Sunday, November 24, 2024

రామునికి లభించిన కౌసల్య అనుమతి

రామాయణమ్28

‘‘లక్ష్మణా నీవన్నట్లుగా ఈ పట్టాభిషేకము జరిగినదే అనుకో.  అప్పుడది ఎవరికి అవమానము? మన తండ్రికి. ఎవరికి మనస్తాపము? మన తల్లి కైకకు. మన  తండ్రికి గానీ, తల్లులకు గానీ ఇంతకు మునుపెన్నడైనా లేశమైనా అప్రియము చేసినట్లు నాకు గుర్తులేదు. మన తల్లి తండ్రులు ఎట్టి భీతి, మనస్తాపము లేక జీవింతురుగాక. నా తండ్రి అసత్యవాది అన్నపేరు ఎవరికి బాధ? చివరకు అది మనకే బాధ!

Also read: మర్యాదపురుషోత్తముడు రాముడొక్కడే!

‘‘తల్లితండ్రులకు కలిగిన మనస్తాపము మనకు కలిగినట్లే. ఈ కారణము చేతనే నేను అడవులకు వెళ్ళటానికి నిశ్చయించుకొన్నాను. ఇచ్చిన రాజ్యము తీసుకొన్నది తండ్రిగాదు, తల్లికైకకాదు. ఇది దైవనిర్ణయము! నాకు నా తల్లులపట్ల ఏవిధమైన భేద భావమూలేదు. లక్ష్మణా దైవము నడిపించునట్లు నడవడమే తప్ప దానిని నిగ్రహించుటకు  ఏ ఉపాయమూ కానరాదు. లక్ష్మణా! నా వనవాసవ్రతమునకు ఈ అభిషేక జలములతో స్నానము చేసెదను.  ఉహూ. వద్దులే ఇవి రాజద్రవ్యములు. అందుకు వాడరాదు.’’

(మన రాజకీయనాయకులు పిల్లాజల్లా సహా అందరూ అధికార లాంఛనాలకోసం, ఎర్రబుగ్గకార్లకోసం వెంపర్లాడే వారే! Special treatment గుళ్ళలో కూడా కావాలని నానా అల్లరి చేసే వారే!..రాముడు నీళ్ళను కూడా వాడలేదు!)

రాజ్యమా ?వనవాసమా ?

వనవాసమే సుఖప్రదము! శుభప్రదము!

రాజ్యం వా వనవాసో వా ! వనవాసో మహోదయః!

రాముడి ఈ మాటలు వింటున్న లక్ష్మణుడు ఇంకా బుసలుకొడుతూనే ఉన్నాడు. కనుబొమ్మలు విరిచి చూడటానికే భయంకరంగా ఉన్న ఆయన రూపము బాగా కోపంతో ఉన్నసింహపు ముఖంలాగా ఉన్నది. నేత్రాగ్రాలతో రాముడిని అడ్డంగా చూస్తూ, ‘‘ అన్నా! సుక్షత్రియుడవు, మహావీరుడవు.  నీవు కన్నెర్రచేస్తే లోకాలే గజగజవణికిపోతాయి. పాపాత్ముడయిన రాజు, ఆయన భార్యకైక మీద నీకు కోపం ఎందుకు కలుగటలేదు? పైగా దైవనిర్ణయం అంటున్నావు. నీ సంకల్పము బలవత్తరమైనదయితే దైవము బలహీనము కాదా? వారిది వంచన. అది ధర్మరూపాన్ని సంతరించుకొన్నది!

Also read: రాముడి మాట విని కుప్పకూలిన కౌసల్య

‘‘ఎప్పుడో ఇచ్చిన వరము అప్పుడే తీర్చక నేడిలా నిన్ను మోసం చేయటానికి దానిని ఏల సాకుగా చూపవలే! నీ రాజ్యము నీకు కాకుండా చేసిన ఈ ధర్మమును నేను ద్వేషిస్తున్నాను! మనోధైర్యము, వీర్యము లేనివాడు మాత్రమే దైవముపై ఆధారపడి యుండును. నీ వంటి వీరుడు కాదు. దైవమట దైవము. నా కెవరు అడ్డువస్తారో చూస్తాను!  నీవు కాదు అడవులకు వెళ్ళవలసినది. వారు! అన్నా నా ఈ బలమైన బాహువులు కేవలము జనులు వీక్షించడానికి కాదు!  ధనుస్సు అలంకారము కొరకు కాదు. ఖడ్గము నడుముకు వేళ్ళాడదీయటానికి కాదు! బాణములు అలా వృధాగా పడి ఉండటానికి కాదు. ఈ నాలుగూ శత్రువులను సమూలంగా నిర్మూలించడానికే. క్షణకాలంలో గజ, తురగ, పదాతిదళముల పీనుగులపెంటగా మార్చివేస్తాను ఈ అయోధ్యను!  అడ్డు వచ్చినవారిని కత్తికొక కండగా నరికివేస్తాను. దశరథుని నేడే సింహాసనం నుండి క్రిందకు దించివేస్తాను.’’

Also read: తండ్రి ఆనతిని రాముడికి తెలియజేసిన కైక!

బుసలుకొడుతూ తిరుగుబాటుకు సిద్ధమైన తమ్ముని కన్నీరు తుడిచి, ‘‘లక్ష్మణా! నాన్నమాట నాకు బంగారు బాట.  ఆయన మాట మీదనే నేను స్థిరంగా నిలిచి ఉన్నాను. ఇంక వ్యర్ధవాదములు వద్దు.’’

అని శాంతగంభీరంగా పలికిన రాముని చూచి కౌసల్యాదేవి …ఇలా అన్నది: తండ్రి ఆజ్ఞ పాటించుట తప్ప వేరు కర్తవ్యములేదు అన్న రాముని దృఢసంకల్పము కౌసల్యాదేవి పూర్తిగా అర్ధం చేసుకొన్నదై , ‘రామా!’ అని డగ్గుత్తికతో అస్పష్టంగా పలికింది. ఆమె గొంతు పూడుకు పోయింది. అతి కష్టం మీద మాటలు పెగుల్చుకుంటూ, ‘‘రామా! తాపసవేషధారివై నీవు ఊంఛవృత్తితో ఎలా జీవిస్తావురా, నాయనా! ఎండ కన్నెరుగని రాకుమారుడివి. సుకుమారుడివి. నీ సేవకులు, నీ మిత్రులు అయిన కారణంగా వారందరూ మన నగరంలో అందరికంటే ఉన్నతంగా జీవిస్తారే, మహారుచికరమైన ఆహరం ప్రతిదినమూ భుజిస్తారే, మరి నీవో! రోజూ కందమూల ఫలములతో పొట్ట ఎలా నింపుకుంటావురా తండ్రీ! (తల్లికదా! ముందు కడుపే గుర్తుకొచ్చింది ఆవిడకు) నాయనా నీలాంటివాడినే ప్రవాసమునకు పంపుతున్నాడనిన రాజంటే అందరికీ భయము కలుగుతుంది! నీవు కూడా అరణ్యమునకు వెళ్ళవలసి వస్తున్నదంటే దైవమే బలవత్తరమైనది అని చెప్పవచ్చును. నాయనా! లేగదూడ పోతుంటే తల్లి అక్కడే చూస్తూ నిలబడి ఉంటుందా? నేను కూడా నీ వెంటే వస్తాను తండ్రీ!’’ అని కడు దీనంగా హృదయవిదారకంగా విలపిస్తున్న తల్లిని ఓదార్చి రాముడు, ‘‘అమ్మా! కైకమ్మ వంచనకు గురిఅయి విలవిలలాడుతున్న నా తండ్రిని ఈ సమయంలో ఒంటరిగా వదిలివేస్తావా? నేనూ వెళ్ళి నీవూ ఆయనను విడిచిపెడితే ఇంక ఆయనకు దిక్కెవరమ్మా? అయినా, ఏ స్త్రీ కూడా భర్తను పరిత్యజించరాదు. అది చాలా క్రూరమైన పని తల్లీ! భర్త జీవించి యున్నంత వరకు భార్య ఆయనతోనే ఉండి సేవచేయవలే. ఇదే శాశ్వతమైన ధర్మము. అమ్మా! భరతుడు ధర్మాత్ముడు. అన్నిప్రాణులకు ప్రియము గూర్చేవాడు. అతడు నీకు అనుకూలముగా ఉంటాడమ్మా. నీకు బెంగవద్దు’’ అని పరిపరివిధాలుగా తల్లిని ఓదార్చాడు రాముడు.

Also read:కృద్ధుడైన తండ్రిని చూసి వేదన చెందిన రాముడు

అప్పుడు కౌసల్యాదేవి కాస్త స్తిమితపడి, ‘‘రామా! నీ మార్గములు మంగళకరములగుగాక! సకలప్రాణికోటి నిన్ను ఆదరించుగాక. దిక్పాలకులు, సకలదేవతలు, త్రిమూర్తులు, స్థావరజంగమాత్మకమైన ఈ ప్రకృతి నిన్ను కాపాడుగాక’’ అని దీవించి పంపింది.

రాముడు అటనుండి తన ఇంటికి పాదచారియై వెళ్లాడు. జరిగిన విషయాలేవీ భార్యకు తెలియదు.  తన ప్రాణేశ్వరి, తన ప్రియసతి సీతాదేవిని చూడగనే కట్టలుతెంచుకుంటూ దుఃఖము పొంగిపొరలి పైకి తన్నుకుంటూ ఉబికిఉబికి వచ్చింది రామచంద్రునికి!

తం శోకం రాఘవః సోఢుం తతో వివృతతాం గతః!

Also read: కైక కోరిన రెండు వరాలు: భరతుడి పట్టాభిషేకం, రాముడి అరణ్యవాసం

వూటుకూరు జానకిరామారావు

Previous article
Next article
V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles