరును ఆదర్శంగా తీసుకొనే ప్రయత్నంలో కొందరు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. మన దేశ నాగరికత విలసిల్లిన గత చారిత్రక వైభవంలో సంస్కృతం స్థానం శిఖరాయమానం. గ్రీకు, ల్యాటిన్, జర్మన్, ఫ్రెంచ్ మొదలైన భాషలు ఇంకా విలసిల్లుతున్నాయి. వాటిల్లోని అనేక పదాలకు -సంస్కృత పదాలకు ఎంతో సారూప్యత ఉందని గమనించవచ్చు. భారతీయ భాషలతో పాటు అనేక ప్రపంచ భాషలకు కూడా సంస్కృతమే మూలమనే వాదన కూడా ఉంది. ఈ అంశంపై ఇంకా విస్తృతంగా అధ్యయనం జరగాల్సి వుంది. శబ్దశక్తి అపారంగా కలిగి, శ్రావ్యతలో తలమానికంగా నిలుస్తూ, గొప్ప చారిత్రక నేపథ్యం కలిగి వున్న సంస్కృతం ఇంకా ఎన్నో రెట్లు ప్రచారంలోకి రావాలి. వాడుక పెరగాలి. మన వికాసానికి దోహదకారిగా నిలుపుకోవాలి. అమరభాషను మరవకుండా అధ్యయనం పెంచుకుంటూ ముందుకు సాగడం వివేక శోభితం. ప్రభుత్వాలు, ప్రజలు కలిసి సాగితేనే సర్వ సంకల్పాలు నెరవేరుతాయి.

Also read: ఆజాద్ నిష్క్రమణ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles