Saturday, November 23, 2024

సీతారామ కళ్యాణం

రామాయణమ్ 16

సీతాకళ్యాణ వైభోగమే! రామ కళ్యాణ వైభోగమే!

రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో!”

సర్వలోకమనోహరుడైన రాముని వివాహక్రియ జరిపించండి

ఓ ప్రభూ! ఓ మహర్షీ!

అని జనకమహారాజు వశిష్ట మహర్షిని కోరగా,  అందుకు అంగీకరించిన వశిష్టమహర్షి విశ్వామిత్ర,శతానందులను ముందిడుకొని అగ్నివేదిక నిర్మించాడు. తరువాత జనకమహారాజు తన కూతురు సీతాదేవిని సర్వాలంకారభూషితను అగ్నిసాక్షిగా శ్రీరాముని ఎదురుగా ఉంచి

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ

ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా

ఇదిగో! నా కుమార్తె అయిన సీత! ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపుము. నీ చేయితో ఈమె చేయి పట్టుకొనుము (పాణిం గృహ్ణిష్వ పాణినా అనగా చేయిచేయికలుపుట, ఇదీ మన సంప్రదాయము).

Also read: శివధనుర్భంగం: బాలరాముడు కళ్యాణరాముడైన వేళ

పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా!

ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మన్త్రపూతం జలం తదా!!

‘మహాభాగ్యవంతురాలగు ఈమె నిన్ను ఎప్పుడూ నీడలా అనుసరిస్తుంది’ అని పలికి మంత్రపూతమైన జలము వదిలాడు జనకుడు.

అదేవిధంగా మిగిలిన మువ్వురు రాజకుమారులకు వివాహం జరిగింది!

శ్రీ రామచంద్రుడి వివాహము ఘనంగా జరిగింది. ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు!

వివాహము అయిన తరువాత నలుగురుకొడుకులూ ముందు భార్యలతో వెడుతుండగా దశరధుడు వెనుకనుండి వారిని చూస్తూ మహదానంద పడ్డాడు.

Also read: విశ్వామిత్రుడిని ‘బ్రహ్మర్షీ’ అని సంబోధించిన వశిష్ట మహర్షి

సీతారాముల వివాహమయిన తరువాత అందరి వద్ద సెలవు తీసుకొని విశ్వామిత్ర మహర్షి హిమాలయాలకు వెళ్ళిపోయాడు.

………

(అసలు విశ్వామిత్ర మహర్షి పాత్రను ఎంత హఠాత్తుగా ప్రవేశపెట్టాడో అంతే హఠాత్తుగా ఉపసంహరించాడు వాల్మీకిమునీంద్రుడు! ఆయన తన యాగ రక్షణ తాను చేసుకోగలడు. తాటకి తాటతీయగలడు! కానీ రాబోయే రోజులలో ఎన్నో ఘనకార్యాలు చేయవలసి ఉన్న రాముడికి సకలశస్త్రాస్త్ర జ్ఞానమివ్వాలి. రాముడికి గురువు అని అనిపించుకోవాలి. అదీ ఆయన తపన!

నిజానికి విశ్వమిత్రుడికన్నా గొప్పగా యుద్ధవిద్యలు తెలిసిన వాడు ముల్లోకాలలో ఎవడూ లేడు మహావిష్ణువు, మహాదేవుడు తప్ప! రావణ వధ జరగాలంటే  రాముడిపెళ్ళి కావాలి! ఇది చాలా ముఖ్యం. అందుకే రెండు ముఖ్యమైన పనులను తానే స్వయంగా దగ్గరుండి నిర్వర్తించాడు మహర్షి! అదీ విశ్వామిత్రుడు అంటే ! లోకకళ్యాణం కోసం తపించే మహానుభావుడు! అంతేగాని కోపిష్టి వాడు విశ్వామిత్రుడు కాడు!)

……

Also read: బొందితో కైలాసం, త్రిశంకు స్వర్గం

కొత్తకోడళ్ళను తీసుకుని సపరివారంగా అయోధ్యకు బయలుదేరినాడు దశరధమహారాజు. మార్గమధ్యంలో వారంతా ఒక అరణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో అపశకునాలు కనపడ్డవి దశరథ మహారాజునకు. పక్షులు వికృతమైన కంఠంతో కూస్తున్నవి, మృగాలు వారిచుట్టూ ప్రదక్షిణ చేస్తున్నవి. దశరథ మహారాజు మనస్సు ఏదో కీడు శంకిస్తున్నది. ఏదో విపత్తు వాటిల్లే ప్రమాదము ఆయనకు కనపడుతున్నది.

వశిష్టమహర్షి మహారాజు ఆందోళన గమనించి ‘‘రాజా ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నది. కానీ పక్షులప్రవర్తన చూస్తే అది తొలగిపోతుంది అని కూడా తెలుస్తున్నది. కాబట్టి శాంతచిత్తుడవై ఉండు!’’ అని ధైర్యవచనాలు పలికాడు.

వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో గాలి ప్రచండంగా వీస్తూ భూమిమీద చెట్లను వేళ్ళతోసహా పెకిలిస్తూ తనతో తీసుకు వెడుతున్నది. మహావృక్షాలు సైతం గాలిలో వేళ్ళాడుతున్నాయి. భూమి ఒక్కసారిగా కంపించటం మొదలుపెట్టింది!

చతురంగబలాలన్నిటిమీద బూడిద కప్పివేయగా దశరథుడు, ఆయనకుమారులూ, కోడళ్ళు, వశిష్టాదిమునిగణము తప్ప అందరూ మూర్ఛపోయారు. భూమిఅంతటినీ చిమ్మచీకటి ఆవరించింది. ఆ చీకటిలో వారికి దూరముగా ఒక తేజోపుంజము కనపడ్డది. అది అతివేగంగా వారిని సమీపించింది. అప్పుడు ఆ తేజస్సు చూడశక్యము కానంత కాంతితో వెలుగొందుతున్నది.

Also read: వశిష్ట, విశ్వామిత్రుల సంఘర్షణ

ఆ తేజోపుంజము మరేమిటో కాదు జటామండలము ధరించి, భూమిమీద రాజులను భయంకరంగా తన గండ్రగొడ్డలితో సంహరించిన  పరశురాముని రూపమది.

ఆ మహానుభావుడు వారి ఎదుట ప్రత్యక్షమైనాడు.

వశిష్ట మహర్షి ఇచ్చిన అర్ఘ్యపాద్యాదులు స్వీకరించి అత్యంత గంభీర స్వరంతో  ‘‘ఎవడురా ఇక్కడ “రాముడు?’’ అని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్న వినగానే దశరథమహారాజుకు ప్రాణం పోయినంత పని అయ్యింది.

Also read: అహల్య శాపవిమోచనం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles