పరస్పరం అభినందించుకుంటున్న మోదీ, ఆజాద్
- వెడుతూవెడుతూ రాహుల్ పైన బురద
- యాభై ఏళ్ళు అనేక పదవులు అనుభవించి ఇదేమి విడ్దూరం
- మోదీ కశ్మీర్ నాటకంలో ఆజాద్ ప్రధాన పాత్రధారి?
కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్క సీనియర్ నాయకుడు వరుసగా వదిలి వెళ్లిపోతున్నాడు. నేడు మరో అగ్రనేత గులాం నబీ ఆజాద్ వంతు వచ్చింది. నిన్నటి వరకూ అధిష్ఠానానికి గులామ్ .. అన్న నాయకుడు నేడు ఆ పార్టీ నుంచి ‘ఆజాదీ’ని (స్వేచ్ఛ) కోరుకొని బయటకు వచ్చేశారు. రేపటి నుంచి ఎవరికి గులామ్ అవుతారో సలామ్ కొడతారో చూడాలి. 50ఏళ్ళ పాటు అన్ని పదవులను అనుభవించి, అవసరాలు తీరాక, పార్టీ బలహీనపడిందని తెలుసుకున్నాక, రేపటి కోసం రాజకీయ స్వార్థంతోనే పార్టీని వీడారన్న విషయం తెలిసిపోతోంది.
Also read: సమర్థుని జీవయాత్ర!
రాహుల్ పై బురద
పోతూ పోతూ అందరి వలె పార్టీపై బురద చల్లేసి, ఆ గుంపులో కలిసిపోయారు. ఈ తీరు నూటికి నూరు శాతం వ్యక్తిత్వ హననమే. బూత్ స్థాయి చోటా వ్యక్తి దశ నుంచి రాష్ట్రాలను శాసించే స్థాయిని పార్టీయే కలిపించింది. ఎన్నో పదవులు ఇచ్చింది. స్వేచ్ఛ ఇచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ తీరు నచ్చడం లేదంటూ పార్టీని వీడడం డెబ్బయ్ ఏళ్ళు పైబడిన పెద్దమనిషి చెయ్యాల్సింది కాదు. నిన్నటి దాకా రాజ్యసభ సభ్యత్వాన్ని హాయిగా అనుభవించారు. ఇప్పుడు కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. కొత్త పార్టీ పెడతానంటున్నారు. కశ్మీర్ కు మరోమారు ముఖ్యమంత్రి కావాలని తపన పడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ మధ్య పదే పదే ఆజాద్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. వారి సేవలు జాతికి అవసరమంటూ కొనియాడారు. ఆజాద్ కు రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పెద్దఎత్తున ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ కాడి పడేసిన ఈ నాయకుడికి బిజెపి ‘హస్తం’ అందించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. మరి కొన్నాళ్లలో జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఆజాద్ నిలబడతారని, వచ్చే ఫలితాలను బట్టి, అవసరమైతే బిజెపి సాయం తీసుకొని అధికారం చేపడతారని అనుకోవడం తప్పుమాటేమీ కాదు. పదవీ కాంక్షతో 50ఏళ్ళ బంధాన్నే వదిలేసిన వ్యక్తికి బిజెపితో కలవడానికి అభ్యంతరం ఏముంటుంది? కశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన గత అనుభవం ఎట్లాగూ ఉంది. ఇప్పుడు తన కొత్త పార్టీలో ‘ఆకర్ష్’ పథకాన్ని ప్రవేశపెట్టి కాంగ్రెస్ సహా మిగిలినవారిని కూడా లాక్కొనే ప్రయత్నం చేయవచ్చు. నేటి కాంగ్రెస్ విధానాలను విమర్శిస్తూ ఉత్తరపర్వం నడిపిన జి -23 లో ఆజాద్ కూడా వున్న సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి అదిజి -23 కాదని, ఆ సంఖ్య పెద్దదని అన్నవారిలో ఈయన కూడా ఉన్నారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆజాద్ తన సుదీర్ఘ వైభవానికి మూలమైన కాంగ్రెస్ పార్టీనే ట్రబుల్ లోకి నెట్టేశారు. కాంగ్రెస్ అధినాయకత్వంపై అగ్గిరాజేయడం వల్ల పార్టీ అప్రతిష్ఠ పెంచడానికి ‘నేనుసైతం’ అంటూ ముందుకొచ్చారు. ఆజాద్ తీరును కశ్మీర్ వాసులు ఎలా తీసుకుంటారో చూడాలి. రెండు సార్లు లోక్ సభ, ఐదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పదవులు పొందారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత స్థానాలను దక్కించుకున్నారు.
Also read: మరో మహా కర్షక పంచాయతీ!
జమ్మూ కశ్మీర్ లో తన భవిష్యత్తును ఎలా మలుచుకుంటారో చూడాలి. బిజెపి అండదండలు తప్పకుండా ఉంటాయనే మాటలు కోడై కూస్తున్నాయి. ప్రస్తుత వాతావరణంలో జమ్మూ-కశ్మీర్ లో ఆజాద్ వంటి అనుభవజ్నుడి అవసరం బిజెపికి ఉందనే భావించాలి. ఉభయతారకంగా ఉండే విధంగా ఇరువురు /ఇరుపార్టీలు కలిసి సాగవచ్చు. కపిల్ సిబల్ నుంచి సునీల్ జాఖడ్ వరకూ సీనియర్లు ఎందరో పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆనంద్ శర్మ కూడా దాదాపు అదే దారిలో ఉన్నారు.కాంగ్రెస్ అధిష్టానం వీటిని సీరియస్ గా తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. పార్టీ పగ్గాలు తీసుకోడానికి రాహుల్, ప్రియాంక ఆసక్తి చూపడం లేదు. ‘వారసత్వ ముద్ర’ నుంచి పార్టీని బయటపడేయాలనే ఆలోచనలతోనే ఇదంతా చేస్తున్నారని వినపడుతోంది.
Also read: ‘ఆంధ్రకేసరి’ అవతరించి నూటాయాభై ఏళ్ళు
రెండు రాష్ట్రాలలోనే అధికారం
రాజస్థాన్,చత్తీస్ గడ్ తప్ప పార్టీ ఎక్కడా అధికారంలో లేదు. ఇంకొక పక్క సీనియర్లు వరుసగా పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ లో ముగింపు పలకాల్సిన అధ్యక్ష ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా వుంది. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ దిశగా బిజెపి శరవేగంగా ముందుకు వెళ్తోంది. మరి కొన్ని నెలల్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. ఇంక కొన్నాళ్ళకు (2024) సార్వత్రిక ఎన్నికలు కూడా సిద్ధమవుతాయి. మరో పక్క ఆప్ అధినేత కేజ్రీవాల్ దేశమంతా కలియ తిరుగుతున్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు, కేంద్రంలోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారపీఠం ఎక్కిన కిక్కు ఆయనకు బాగానే పనిచేస్తోంది. అధ్యక్ష పదవిని చేపట్టకపోయినా, బిజెపి ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను, ప్రధాని మోదీ వైఖరిని రాహుల్ గాంధీ అడుగడుగునా తప్పు పడుతూనే వున్నారు. ఎప్పటికప్పుడు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రతిపక్షనేతగా తన ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క సందర్భంలో పరిణితి చెందిన నాయకుని వలె మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అపరిపక్వత చూపిస్తున్నారు. రాహుల్ గాంధీ మెదడులో ఎప్పుడు ఏ సాఫ్ట్ వేర్ చురుకుగా పనిచేస్తుందో అంచనా వేయలేకపోతున్నాం. పార్టీని నడిపించుకోవాలి. గెలిపించుకోవాలి. అధికార పీఠాన్ని మళ్ళీ దక్కించుకోవాలి. రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో చూసుకోవాలనే తపన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి నూటికి నూరు శాతం ఉంది. రాహుల్ కూ ఆ వ్యామోహం లేకపోలేదు. కాకపోతే, సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించలేక పోతున్నారు. పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించలేక పోతున్నారు. ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురాలేక పోతున్నారు. వెరసి ఇంట గెలవలేకపోతున్నారు, రచ్చ గెలవలేక పోతున్నారు. ఇవ్వేమీ సాధించకపోతే పార్టీ ఇప్పుడప్పుడే కోలుకోలేదు. ఈ నేపథ్యంలో,దిల్లీ పీఠం కల్లే. ఆజాద్ కొత్త పార్టీ ప్రయాణం లేదా కొత్త రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి మాత్రం ప్రజల్లో,రాజకీయ సీమల్లో ఉంది.గులాం నబీ ఆజాద్ తన ప్రతిష్ఠను కాపాడుకుంటారా? దిగజార్చుకుంటారా కాలమే చెప్పాలి.ఈరోజు (ఆదివారం) సీ డబ్ల్యూ సీ సమావేశం నిర్వహిస్తారని సమాచారం. మేధోమధనం జరిపి, పార్టీ వ్యవహారాలపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో… చూద్దాం తమాషా!
Also read: తెలుగు పిడుగు గిడుగు