Thursday, November 21, 2024

సమసమాజమే సోమసుందర్ స్వప్నం!

(డా. ఆవంత్స సోమసుందర్ 6 వ వర్ధంతి సందర్భంగా 12 – 08 – 2022 శుక్రవారం సాయంత్రం కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జరిగిన సభలో నా ప్రసంగ పాఠం సంక్షిప్తంగా…)

సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం నేను హైస్కూలు విద్యార్థిగా ఉండగా అక్కడ వివేకానందుడి జయంతి రోజున మొదటిసారి సో.సు. గారి ప్రసంగం విన్నాను. ఆ కార్యక్రమం ఏర్పాటు చేసింది కూడా సహృదయ మిత్ర మండలే. అలాగే ఈనాటి సమావేశానికి సంకల్పం చేసింది కూడా సహృదయ మిత్ర మండలే. కాన నాకు సో.సు. గారికి అనుసంధానంగా ఉన్న మిత్ర మండలికి ముందుగా నా కృతజ్ఞతలు. వేదిక పై నున్న పెద్దలకీ, సభలోని పెద్దలకి నమస్సులు!

Also read: మనుషులు – వస్తువులు – సంస్కృతి

మూడు విశిష్టతలు

ఈ రోజు మూడు చారిత్రక విశిష్టతల రీత్యా ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదటిది సరిగ్గా వందేళ్ళ క్రితం 1922 లో పిఠాపురం రాజావారికి మహరాజా బిరుదు ప్రధానం చేయబడింది. ఆ సందర్భంగా జరిగిన సభలో చెలికాని లచ్చారావు గారు “దుష్ట మంత్రాంగం” నుండి జాగరూకులై వుండాలని ప్రభువులని హెచ్చరించగా, కోపంతో రాజావారు దుష్టమంత్రాంగం అని ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆ దివాన్ గారి ఉద్యోగం శాశ్వతం చేస్తున్నట్లు ప్రకటించి లచ్చారావుగారికి కోటలోకి ప్రవేశాన్ని నిషేధించారు. ఈ రోజు అంతకు మించిన దుష్ట మంత్రాంగాలు సమాజం అంతటా ఉన్నాయి !

ఇక రెండు 1922 లోనే ఆంధ్రా షేక్‌స్పియర్ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి అధ్యక్షతన పిఠాపురంలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సమావేశం. అందులో ఆయన చేసిన అద్భుతమైన ప్రసంగం. మూడోదీ, ముఖ్యమైనది ఈ మన గ్రంథాలయానికి సంబంధించిన విశిష్టమైన విషయం ఏమిటంటే, 1915 లో విద్యానంద గ్రంథాలయం ఏర్పడింది. తర్వాత సూర్యరాయ గ్రంథాలయం ఏర్పడింది. ఈ రెండు గ్రంథాలయాలు సంయుక్తంగా ఒకే గ్రంథాలయంగా ఏర్పడి శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం గా రూపాంతరం చెందడం 1922 లోనే జరిగింది. కాన ఈ లైబ్రరీ కి సిసలైన శతవార్షికోత్సన సందర్భం ఇదే!

Also read: అంతరాత్మ పెట్టిన కన్నీళ్ళు అంబేద్కర్ అనుభవాలు!

ఈ క్రమంలో సరిగ్గా 1933 వ సంవత్సరం మాధవస్వామి గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం లో కొద్దిమంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. బంతి దగ్గర్లోని తాసీల్దార్ గారి ఇంట్లోకి వెళ్ళి పడింది. తేవడానికని వారింటికి వెళ్ళిన అబ్బాయితో మీ అమ్మగార్నడిగి పులిహోర చేయించుమన్న ఆ తాసీల్దారు గారు తరువాత పట్టణంలో జరిగిన ప్రముఖ నాటకోత్సవాలు అన్నింటికీ ఆ అబ్బాయిని ఆప్యాయంగా తమ కుటుంబంతో పాటు తీసుకుని వెళ్ళేవారు. అలా చిన్నతనం లోనే ఒక గొప్ప సాంస్కృతిక స్థాయి, కళాభిరుచి ఏర్పడటానికి అరమరికలు లేని ఆ స్నేహం నిదర్శనంగా నిలిచింది. ఆ అబ్బాయి పేరు ఆవంత్స సోమసుందర్ కాగా ఆనాటి తహసీల్దారు లాల్ అహమద్ గారు. ఒక మనిషి మహాకవిగా రూపొందే క్రమంలో మతసామరస్యత పోషించిన పాత్రని ఈ రోజు గుర్తించడం అవసరం!

రెండు ప్రపంచాల మధ్య సంఘర్షణ

ఇక 1944లో కోల్కతా లో జరిగిన స్టూడెంట్ ఫెడరేషన్ సభలకి వెళ్ళినప్పుడు అక్కడ హౌరా బ్రిడ్జి పై జీవచ్ఛవంగా పడున్న ఒక దీనుడ్ని చూసి అప్పటిదాకా భావ కవిత్వంలో కొట్టు మిట్టాడుతున్న సో.సు. ఒక్కసారిగా తనలో నుండి ఉప్పొంగిన భావాలకు అక్షరాలుగా మలిచారు. అదే ‘మౌనఘోష’ నే కవితగా వ్యక్తమైంది. అంతేకాదు వజ్రాయుధం లోని ఇతర కవితలన్నింటికీ కూడా ఆసక్తికరమైన నేపథ్యాలు ఉన్నాయి. ఆస్తుల పంపకాలప్పుడు శంఖవరంలో ఉన్న ఆయన What is Philosophy పుస్తకం చదూతూ అందులో జర్మన్ తత్వవేత్త హెయినే రాసిన ఒక వాక్యంతో ప్రభావితం అయ్యీ రాసిన అద్భుతమైన కవితే ‘ఖరార్నామా’ మనిషికి ఉన్నదొక్క జీవితమే అని నినదిస్తుందా కవిత. కవిత్వంలో మొదటిసారి వర్గ దృక్పధాన్ని స్పష్టంగా చెప్పిన కవాయిన. అందుకే, “రెండు ప్రపంచాల మధ్య, రెండు స్వభావాల మధ్య, రెండు వర్గాల మధ్య సాగుతున్న సంఘర్షణ..” అంటారు. కమ్యూనిస్టు మ్యానిఫెస్టోకి కనుక కవితా రూపం ఇస్తే బహుశా అది వజ్రాయుధం లానే ఉంటుందేమో. గతంలో వజ్రాయుధానికి వజ్రోత్సవం పేరిట వ్యాసం రాశాను. త్వరలోనే వజ్రాయుధానికి వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకోగలమని ఆశిస్తున్నాను. నిజానికి వజ్రాయుధం వరకే సో.సు. ని పరిమితం చేయడం అపారమైన ఆయన పాండిత్యానికి అన్యాయం చేయడమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన వంద గ్రంథాల్ని వివిధ ప్రక్రియల్లో రాసినవాడు, అద్వితీయ కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, కళావేత్త, తాత్వికుడు, స్వాప్నికుడు ఇంకా ఎన్నో. కమ్యూనిస్టు రాజ్యాలు కూలి పోయినప్పుడు, పార్లీల్లో చీలికలు వచ్చినప్పుడు “సీకింగ్ మై బ్రోకెన్ వింగ్స్”( Seeking my Broken Wings) అంటూ హృద్యంగా దానిని వ్యక్తం చేశారు. నాకు తెలిసీ ప్రపంచ సాహిత్యంలో అంత చక్కగా ఆ ఘటనని వర్ణించిన కవి మరే దేశంలోనూ ఏ భాషలోనూ లేరు. ఆ కవితా శీర్షిక కోసం ఆయన్ని ‘అంటే మీరు కమ్యూనిజాన్ని రెక్కలూడిపోయిన పక్షితో పోల్చారా?’ అనడిగిన ప్రశ్నకు ఆయన, ‘కాదు, ఎప్పటికైనా పునరుజ్జీవనంతో రెక్కలు కట్టుకు ఎత్తుకేగే పక్షితో పోల్చానం’టారు. అందుకు జీవితంలో తనని నడిపించినవి రెండు – ఒకటి కవిత్వం మరోటి కమ్యూనిజం – అని చివరి నిముషాన కూడా ప్రకటించాడాయన!

Also read: చారిత్రాత్మక పోరాటాల అవలోకనం

పదేళ్ళకు పైబడిన వ్యక్తిగత అనుబంధం

వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని వర్ణించాలంటే సమయం చాలదు. పదేళ్ళకి పైబడిన అనుబంధం ఆయనతో నాది. వజ్రాయుధం పంచమ ప్రచురణకి సిగార్ తో ఉన్న ఆయన ఫొటోను ఎంపిక చేసింది నేనే. అప్పటికే అనేక ఏళ్ళుగా ముద్రణకు నోచుకోని వజ్రాయుధాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ బ్రాంచిలు అన్నింటికీ పోస్టు కార్డులు రాయడం ద్వారా ప్రచురణయ్యేలా ప్రయత్నం చేసింది నేనే. తాను అపురూపంగా దాచుకున్న శ్రీశ్రీ ఆటోగ్రాఫ్ నాకు ఇవ్వడం మొదలు ఎన్నో జ్ఞాపకాల వెల్లువని ఇలా ఒక సమావేశం లో వ్యక్తం చేయడం సులభం కాదు. జార్జి థాంప్సన్ మార్క్సిజం – కవిత్వం మొదలు క్రిస్టోఫర్ కాడ్వెల్ ఇల్యూజన్ – రియాలిటీ (భ్రాంతి – వాస్తవికత) దాకా, బెట్రోల్డ్ బ్రెహ్ట్ అమ్మ మొదలుకొని షెల్లీ ఏరియల్ వరకూ ఎన్నో అమూల్యమైన గ్రంథాలను తెలుగు చేశారు. సాహిత్య విమర్శని సో.సు. లాగా అధ్యయనం చేసిన వారనే మాటటుంచి ఆ దరిదాపుల్లోకి రాగలవారు కూడా ఈనాటికీ లేరు. పరిశోధన విషయంలోనూ అంతే. గురజాడ కన్యాశుల్కం లోని పూర్రిచ్చర్డ్ పద ఆదుపాదులు తేల్చడం మొదలు గోదావరి జళప్రళయ రక్షకుడుగా పేరొందిన వెంకటరెడ్డి, జోగయ్యల్ని వెలుగులోకి తీసుకురావడం వరకూ ఎంతో గొప్ప లోతైన శోధన ఆయనది. వందకి పైబడి పుస్తకాలు రాసి ప్రచురించినా ఎన్నడూ ఏ పత్రిక్కీ పంపింది లేదు. తానుగా పేరు కోసం పాకులాడిందీ లేదు. జ్ఞానపీఠ్ ఆయనకి రాకపోవడం ఆ అవార్డుకి అగౌరవం అని నా అభిప్రాయం!

Also read: కులనిర్మూలన – తులనాత్మక పరిశీలన

అసంపూర్తిగా స్వీయచరిత్ర

గోర్కీ స్వీయచరిత్ర మూడు భాగాల నుండి ప్రేరణ పొందిన సో.సు. తాను కూడా మూడు భాగాలుగా ఆత్మకథ రాయాలని అనుకున్నారు. కానీ రెండు భాగాలే రాయగలిగారు. అందులో కూడా మొదటి భాగం ‘కలలు – కన్నీళ్ళు’ చాలా హృద్యంగా మలిచి న్యాయం చేశారు. తెలుగు సాహిత్యంలో ఒక కవి స్వీయచరిత్ర రాసి మెప్పించడం అరుదు. దానిని సుసాధ్యం చేసారు సో.సు. అందరూ తప్పకుండా చదవాల్సిన స్వీయచరిత్ర అది. రెండో భాగానికి అనారోగ్య కారణాల వల్ల న్యాయం చేయలేక పోయారు. తొంభై ఏళ్ళ జీవితంలో ఎక్కువ కాలం సాహిత్యానికే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి సో.సు. ఆయన కేవలం కవి మాత్రమే అనుకునే వాళ్ళకి ఒక విషయం గుర్తు చేయాలి. ఈ ప్రాంతంలో మొట్టమొదటి పారిశుధ్య కార్మికుల ఉద్యమానికి నేతృత్వం వహించిందీ, రైతు ఉద్యమాల్లో పాలు పంచుకోవడం మొదలు భావాల కారణంగా సొంత పాలకుల చేతనే జైల్లో పెట్టబడి కారాగార జీవితం గడిపి కేసులను ఎదుర్కొన్నదీ సో.సు.గారనేది గుర్తుంచుకోవాలి!

కళాకేళి నికేతన్

కళాకేళి పత్రికని స్థాపించడం మొదలు కళాకేళి నికేతన్ సంస్థ ద్వారా ఆరుద్ర త్వమేవాహం మొదలు ఎన్నో గ్రంథాలు ముద్రించడం, తన సమకాలీన కవి, రచయితలందరి సాహిత్యం మీదా సాధికారిక విమర్శ చేసి వాటిని పుస్తక రూపంలో ముద్రించడం, లిటరరీ ట్రస్ట్ స్థాపించి వర్దమాన కవులు, రచయితల్ని ప్రోత్సహించడం ఆయన నిర్వహించిన అసంఖ్యాక పాశ్వాల్లో కొన్ని మాత్రమే. సూటిగా స్పష్టంగా జీవించిన ఆయన ఎప్పుడూ రాజీ ధోరణిని అవలం బించింది లేదు. తెలంగాణ పోరాట కాలంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్న ప్రతి సమావేశం లోనూ వజ్రాయుధ గేయాల్ని ఎలుగెత్తి పాడుకునే సంప్రదాయం ఉండేది. అలాంటిది ఈ రోజు సొంత గడ్డ మీదే సోమసుందర్ పేరు తెలిసిన వారు తక్కువ. ‘శాస్త్ర జ్ఞానం లేని ఉత్పత్తి విషంగా మారుతుంది’ అంటారు సో.సు. భ్రాంతి – వాస్తవికత కి ముందుమాటగా శీర్షిక లో. అలాంటి విషాన్ని ఈ రోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కాన ఈ స్తబ్ధతని అధిగమించడం అవసరం!

Also read: మరిచిపోలేని మహా స్పందన: మహాపండిత్ రాహుల్జీ సమాలోచన

సత్యం-శివం-సుందరం, అదే కవుల లక్ష్యం

వారసత్వం అనేది ఒక్కరిది కాదు, ముందుకొచ్చే ప్రతి ఒక్కరిదీ. లిటరరీ ట్రస్ట్ కార్యక్రమాల సంగతి అలా ఉంచితే కేవలం సో. సు. సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి, తద్వారా ప్రజల్లోకి దానిని తీసుకుని వెళ్ళడానికి సోమసుందర్ స్టడీ సర్కిల్ లేదా ఫోరం వంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మిత్రులు ఆలోచిస్తారని ఆశిస్తాను. చివరగా బతికున్నన్నాళ్ళూ ఎన్నోసార్లు తిట్టుకున్నాం. మళ్ళీ కలుసుకున్నాం. బహుశా మా తాతయ్యతో కూడా నేను సో.సు.తో ఉన్నంత చనువుగా లేనేమో. ఆ అనుభవాలను అన్నింటినీ అదిలిస్తే ఇక ఆ ప్రవాహం ఆగదు.

 శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తన అనుభవాలు – జ్ఞాపకాలు లో అంటారు, ‘సత్యం – శివం – సుందరం ఇంతే కవుల ధ్యేయం” అని. సో. సు. గారి జీవితానికి సరిగ్గా అతికినట్లు సరిపోయే వాక్యమది. జీవితాంతం సత్యం కోసమే బతికి శివాన్ని అంటే అందరి బాగుని ఆశించి సుందరాన్ని , జీవితంలోని సౌందర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించిన మహామనీషి సో.సు. ఆయనకిదే నా ఆత్మీయ నీరాజనం. సెలవు!

Also read: కట్టిన దుస్తులు పసుపు ! పట్టిన జెండా ఎరుపు !! రాహుల్ సాంకృత్యాయన్ !!!

  – గౌరవ్, సామాజిక కార్యకర్త

    డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles