Wednesday, November 27, 2024

కైక కోరిన రెండు వరాలు: భరతుడి పట్టాభిషేకం, రాముడి అరణ్యవాసం

రామాయణమ్ – 23

దశరథుడు బ్రతిమాలుతున్న కొద్దీ బెట్టు చేయడం ఎక్కువ అయ్యింది కైకకు. ఆవిడ ఆయనకు ప్రియసతి. ఆవిడ మనసుకు కొంచెం కష్టం కలిగినా సహించి భరించలేడు ఆ రాజు!

మెల్లగా ఆవిడ కేశాలు తన చేతిలోకి తీసుకుని ‘‘కైకా!  నీ కన్నా రాముడికన్నా ప్రియమైన వారు ఎవరున్నారు నాకు ఈ లోకంలో? నా రాముడి మీద ఒట్టు వేసి చెపుతున్నాను నీ కేమి కావాలో చెప్పు. క్షణంలో తీరుస్తాను. నామీద నీకు ఎంత అధికారమున్నదో నీకు తెలుసు. నేను చేసిన పుణ్యము మీద ఒట్టుపెట్టి చెపుతున్నాను నీ కోరిక చెల్లిస్తాను.’’

ఇన్ని రకాలుగా హామీలు తీసుకున్నతరువాత కైక తన మనసులో గల కోరిక వెల్లడించడానికి ఉద్యుక్తురాలయ్యింది. హఠాత్తుగా వచ్చి పడిన మృత్యువులాగ ఆవిడ నోట మాట బయల్పడింది.

Also read: కోపగృహంలో కైక, ప్రాధేయపడుతున్న దశరథుడు

‘‘పంచభూతాలు, సూర్యచంద్రుల, గంధర్వులు, దేవతలు అందరూ కూడా నీవు పెట్టిన ఒట్లు విన్నారు.  మహారాజా, నీవు నాకు మునుపు ఇచ్చిన రెండు వరములు ఇప్పుడు కోరుకో దలచుకొన్నాను . …వాటిని సత్యసంధుడవైన నీవు ఇప్పుడు చెల్లించవలెను లేని పక్షమున నా ప్రాణములు విడువ గలదానను’’ అని పలికింది

దశరథుడు కామముతో కప్పబడిన మనస్సుకలవాడై, పాశములో చిక్కిన లేడిలాగ అయిపోయాడు…

‘‘అవి..ఆ వరములు…రాముని అభిషిక్తుని చేయుటకు నీవు సకల సంభారములు సమకూర్చుకున్నావు కదా.  వాటితో రాముని బదులుగా భరతుని అభిషేకించు రెండవ వరము….రాముడు పదునాల్గు సంవత్సరములు నారచీరలు, మృగాజినము, జటలు ధరించి దండకారణ్యములో ముని వృత్తి నవలంబించుచూ  నివసించవలె. ఏ శత్రుబాధలేని రాజ్యము భరతునకు లభించుగాక!’’ కైక అలా అని తన మాటలు చాలించి మిన్నకున్నది …..

కానీ ….

ఆ కైక మాటలు పుట్టించిన శబ్దప్రకంపనలు దశరధమహారాజు హృదయకవాటాన్ని భేదిస్తున్నాయి.

Also read: కైక మనసు నిండా విషం నింపిన మంథర

ఆ శబ్దాలను మోసుకొచ్చిన గాలికూడ ఆయనకు అప్రియంగా తోచింది. కొంతసేపు శ్వాసించటం ఆగిపోయింది. నిశ్చేష్టుడైపోయాడు.  నీరసం ఆవహించింది ఆయన శరీరాన్నంతా! అప్పటిదాకా ఆమెచుట్టూ అల్లుకొన్న మోహభావనలు టపటప తెగిపోయాయి. ఆమె అంటే ఉన్న అంతులేని కామభావన అసహ్యము, జుగుప్స గా రూపాంతరంచెందింది.

మొదలునరికిన చెట్టులాగ కూలబడిపోయాడు. ఛీ!ఛీ! అని ఛీత్కారాలు చేసుకుంటూ స్పృహతప్పిపోయాడు. మంత్రప్రభావానికి కట్టుబడ్డ మహానాగు కొట్టే బుసలలాగ విడుస్తున్నాడు ఉచ్ఛ్వాసనిశ్వాసాలు.

చాలాసేపటికి కొంత తేరుకున్నాడాయన నేత్రాలు అరుణిమదాల్చాయి. కన్నులనుండి నిప్పుకణాలప్రవాహంలాగ ఆయన చూపులు కైకను కాల్చివేసేటట్లుగా ఉన్నాయి.

చాలా తీవ్రంగా దూషించాడు కైకను.  ‘‘ఓసీ దుష్టురాలా, పాపాత్మురాలా సర్వప్రాణికోటి హితముగోరే రాముడు నీకేం అపకారంచేశాడే? నేనేమి ద్రోహం చేశానే నీకు? నిన్ను కన్నతల్లిలాగ చూసుకుంటున్నాడు కదనే వాడు. వాడికే అనర్ధము తలపెడతావా నీవు, ఓసి పాతకీ! నీవు రాజకుమారివని తలచి తెచ్చుకొన్నానే కానీ లోకాలన్నీదహించివేసే మహాభయంకర విషనాగువని అప్పుడు నాకు తెలియదే! రాముడిలోని ఒక్కదోషము చెప్పునీవు.  ఏ దోషమున్నదని అడవులకు పంపాలి?

Also read: మంథర రంగ ప్రవేశం

‘‘కౌసల్యను, సుమిత్రను, నా సకలైశ్వర్యాలను, రాజ్యాన్ని, చివరకు నా ప్రాణాన్నయినా విడుస్తాను కానీ నా రాముని నేను విడువలేను. వాడే నాకు పరమానందము. వాడే నాకు బ్రహ్మానందము. వాడేనాకు దివ్యచైతన్యము. సూర్యుడులేకుండా ఈ ప్రపంచముండవచ్చునేమో! నీరు లేకుండా పంటలు పండవచ్చునేమో. కానీ నారాముడు లేక నాప్రాణముండదు! కైకా! ఇకచాలు ! ఈ పాపపు ఆలోచన విడిచిపెట్టు! నాకు భరతుడిపైగల ప్రేమను పరీక్షించడానికి ఇలా మాట్లాడావా? నీవేకదా రాముడు సకల గుణాభిరాముడు, జ్యేష్ఠుడు వానికే రాజ్యాధికారమున్నదని నిన్నటిదాకా నాతోపలికెడిదానవు! ఈ రోజు నా కేదయినా పరీక్షపెట్టదలిచావా? చెప్పు!

Also read: రాముడితో దశరథుడి సంభాషణ

‘‘ఎంతోనీతిసంపన్నురాలవు అనికదా నీకున్నపేరు! ఈ రోజు నీబుద్ధిలో ఈ వికారం ఏల జన్మించింది? పూర్వమెప్పుడూ నీలో రవ్వంత దోషము కూడా నాకు కానరాలేదు! మరి ఈరోజు ఎందుకిలా? నారాముడు ! ఇక్ష్వాకు రాకుమారుడు! అత్యంతసుకుమారుడు!  ఘోరారణ్యములలో జటాధారియైసంచరించవలెనన్న క్రూరబుద్ధి నీలో ఎలా పుట్టింది? కైకా నీకోరిక ఉపసంహరించుకో. అసలు నీకు రాముడుచేసినంత శుశ్రూష భరతుడు కూడా చేయలేదే. రాముడు మహావీరుడు. ధర్మవీరుడు, దయావీరుడు, దానవీరుడు, యుద్ధవీరుడు!  కపటములేని రామునియందు నీకింతకాఠిన్యముతగదు. కైకా! కాటికి కాళ్ళు చాపుకొన్న ముసలివాడను నేను నామీద కరుణచూపవే. నీ కాళ్ళుపట్టుకుంటాను’’ అని పరిపరి విధాలుగా కైకను ప్రాధేయపడుతున్నాడు దశరథ మహారాజు.

Also read: రామపట్టాభిషేకంపై వృద్ధనరపతి నిర్ణయం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles