Saturday, November 23, 2024

పరశురాముడి గర్వభంగం

రామాయణమ్17

చివురుటాకులాగ వణికిపోయాడు దశరథుడు.

ఇంద్రుడి వద్ద ఇక శస్త్రము ముట్టనని ప్రమాణము చేసి, సంపాదించిన భూమినంతా కశ్యపుడికి దానంచేసి, మహేంద్రగిరి మీద వానప్రస్థం గడుపుతున్న ఈయన (పరశురాముడు) ఇచ్చటికి ఇలాగ ఉన్నపళంగా!ఈ రాజకులాంతకుడు ఎందుకు వచ్చాడు!? మదిలో ఈ ప్రశ్న కలకలంరేపుతున్నది దశరథునకు.

పరశురాముడు తన ఎదురుగా ఉన్న రామునితో,

‘‘ రామా !నీ పరాక్రమము అద్భుతము! శివధనుస్సు విరచినావని విన్నంతనే నీవెంతటి వాడివో తెలుసుకోవాలని మరియొక ధనుస్సు తెచ్చినాను. ఇదిగో చూడు! కొన్ని కారణాలవల్ల శివధనుస్సు బలహీనముగా ఉన్నది. ఇది అత్యంత దృఢమైన వైష్ణవధనువు! మా తండ్రి గారి వద్దనుండి నాకు ప్రాప్తించినది. ఈ వైష్ణవ ధనుస్సు ఎక్కుపెట్టి శరసంధానము చేయవోయ్! నీ బలమేమిటో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నీకు నాతో ద్వంద్వయుద్ధాన్ని అనుగ్రహిస్తాను’’ అని పరశురాముడు పలికినమాటలు దశరధుడి గుండెలలో ములుకులుగా గుచ్చుకొన్నవి….

‘‘భార్గవా! నా రాముడుపసిబాలుడు. ఇప్పుడిప్పుడే జీవితంలో అడుగు పెడుతున్నాడు. జీవనమాధుర్యమేదీ ఇంతవరకు రుచిచూసి ఎరుగడు!  ఇంకా కాళ్ళ పారాణి ఆరలేదు! వాడింకా పసివాడు. నా రామునకు ఏ విధమైన అమంగళము ప్రాప్తించినా మేమెవ్వరమూ జీవించలేము’’ అని వేడుకొనడం మొదలుపెట్టాడు దశరథుడు.

Also read: సీతారామ కళ్యాణం

ఈ వేడుకోలు మాటలేవీ పరశురాముడు వినటంలేదు! ఇంకా గట్టిగా స్వరం పెంచి మాట్లాడుతూ…‘‘రామా ! నీవు సుక్షత్రియుడవే అయినట్లయితే ఈ వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టు!’’ అని హుంకరించాడు.

తనను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్న భార్గవరాముని చూచి దశరథరాముడు చాలా ‘తగ్గిన గొంతుతో’ ఇలా మాట్లాడాడు. రాముడు గొంతు తగ్గించి మృదువుగా ‘‘…. పరశురామా! నీ కధలు పెద్దలు చెప్పగా విన్నాను. అమోఘమైన నీ పితృభక్తి,  తండ్రి ఋణము నీవు తీర్చుకున్న విధానము ఇతరులెవ్వరకు సాధ్యముకానిది. నన్ను పరాక్రమం లేనివాని వలే, క్షత్రియ ధర్మాచరణ సాధ్యముకానివానివలే, తేజోహీనునివలే అవమానిస్తున్నావు!  నా పరాక్రమము నీకు రుచి చూడవలెనున్నదా?  అయితే ఇదిగోచూడు’’ అంటూ పరశురాముని చేతినుండి చాపము, శరము తీసుకొని విల్లెక్కుపెట్టి శరసంధానము చేశాడు. తీవ్రమైన కోపంతో ’’ఓ భార్గవరామా! నీవు బ్రాహ్మణుడవు కావున నీ ప్రాణము తీయను. నేను ఒక్కసారి బాణం సంధిస్తే అది వృధాగా పోరాదు. నీ పాదగమన శక్తిని కొట్టమంటావా! నీవు తపస్సుచే సంపాదించుకున్న ఉత్తమలోకాలను కొట్టమంటావా’’ అని అడిగాడు శ్రీరాముడు.

Also read: శివధనుర్భంగం: బాలరాముడు కళ్యాణరాముడైన వేళ

రాముడు వైష్ణవధనుస్సును ఎక్కుపెట్టగనే పరశురాముడు నిర్వీర్యుడై,  జడుడై, నిశ్చేష్టుడయిపోయాడు. అప్పుడు పరశురాముడు మెల్లగా ‘‘రామా! నా గమన శక్తిని కొట్టవద్దు, నా తపోలోకములను కొట్టుము. ఇక ఆలస్యము చేయకయ్యా’’ అని అనగానే రాముడు ఆయన చెప్పినట్లుగా చేసినాడు!

అప్పుడు పరశురాముడు రామచంద్రునితో “రామా!నేను నీ చేతిలో పరాజితుడనయినాను. అందుకు నేను సిగ్గుపడను’’ అని పలికి  మహేంద్రగిరికి అతివేగముగా వెళ్ళి పోయినాడు.

Also read: విశ్వామిత్రుడిని ‘బ్రహ్మర్షీ’ అని సంబోధించిన వశిష్ట మహర్షి

పరశురాముడు వెళ్ళిన పిదప రాముడు ఆ ధనుస్సును, శరమును వరుణునకు అప్పగించివేశాడు.

తండ్రి వైపు తిరిగి, ‘‘తండ్రీ తదుపరి కర్తవ్యాన్ని సెలవివ్వండి! మీ అధీనంలోని చతురంగబలాలను అయోధ్యవైపు కదలటానికి అనుజ్ఞ ఇవ్వండి’’ అనిఎంతో వినయంగా మృదుమధురంగా తండ్రికి సంతోషం కలిగేవిధంగా పలికాడు!

.

ఒక్కసారిగా నడిసంద్రంలో పెనుతుఫాను వెలిసి గండంగడిచిన నావికుడి హృదయంలాగ దశరథుడి మనస్సు తేలిక పడింది.

 రాముని తన బాహువులతో కౌగలించుకొని శిరస్సుపై ముద్దిడి ఆనందభరితుడయినాడు.

Also read: బొందితో కైలాసం, త్రిశంకు స్వర్గం

అయోధ్య చేరుకున్నారంతా!

కౌసల్యా, సుమిత్ర, కైకేయి  కొత్తకోడళ్లకు ఎదురేగి ఆహ్వానం పలికి మంగళకరంగా గృహదేవతలను పూజించి పెద్దలందరి దీవనలు కోడళ్లకు ఇప్పించి ఎన్నో భూరిదానాలు చేశారు.

నూతన దంపతులు సుఖంగా కాలం గడపసాగారు.

కొంతకాలానికి మేనమామ యుధాజిత్తుతో కలసి భరతుడు ,శత్రుఘ్నునితో కూడి వారి వారి భార్యలను వెంటనిడుకొని కేకయ రాజ్యానికి ప్రయాణ మయినారు.

శ్రీరామచంద్రుడు ,లక్ష్మణుడు తండ్రికి సేవచేస్తూ పురజనుల అభిమానాన్ని చూరగొంటున్నారు.

సీతారాములు అన్యోన్య ప్రేమతో ఆనందంగా కాలము గడుపుతున్నారు. సీతాదేవి అంటే రాముడు, రాముడు అంటే సీతాదేవి వీరిరువురికీ భేదంలేదు అని లోకం చెప్పుకోనారంభించింది!

Also read: వశిష్ట, విశ్వామిత్రుల సంఘర్షణ

…….

N.B:

దశరథ మహారాజు పరశురాముడి కాళ్ళ వేళ్ళ బడుతున్నాడు. వేడుకుంటున్నాడు. ఇది అంతా రామచంద్రుడు చూస్తున్నాడు..

ఆయనకు తన బలమేమిటో తనకు సంపూర్ణంగా తెలుసు, అయినా తండ్రి మాట్లాడుతున్నప్పుడు రాముడు ‘‘ఏమిటి ఈయనతో మాట్లేడేది నాన్నగారూ ! ఈయన సంగతి నేను తేలుస్తాను!’’ అని పొరపాటున గూడా మాట్లాడలేదు! అలా మాట్లాడితే తండ్రిని తగ్గించినట్లవుతుంది! అది తన అహంకార ప్రదర్శన అవుతుంది! పరశురాముడికి జవాబిచ్చే సందర్భములో తగ్గిన గొంతుతో సంభాషిస్తాడు రాముడు. ఇక్కడే రాముని గుణగణాలు తెలుస్తాయి. తండ్రి ఎదుట, గురువుఎదుట, పెద్దలయెదుట ఎప్పుడూ పెద్దపెద్దగొంతేసుకొని మాటలాడరాదు!

అందుకే వాల్మీకి మహర్షి ఈ శ్లోకం ఇలా చెపుతారు.

శ్రుత్వా త జ్జామదగ్న్యస్య వాక్యం దాశరథి స్తదా

గౌరవాద్యంత్రిత కధః పితూ రామ మథాబ్రవీత్.

పితుఃగౌరవాత్ యంత్రితకథః ……తండ్రిమీద గౌరవము వలన తగ్గింపబడిన సంభాషణము కలవాడై …….ఆహా ఎంత గొప్పగా చెప్పారు మహర్షి!

రామాయణమ్ మనకు జీవన విలువలను నేర్పుతుంది!

ప్రతి సన్నివేశంలోనూ జీవన విలువలే! అందుకే రామాయణమ్ జీవనపారాయణమ్ కావాలి!

…..

శ్రీమద్రామయణంలోని బాలకాండ సమాప్తము.

…..

Also read: అహల్య శాపవిమోచనం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles