రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారిగా సుప్రసిద్ధులు. తిరుమల తిరుపతి దేవస్థానం.. అనగానే మొట్టమొదటగా గుర్తుకొచ్చేవారు PVRK. పీవీ నరసింహారావుగారు, ఎన్టీఆర్ దగ్గర కూడా కీలకమైన బాధ్యతల్లో అధికారిగా పనిచేశారు. వారు రాసిన పుస్తకాలు ద్వారా జనబాహుళ్యానికి బాగా పరిచయమైనారు. టిటిడిలో అంతకు ముందు చెలికాని అన్నారావుగారు ఉండేవారు. వారు చేసిన సేవలు గొప్పవి. ముఖ్యంగా అన్నమయ్య ప్రచారానికి విశేషమైన కృషి చేశారు. వారి విగ్రహాన్ని తిరుపతిలో నెలకొల్పారు. కాకపోతే, ఈ తరాలవారికి చాలామందికి ఆయన గురించి పెద్దగా తెలియదు. చెలికాని అన్నారావుగారిని కూడా మరపించేలా పేరు తెచ్చుకున్న అధికారి పీ వీ ఆర్ కె ప్రసాద్.
వీరి పేరు మొట్టమొదటగా నా చిన్నప్పుడు సుమారు నా 12 ఏళ్ళ వయస్సులో విన్నాను. మా మేనమామ కొప్పరపు సీతారామ ప్రసాదరాయకవి, శతావధాని ద్వారా విన్నాను. నేను నరసరావుపేటలో మా మేనమామగారింట్లో ఉంటూ చదువుకుంటూ ఉండేవాడిని. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మా మామయ్యగారితో ఎన్నో అవధాన, ఆశుకవిత్వ సభలు చేయించి ప్రోత్సహించినవారు PVRK. 2005లో వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం సాంస్కృతిక మండలి చైర్మన్ గా ఉన్నపుడు మా తాతగార్లు కొప్పరపు కవులకు నీరాజనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్రభారతిలో “అవధాన సప్తాహం” నిర్వహించింది. ఆ వేడుకల్లో భాగంగా PVRK ప్రసాద్ గారు ఒకరోజు అతిధిగా వచ్చారు. కొప్పరపు కవుల ప్రాశస్త్యాన్ని సోదాహరణంగా వివరించారు. మళ్ళీ సుమారు 11ఏళ్ళ దాకా వారిని కలవలేదు.
సుమారు 6 ఏళ్ళ క్రితం ప్రముఖ సంపాదకులు కె రామచంద్రమూర్తి, నేనూ కలిసి ప్రసాద్ గారింటికి వెళ్ళాం. అది.. ఎన్టీఆర్ పై మూర్తిగారు ఇంగ్లిష్ లో పుస్తకం రాస్తున్న సందర్భం. ఎన్టీఆర్ తో ప్రసాద్ గారికి ఉన్న అనుభవాలు రికార్డు చేశాం. తిరిగి వచ్చేప్పుడు నేను కొప్పరపు కవులకు మనుమడునని, కొప్పరపు కళాపీఠం ద్వారా నేను చేస్తున్న సేవల గురించి మూర్తిగారు ప్రసాద్ గారికి వివరించారు. వారు నన్ను ఎంతగానో ఆశీర్వదించారు.
పొత్తూరి వెంకటేశ్వరరావుగారు, నేను ఇంకొక సందర్భంలో ప్రసాద్ గారింటికి వెళ్లి కొంచెం సేపు ముచ్చటించాం. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ప్రసాద్ వెళ్లిపోయారు. ఎంతోమంది అధికారులు టీటీడీ లో సేవలు అందించినప్పటికీ, పీవీ నరసింహారావుగారి దగ్గర పనిచేసినప్పటికీ PVRK గారు వేసిన ముద్ర గొప్పది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని వ్యవస్థలను స్థాపించారు. అవి చిరస్థాయిగా మిగిలిపోయాయి.
పీవీఆర్ కె ప్రసాద్ గారు చిరంజీవి.
(ఆగస్టు 21 పీవీఆర్ కె ప్రసాద్ జయంతి, 22వర్థంతి, ఆగస్టు 23 జయంతి)